దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)’ టెన్త్ ఎగ్జామ్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేసి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌ను రద్దు చేసింది. అలాగే మే 17 నుంచి ప్రారంభం కావాల్సిన టెన్త్ పరీక్షలను క్యాన్సిల్ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు కూడా అదే విధమైన నిర్ణయాలు తీసుకున్నాయి. వీటికి కొనసాగింపుగా నీట్ పీజీ, జేఈఈ మెయిన్ పరీక్షలు రీషెడ్యూల్ అవుతున్నవి. ఐసీఎస్సీ, ఐఎస్సీ పరీక్షలు కూడా అదే వరసలో నిలిచినవి. ఈ విధంగా దేశంలోని అత్యధిక బోర్డు పరీక్షలు రద్దు చేస్తున్నారు. లేదా వాయిదా వేస్తున్నారు. అయితే పరీక్షలు రద్దు చేసినా తర్వాతి క్లాస్‌లకు ప్రమోట్ చేసే విధానం స్టూడెంట్లకు న్యాయం చేసేలా ఉండాలనే డిమాండ్ వస్తోంది.
ప్రభుత్వం, పేరెంట్స్ కు బాధ్యత ఉంది
ప్రస్తుతం రెండు ముఖ్య విషయాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. అందులో ఒకటి, పరీక్షలను రద్దు చేయడం వల్ల స్టూడెంట్ల భవిష్యత్తు దెబ్బతింటుందనే వాదన, దానికి ప్రతిగా పరీక్షల కన్నా ప్రాణాలు ముఖ్యం కదా అనే మరో వాదన కూడా ఉంది. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే రోజువారీ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నది మన దేశంలోనే. కరోనా టెస్టులు పరిమితంగా జరుగుతుంటేనే పరిస్థితి ఇలా ఉంది. ఇక ఎక్కువ సంఖ్యలో టెస్టులు జరిగితే కేసులు భయంకరంగా పెరిగే అవకాశం ఉంది. పెండ్లిండ్లు, పేరంటాలు, సభలు, ర్యాలీలు, మతపరమైన వేడుకలు, బార్లు, వైన్ షాపులు, సినిమా థియేటర్లు వగైరా వాటికి లేని ప్రమాదం స్కూళ్లు నడిస్తేనే వస్తుందా? అనే ప్రశ్న కూడా వుంది. వాటన్నింటినీ నియంత్రించాల్సిందే. కానీ, వాటితో విద్యా సంస్థలను పోల్చడం సరైంది కాదు. వాటిలో పాల్గొనే వారి భద్రతా బాధ్యత.. ప్రభుత్వం కన్నా సంబంధిత వ్యక్తులపైనే ఎక్కువ ఉంటుంది. కానీ, భావి పౌరులైన స్టూడెంట్ల భద్రతా బాధ్యత పేరెంట్స్తోపాటు ప్రభుత్వంపై కూడా ఉన్నది. ఈ ఎడ్యుకేషనల్ ఇయర్లో స్కూళ్లు, కాలేజీలు నామమాత్రంగా కొన్ని రోజులు మాత్రమే పని చేశాయి. తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 24 వరకు 43 రోజులే పనిచేసినవి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల స్టూడెంట్లకు తప్ప ప్రభుత్వ స్కూళ్లు, బడ్జెట్ బడుల్లోని ఎక్కువ మంది స్టూడెంట్లకు అందనేలేదు. అందువల్ల సిలబస్ పూర్తి కాలేదు. ఈ పరిస్థితిలో పరీక్షలు నిర్వహిస్తే ఒరిగేదేముంది? పరీక్షలు నిర్వహించకపోయినా ప్రమోట్ చేయక తప్పదు. అందుకనే ‘ఆబ్జెక్టివ్ క్రైటేరియా’ ప్రాతిపదికన ఫలితాలు ప్రకటిస్తామని సీబీఎస్ఈ.. అదే విధంగా ఎస్ఎస్సీ బోర్డులు ప్రకటించినవి. అయితే అవి చెప్పే ఆబ్జెక్టివ్ క్రైటేరియా విధానం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందా? అనేది సందేహమే. క్రైటేరియా ఏదైనా స్టూడెంట్ల ప్రతిభా పాటవాలకు న్యాయం చేసేలా ఉంటే చాలు.
ప్రైవేట్ స్కూల్ సిబ్బందిని ఆదుకోవాలి
ఇక రెండో విషయం, పరీక్షలు రద్దు చేయడం వల్ల ప్రైవేట్ స్కూళ్లు ముఖ్యంగా తక్కువ ఫీజు తీసుకునే బడ్జెట్ స్కూల్స్, వాటిలో పని చేసే సిబ్బందికి సంబంధించింది. ఈ సమస్యను కూడా ప్రభుత్వం తగిన రీతిన పరిష్కరిస్తే బాగుంటుంది. స్కూళ్లలో నేరుగా క్లాసులు జరగకపోవడంతో ఫీజులు వసూలు కానందున మేనేజ్మెంట్లు ఆదాయం కోల్పోయాయి. ఎంతో కొంత వసూలైనా అది అద్దెలు, కరెంట్ బిల్లులు, ట్యాక్సులు, మెయింటెనెన్స్ ఖర్చులకు కూడా సరిపోక ఇబ్బంది పడుతున్న స్కూళ్లు చాలా ఉన్నవి. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా మిడిల్ రేంజ్ ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే ఆన్లైన్ క్లాసుల పేరుతో పూర్తి స్థాయిలో ఫీజులు వసూలు చేసుకున్నవి. దాదాపు 90 శాతం ప్రైవేట్ బడులు ఏడాదిపైగా తమ టీచింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోయినవి. అనేక టీచర్ల కుటుంబాలు పస్తులతో రోజులు గడుపుతూ కుమిలి పోతున్నవి. మిగులు ఆదాయాలు ఉన్న యాజమాన్యాలు కూడా కనీస వేతనాలు ఇవ్వకుండా టీచర్లు, సిబ్బందిని గాలికి వదిలేసినవి. ఆన్లైన్ క్లాసులు చెపుతున్న కొద్ది మంది టీచర్లకు మాత్రమే ఎంతో కొంత చెల్లించినవి. ఈ పరిస్థితిని అర్థం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ప్రైవేట్ స్కూల్ టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడానికి నెలకి రెండు వేల రూపాయల నగదు, ఇరవై ఐదు కిలోల సన్న బియ్యం సాయం చేయడం ఒక మంచి పరిణామం.
ప్రైవేట్ విద్యా సంస్థలను కట్టడి చేయాలి
విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1)(సి)ని అమలు చేసినా లేదా ఆంధ్రప్రదేశ్ లాగా స్కూళ్లలో చదివే స్టూడెంట్ల తల్లులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసే పథకం లాంటిది అమలు చేసినా పరోక్షంగా ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు మేలు జరిగేది. ఫీజులు, స్కూళ్ల నిర్వహణ తదితర విషయాల్లో ఎలాంటి నియంత్రణకు అంగీకరించకుండా యాజమాన్యాలు నియంతృత్వంగా వ్యవహరించడంతో పేరెంట్స్ తోడ్పాటును, ప్రభుత్వ మద్దతును పొందలేక పోతున్నవి. ఫీజులు వసూలు చేసుకోవడానికి స్కూళ్లను పని చేయించాలని, ఫీజులు చెల్లించకపోతే మార్కులు అప్ గ్రేడ్ చేసేది లేదని, పరీక్షల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడం వంటి యాజమాన్యాల వైఖరి అసహనంగా మారుతోంది. కరోనా మహమ్మారి తెచ్చిన విపత్కర పరిస్థితుల్లో బోర్డు పరీక్షలు రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లే.. ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించే చర్యలను కూడా ప్రభుత్వం చేపడితే భవిష్యత్ విద్యా రంగానికి భరోసా కలుగుతుంది.
ఆబ్జెక్టివ్ క్రైటేరియా ఇలా ఉంటది
ఆబ్జెక్టివ్ క్రైటేరియా విధానంలో నిర్ణయాలు స్టూడెంట్లకు, స్కూళ్లు, కాలేజీలకు లబ్ధి చేకూర్చేలా ఉంటాయి. ఎగ్జామ్స్ ద్వారానే కాక.. స్టూడెంట్ ప్రవర్తన, క్రమశిక్షణ, హాజరు, ప్రాజెక్ట్ వర్క్, లెర్నింగ్ స్కిల్స్.. ఇతర అంశాల ఆధారంగా స్టూడెంట్ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. రాష్ట్రంలో టెన్త్ స్టూడెంట్లు 45 రోజులే నేరుగా క్లాసులకు హాజరయ్యారు. ఆ టైంలో ఒక ఫార్మెటివ్ అసెస్మెంట్(ఎఫ్‌ఏ-1) మాత్రమే జరిగింది. ఈ ఒక్క పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా స్టూడెంట్ సామర్థ్యాన్ని అంచనా వేసే అవకాశం లేదు. ఆబ్జెక్టివ్ క్రైటేరియా విధానంలో మార్కులు వేసేందుకు స్టూడెంట్ 9వ తరగతిలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారే విషయాన్ని త్వరలో బోర్డులు ప్రకటించనున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ‘మల్టీ క్రైటేరియా ఎనాలసిస్, పాయింట్ బేస్డ్ సిస్టం’ అని కూడా అంటారు.
- నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త