దేశ ప్రగతి ఆశించిన స్థాయిలో లేదు: దిలీప్ రెడ్డి

గ్రామానికి గ్రామీణులే రక్ష. వారు తలచుకుంటే తెలుగు నాట గ్రామ పునరుజ్జీవనం సాధ్యమే. ప్రభుత్వాలే వివిధ కార్యక్రమాలు చేపట్టి గ్రామాభివృద్ధి చేస్తాయని నమ్ముకొని కూర్చుంటే ఇక అయినట్టే. అలా కూర్చోవటం వల్లే నేటి దుస్థితి దాపురించింది. భారతీయ ఆత్మ గ్రామాల్లోనే ఉందని బలంగా నమ్మిన మన జాతిపిత బాపూజీ గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం అన్నారు. మనిషి సామూహిక జీవనంలో గ్రామమే కనీస యూనిట్‌‌ కింద స్వయం సమృద్ధమైతే తద్వారా దేశం పూర్ణ వికాసం చెందుతుందని ఆయన కలలుగన్నారు. కానీ, కాలక్రమంలో ఆయన కలలు కల్లలయ్యాయి తప్ప దేశంలో గ్రామాభివృద్ధి జరగలేదు. పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ప్రాధాన్యతలు మారి గ్రామం నిర్లక్ష్యానికి గురైంది. మరీ ముఖ్యంగా ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ(ఎల్పీజీ) తర్వాత గ్రామం పూర్తిగా కుదేలైంది. వ్యవసాయం, అనుబంధ ఉపాధులు, చేతి వృత్తులు భంగపోయి గ్రామాల్లో మనుగడ కష్టమైంది. వలసలు విపరీతమయ్యాయి. ఉపాధి, ఉద్యోగం, విద్య–వైద్యం కోసం పెద్ద సంఖ్యలో కుటుంబాలు ఊరు వదిలి పట్టణాలు, నగరాల దారి పట్టాయి. జానపద ప్రజాకవి గోరటి వెంకన్న ఓ పాటలో చెప్పినట్టు ఒక దశలో పల్లె కన్నీరు పెట్టి బావురుమంది.. కనిపించని మార్కెట్‌‌ కుట్రలతో గ్రామం చిరునామా గల్లంతైంది. అటు తర్వాతి పాలకులు వ్యవసాయానికి కొంత ప్రాధాన్యం ఇవ్వడంతో కొన్ని ప్రత్యేక ఉపాధి, ఆసరా, చేయూత కార్యక్రమాలతో గ్రామం ఒకింత కోలుకుంది. కానీ, అది మాత్రమే సరిపోదు.

ప్రాతినిధ్యం-ప్రాధాన్యత పెరగాలి

పాలనాపరంగా గ్రామం తీవ్ర నిర్లక్ష్యానికి గురైనందునే దేశ ప్రగతి ఆశించిన స్థాయిలో లేదు. అపారమైన, విలువైన దేశ యువశక్తి నిరుపయోగమై నిర్వీర్యమవుతున్నది. పరిపాలనలో గ్రామం ప్రాతినిధ్యం పెంచాలి. విధాన నిర్ణయాల్లో గ్రామం ప్రాధాన్యత పెరగాలి. మన సమాఖ్య రాజ్య స్ఫూర్తిలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ప్రాధాన్యత ఉన్నట్టే.. స్థానిక ప్రభుత్వాలకు కూడా అంతే సమాన ప్రాధాన్యత ఉండాలి. విస్త్రృత జనాభా, అపరిమిత సహజ వనరులు ఉండే గ్రామీణ ప్రాంతాలకు తగినంత ప్రాతినిధ్యం, ప్రాధాన్యత ఉన్నప్పుడే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది. 73వ, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తి, లక్ష్యం అదే! గ్రామాన్ని స్వయం సమృద్ధి కలిగిన ఒక పటిష్ట యూనిట్‌‌గా అభివృద్ధి చేస్తే, తద్వారా జిల్లాలు, రాష్ట్రాలు, దేశం సహజంగానే ప్రభావితమవుతాయి. నిర్ధిష్ట నిర్ణయాలు, ప్రత్యేక చర్యలు, ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాలను క్రియాశీలం చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. విద్య–వైద్య సదుపాయాల కల్పన ద్వారా వలసల్ని నిలువరించవచ్చు. నగరాలు, పట్టణాల నుంచి తిరోగమన వలసల్ని ప్రోత్సహించే పరిస్థితులు, అవకాశాలు పెరుగుతాయి. గ్రామ పంచాయతీ అనే పాలనా యూనిట్‌‌ని బలోపేతం చేయాలి. బ్రిటీష్‌‌ వలస వాదపు పడికట్టు పదాలను మార్చి, వాటి స్థానే.. జిల్లా స్థాయిలో జడ్పీకి బదులు ‘జిల్లా పంచాయతీ’, అసెంబ్లీ స్థానే ‘రాష్ట్ర పంచాయతీ’, కేంద్ర స్థాయిలో పార్లమెంట్‌‌ స్థానే ‘జాతీయ పంచాయతీ’ అని పేర్లు పెట్టి పంచాయతీ స్ఫూర్తిని అంతటికీ విస్తరించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.

అంతా కలిసి కృషి చేస్తే..

సిద్ధాంత రాజకీయాలకు కాలం చెల్లి, అవకాశ వాద రాజకీయాలు పెచ్చు మీరాయి. పౌరసమాజం కూడా ఆ మేరకు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. పాలనా వ్యవస్థలను జవాబుదారు చేసి, న్యాయ–రాజ్యాంగ బద్ధంగా రావల్సింది రాబట్టుకోడానికి గ్రామం ఓ చక్కని యూనిట్‌‌. గ్రామీణులు ముందుకొచ్చి కలసిగట్టుగా కృషి చేస్తే పోయేదేమీ లేదు, చుట్టూ అలుముకున్న దరిద్రం తప్ప. ఇంద్రజాల మహేంద్రజాల విద్యల్లో చూపినట్టు, మనల్ని ఉద్ధరించడానికి ఆకాశం నుంచి ఎవరూ ఊడిపడరు. ఎవరిని వారే చేతనతో బాగు చేసుకోవాలి. గాంధీజీ అన్నట్టు ‘పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలు’. మన ఊరి నుంచే మార్పు మొదలు కావాలి. మరెందుకు ఆలస్యం? మనమంతా సిద్ధమవుదాం.

గ్రామ సభ కీలకం

ప్రజలను ప్రజలే పాలించుకునే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిజమైన ప్రతీక ‘గ్రామసభ’ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్‌‌ వంటి అత్యున్నత చట్ట సభలు కూడా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో నడుస్తాయి. గ్రామ పంచాయతీల్లో కూడా ఎన్నికైన సర్పంచ్‌‌, వార్డు సభ్యులనే ప్రతినిధులతో పాలక మండలి ఉంటున్నది. గ్రామ సభలో గ్రామస్థులెవరైనా పాల్గొనవచ్చు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాల అమలు సవ్యంగా జరిగేటట్టు చూడటమే కాకుండా అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేసేటట్టు చేసే అధికారం, బాధ్యత గ్రామ సభపై ఉంటుంది. గ్రామం పరిధిలో ప్రత్యామ్నాయ జీవన ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గ్రామంలోని సహజ వనరులను పరిరక్షించడం గ్రామసభ విధి. ప్రతి గ్రామంలో కొందరైనా చొరవ తీసుకొని ముందుకువచ్చి గ్రామ సభతో బాధ్యతగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే.. గ్రామం ప్రగతి బాటలో పయనించేందుకు వీలుంటుంది. ఇటువంటిదే ఓ గ్రామ సభ గాంధీ జయంతి రోజైనా అక్టోబర్‌‌‌‌ 2న, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం, తక్కిళ్లపల్లిలో జరిగింది. పలువురు పర్యావరణ వేత్తలు, ఆర్థిక నిపుణులు, విద్యా వేత్తలు, విధాన విశ్లేషకులతో పాటు నేనూ హాజరయ్యాను. గ్రామస్తులు పాల్గొని స్థానిక సమస్యల్ని లేవనెత్తారు. పెండింగ్‌‌ పనుల గురించి అడిగారు. బడి బాగు గురించి వాకబు చేశారు. వైద్యకేంద్రం కావాలన్నారు. బోరు రిపేర్లు, విద్యుద్దీపాలు, సీసీ రోడ్ల గురించి డిమాండ్‌‌ చేశారు. సర్పంచ్‌‌తో పాటు పంచాయతీ కార్యదర్శి స్పందించారు. గ్రామ పరిధిలోని సహజ వనరుల రక్షణ, నిధులు రాబట్టుకోవడం తదితర విషయాల్లో నిపుణులు సూచనలు చేశారు.

ఉమ్మడి కృషే ఊరికి రక్ష

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు పలు రెట్లు ఫలం ఇవ్వాలంటే స్థానిక పాలన సజావుగా ఉండాలి. గ్రామ సభ క్రియాశీలంగా ఉంటే అన్నీ చక్కబడతాయి. ఎన్నికలప్పుడే రాజకీయాలు తప్ప మిగతా కాలమంతా గ్రామస్తులంతా కలిసి పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలి. అవసరమైతే గ్రామానికి చెందిన ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారు, ఇతర వృత్తుల్లో ఉన్నవారిని కూడా ‘ఆన్‌‌లైన్‌‌’ పద్ధతిలో గ్రామ సభకు పిలుచుకోవచ్చు. వారి సహాయ సహకారాలు తీసుకోవచ్చు. వ్యవసాయ, దాని అనుబంధ సదుపాయాలను మెరుగుపరచుకోవచ్చు. ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందించే వ్యవసాయ ఉత్పత్తి సంఘా(ఎఫ్​పీఓ)లను ఏర్పాటు చేసుకోవచ్చు. సబ్సిడీలు పొందడంతో పాటు మార్కెట్‌‌ అవకాశాలు మెరుగుపరచుకునే వీలు ఉంటుంది. తరచూ సందర్శిస్తూ మంచి–చెడులు తెలుసుకుంటూ బడి బాగు చేసుకోవచ్చు. కలప, ఇసుక, మట్టి, ఇతర ఖనిజాల వంటి సహజ వనరులను ఐక్యతతో కాపాడుకోవచ్చు. బయటి నుంచి వచ్చి, సహకరించే నిపుణులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామంలోని నిరుద్యోగ యువత నైపుణ్యాలను వృద్ధి చేయడానికి ఎంతో వీలుంటుంది. వారి సాధారణ, వృత్తి డిగ్రీలకు తోడు కొంత పరిజ్ఞానం పెంచడం ద్వారా, నేషనల్‌‌ అకాడమీ ఆఫ్​ కనస్ట్రక్షన్‌‌(న్యాక్‌‌), రామానంద తీర్థ గ్రామీణ సాంకేతిక సంస్థ, స్వర్ణ భారతి ట్రస్ట్‌‌, జీఎమ్‌‌ వరలక్ష్మి ఫౌండేషన్‌‌ వంటి శిక్షణ సంస్థల్లో ప్రవేశాలు దొరికేలా చేయొచ్చు.

- దిలీప్ రెడ్డి,
dileepreddy.ic@gmail.com