ఎన్నికల బదిలీలు షురూ! ఆఫీసర్లను ఏరికోరి మరీ పోస్టింగ్​లు ఇప్పించుకుంటున్న ఎమ్మెల్యేలు

  •     ఆగస్టు నాటికి నియోజకవర్గాలకు చేరనున్న ఎలక్షన్​ మనీ?
  •     టోల్​గేట్లు, నియోజకవర్గ సరిహద్దు మండలాల్లో గట్టి నిఘా
  •     పార్టీలో కోవర్టుల కదలికల పైన గురి 
  •     మునుగోడు బైపోల్​ ఎపిసోడ్​తో అధికారుల్లో టెన్షన్​ 

నల్గొండ, వెలుగు; ఎన్నికల వేడి మొదలవడంతో నల్గొండ జిల్లాలో బదిలీల పర్వం షురూ అయ్యింది. ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన ఆఫీసర్లను ఏరికోరి మరీ పోస్టింగ్​లు ఇప్పించుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలలు ఉండటంతో ఇప్పటి నుంచే తమ వ్యూహానికి పదును పెట్టారు. మునుగోడు బైపోల్​లో పనిచేసిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్ఐలను తిరిగి వాళ్ల పాత స్థానాల్లో నియమించారు.  తాజాగా నల్గొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి బదిలీ కాగా, లాంగ్​స్టాండింగ్​ కారణంగా దేవరకొండ ఆర్డీఓ గోపీరాం ట్రాన్స్​ఫర్​ అయ్యారు.

పోలీస్, రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో లోపాయికారిగా నెల రోజుల నుంచి జరుగుతున్న బదిలీల ప్రక్రియ ఇటీవల మరింత స్పీడప్​ అయ్యింది. ఎన్నికల టైంలో తమకు నమ్మకస్తులుగా పనిచేస్తారనుకునే ఆఫీసర్లను ఎంపిక చేసి పోస్టింగ్​లు ఇప్పిస్తున్నారు. ఇందులో భాగంగా పలు సా మాజిక వర్గాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. పార్టీలో గ్రూపు తగాదాలు అధికంగా ఉన్న నల్గొండ, నాగార్జునసాగర్​, నకిరేకల్​, మునుగోడు నియోజకవర్గాల్లో బదిలీలు రాజకీయంగా మరింత వేడిపుట్టిస్తున్నాయి. కోవర్టు లీడర్ల కదలికలపైన ఎమ్మెల్యేలు గురిపెట్టారు. 

ఎస్ఐలు, తహసీల్దార్లు బదిలీ..

కేతేపల్లి, చిట్యాల, తిప్పర్తి మండలాల ఎస్​ఐలను  సోమవారం బదిలీ చేశారు.  నాలుగు నెలల కిందే సూర్యాపేట జిల్లా నుంచి తిప్పర్తి మండ లానికి వచ్చిన ఎస్ఐ రవిని చిట్యాలకు ట్రాన్స్​ఫర్​ చేశారు. చిట్యాలలో పనిచేస్తున్న ఎస్ఐ ఎన్​. ధర్మాను తిప్పర్తికి బదిలీ చేశారు. పెన్​పహాడ్​లో పనిచేసిన శ్రీకాంత్​గౌడ్​ను కేతేపల్లి పీఎస్​కు, అక్కడ పని చేస్తున్న అనిల్​ రెడ్డిని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలానికి ట్రాన్స్​ఫర్​ చేశారు. ప్రస్తుతం వీఆర్​లో ఉన్న ఓ ఎస్ఐని త్వరలో కట్టంగూరుకు బదిలీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల కింద కట్టంగూరు, చిట్యాల మండలాలకు కొత్త తహసీల్దార్లు వచ్చారు. రాజకీయ విభేదాల వల్ల నాగార్జునసాగర్​ సీఐని బదిలీ చేసినట్లు తెలిసింది. మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో కూడా పలువురు ఆఫీసర్లను మార్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 

డెడ్​లైన్ ఆగస్టు

ఎన్నికల బదిలీలకు ఆగస్టు డెడ్​లైన్​ పెట్టినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్​ నుంచి ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది. ఆగస్టు నాటికి ఎన్నికలకు ఖర్చుపెట్టే డబ్బంతా నియోజకవర్గాలకు చేరేలా అధిష్టానం పక్కాప్లాన్​   చేసినట్లు సమాచారం. దీంతో టోల్​గేట్లు, నియోజకవర్గ సరిహద్దు మండలా ల్లో బలమైన ఆఫీసర్లను రంగంలోకి దింపాలని ఎమ్మెల్యేలు పక్కా స్కెచ్​ వేశారు. 

అధికారుల్లో మునుగోడు టెన్షన్!

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు మునుగోడు టెన్షన్​ పట్టుకుంది. పార్టీ సింబల్ మార్పు​ వివాదంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్గొండ ఆర్డీవో జగన్నాథరావు సస్పెండ్​ అయ్యారు. ఆయన పోస్టింగ్ వ్యవహారం ఇప్పటికీ వివాదస్పదంగానే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు చెప్పిందల్లా చేయాల్సి వస్తే తమ భవిష్యత్తు ఎట్లా ఉంటదనే దాని పైన భయపడుతున్నారు. ఇప్పటికైతే నచ్చిన ప్లేస్​లోకి బదిలీ అవుతున్నా ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల పైనే అధికారులు టెన్షన్​ పడుతున్నారు.