హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న పీజీఈసెట్ వెబ్ఆప్షన్ల ప్రక్రియను రీషెడ్యూల్ చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియను ఈ నెల 4 నుంచి మొదలుపెట్టనున్నామని అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్ బాబు తెలిపారు. ఇప్పటికే 11 వేల మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారని చెప్పారు.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో విద్యార్థుల అభ్యర్థన మేరకు షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 4,5 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని, ఆరో తేదీన ఎడిట్ ఆప్షన్ ఉంటుందని వివరించారు. ఈ నెల 9న సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు 13లోగా కాలేజీలో రిపోర్టు చేయాలన్నారు.