ఉమ్మడి జిల్లాలో గందరగోళంగా టీచర్ల బదిలీ ప్రక్రియ
ప్రమోషన్ల కోసం అప్లై చేసుకున్న ఎస్జీటీ లు, స్కూల్ అసిస్టెంట్లు
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ప్రకటించని ఆఫీసర్లు..
యూనియన్ లీడర్లకు వివరాలు పంపిస్తున్నామని దాటవేత
పైరవీల కారణంగానే చూపుతలేరని టీచర్ల ఆరోపణ
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో టీచర్ల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. జిల్లాలో స్థానాల వారీగా వేకెన్సీ పొజిషన్లిస్ట్చూపడం గానీ, స్కూల్‌అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందేందుకు అప్లై చేసుకున్న ఎస్జీటీల లిస్ట్ నోటీస్‌బోర్డులపై పెట్టడం లేదు. పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియను విద్యా శాఖ ఆఫీసర్లు గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఆఫీసర్లు మాత్రం వివరాలన్నీ ఉద్యోగ సంఘాల లీడర్లకు పంపిస్తున్నామని, ఆన్లైన్లో కూడా ఉంటాయని దాటవేత సమాధానం చెప్తున్నారు.
ఖాళీగా 860 పోస్టులు..
జిల్లాలో 1,011 స్కూల్స్ఉన్నాయి. మొత్తం 4,938 టీచర్లకు గాను ప్రస్తుతం 4,078 మంది విధులు నిర్వహిస్తున్నారు. 860 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్జీటీలుగా ఉండి స్కూల్‌అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందాల్సిన వాళ్లు, ట్రాన్స్ ఫర్లకు అవకాశం ఉన్న వారు ఆన్లైన్లో అప్లై చేశారు. ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ఆయా సబ్జెక్టుల్లో ప్రమోషన్ కోసం 1,400 మంది వరకు అప్లై చేసుకున్నారు. 2002 డీఎస్సీ నుంచి 2017 వరకు సెలక్ట్అయ్యి ప్రమోషన్ల కోసం అప్లై చేసుకున్నారు. వారి అప్లికేషన్లు 1:3 లెక్కన వెరిఫికేషన్ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కోసం అప్లై చేసుకున్న వారి వివరాలతో కూడిన లిస్ట్‌ను ఈ నెల 27లోగా నోటీస్‌బోర్డుపై డిస్ప్లే చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు లిస్ట్పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని అడిగితే ఆర్జేడీకి పంపామని, అక్కడి నుంచి రావాల్సి ఉందని, ఆన్లైన్ సర్వర్బిజీ ఉందని పూటకో సమాధానం చెప్తున్నారు. అయితే లిస్టు డీఈవో నే పెట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
లిస్ట్‌లో గోప్యత ఎందుకు..?
జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల సంఖ్యను కూడా స్థానికంగా చూపకుండా గోప్యత పాటిస్తున్నారు. వేకెన్సీ పొజిషన్ లిస్టుపై కూడా ఆఫీసర్లు గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూల్స్ ప్రకారం.. ఏ స్కూళ్లో పోస్టు ఖాళీగా ఉందనే వివరాలు చూపాలి. అయితే కొందరు టీచర్లు ఉన్నత స్థాయిలో పైరవీ చేసి బదిలీలు చేయించుకొని వస్తుండడంతోనే లిస్టు చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే వీరు తాము కోరుకున్న స్థానంలో పోస్టింగ్ కోసం పట్టుబట్టే అవకాశం ఉండడంతో ముందుగానే వేకెన్సీ లిస్ట్చూపితే సమస్యలు వస్తాయనే జిల్లా అధికారులు లిస్ట్ పెట్టలేదని పలువురు టీచర్లు ఆరోపిస్తున్నారు. నోటీస్‌బోర్డుపై కూడా పూర్తి వివరాలు పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొంత మంది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు మాత్రమే వివరాలు ఇస్తున్నారనే టీచర్లు ఆరోపిస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్ల కోసం కొందరు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తెలిసింది. దివ్యాంగులుగా అర్హత లేనప్పటికీ కొందరు ఫేక్మెడికల్సర్టిఫికెట్లు తీసుకొచ్చి అప్లై చేస్తున్నట్లు సమాచారం.