ఓఆర్ఆర్ గ్రామాలకు మహర్దశ..మున్సిపాలిటీల్లో విలీనానికి కసరత్తు

ఓఆర్ఆర్ గ్రామాలకు మహర్దశ..మున్సిపాలిటీల్లో విలీనానికి కసరత్తు
  • మారనున్న గ్రామాల రూపురేఖలు
  • పెరగనున్న మున్సిపాలిటీల విస్తీర్ణం
  • కనుమరుగు కానున్న అమీన్ పూర్ మండలం
  • కొత్తగా రెండు మున్సిపాలిటీలు, రెండు జీహెచ్ఎంసీ డివిజన్లకు ప్లాన్

సంగారెడ్డి/రామచంద్రపురం, వెలుగు : ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాల విలీనప్రక్రియ ముందుకు సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కు పక్కనున్న సంగారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలిపే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. శివారు మున్సిపాలిటీలలో ఆయా గ్రామాలను కలిపితే వాటి రూపురేఖలు మారడమే కాకుండా అభివృద్ధి వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఔటర్ రింగ్ రోడ్డు విస్తరించి ఉన్న పటాన్ చెరు నియోజకవర్గంలో రెండు కొత్త మున్సిపాలిటీలు పెరుగనుండగా అమీన్ పూర్ మండలం పూర్తిగా కనుమరుగు కానుంది.

పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రస్తుతం 4 మండలాలు, జీహెచ్ఎంసీకి చెందిన 3 డివిజన్లు విస్తరించి ఉన్నాయి. రింగ్ రోడ్డుకు పక్కనున్న రామచంద్రాపురం మండలంలోని 5 గ్రామాలను గతంలో తెల్లాపూర్ మున్సిపాలిటీలో కలిపారు. తాజాగా మళ్లీ శివారు గ్రామాల విలీన అంశం ముందుకు రావడంతో తెల్లాపూర్, అమీన్​పూర్​, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీల పరిధి మరింత పెరగనుంది.

ఈ చర్యతో అమీన్ పూర్ మండలం కనుమరుగై అందులోని ఐదు గ్రామాలతో ఒకటి, పటాన్ చెరు ఔటర్ కు ఆనుకొని ఉన్న ఆరు గ్రామాలతో మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు కానున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియపై జిల్లా యంత్రాంగం వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. 

 జీహెచ్ఎంసీ పరిధిలోకి రెండు మున్సిపాలిటీలు? 

పటాన్ చెరు సెగ్మెంట్ పరిధిలోని ప్రస్తుత రెండు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న తెల్లాపూర్, అమీన్ పూర్ మున్సిపాలిటీలు కొత్త జీహెచ్ఎంసీ డివిజన్లుగా రూపాంతరం చెందనున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం రామచంద్రాపురం మండలంలో ఉన్న ఆరు గ్రామాల్లో నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న బండ్లగూడ గ్రామాన్ని జీహెచ్ఎంసీలో కలిపి మిగతా ఐదు గ్రామాలతో తెల్లాపూర్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. దీంతో రామచంద్రాపురం పూర్తిగా మండల స్వభావాన్ని కోల్పోగా

అప్పటికే పెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న అమీన్ పూర్ ను స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మార్చారు. అమీన్ పూర్ మండలంలో మిగిలి ఉన్న 8 గ్రామాలను ఎక్కడా కలపకుండా గ్రామ పంచాయితీలుగానే ఉంచారు. తాజాగా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అమీన్ పూర్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేసి ఆ 8 గ్రామాలను కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే పటాన్ చెరు మండలం పోచారం, ముత్తంగి, ఇస్నాపూర్, చిట్కూల్

బచ్చుగూడెం, రామేశ్వరంబండ, పాశమైలారం గ్రామాలను కలిపి మరో కొత్త మున్సిపాలిటీగా మార్చనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పటాన్ చెరు ఔటర్ కు ఆనుకొని ఉన్న ఘనాపూర్, కర్ధనూర్, పాటి, నందిగామ, భానూర్ గ్రామాలను తెల్లాపూర్ మున్సిపాలిటీలో లేదా కొత్తగా ఏర్పాటు చేసే బల్దియాలో కలిపే 
అవకాశాలు ఉన్నాయి. 

పటాన్ చెరు సెగ్మెంట్ లో..

రింగ్ రోడ్డు శివారు గ్రామాల విలీన ప్రక్రియ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ లో 5 జీహెచ్ఎంసీ డివిజన్లు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న పటాన్ చెరు, భారతి నగర్, రామచంద్రపురం డివిజన్ల తోపాటు మరో రెండు కొత్త డివిజన్లు పెరుగుతాయి. అలాగే ఈ సెగ్మెంట్ లో ఇప్పటికే అమీన్ పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీలు ఉండగా, వీటితోపాటు కొత్తగా మరో రెండు మున్సిపాలిటీలు ఏర్పాటయితే ఆ సంఖ్య కూడా ఐదుకు చేరుతుంది.

దీంతో ఐదు కార్పొరేషన్ డివిజన్లు, ఐదు మున్సిపాలిటీలతో పటాన్ చెరు అతిపెద్ద నియోజకవర్గంగా అవతరించనుంది. హైదరాబాద్ కు పటాన్ చెరు దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతంలో నివసించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. కొత్త కాలనీల ఏర్పాటు కారణంగా ఈ ప్రాంతంలో జనాభాతో పెరగడంతో పాటు అభివృద్ధి కూడా అదే తరహాలో జరుగుతోంది.