- లక్ష కోట్ల ప్రాజెక్టుతో రిజర్వాయర్లు నింపుతున్నామన్న సర్కారు మాటలు ఉత్తవే
- నాలుగేండ్లుగా వానలు, వరదలతోనే నిండుతున్న ప్రాజెక్టులు
- ఈసారి పంప్‌హౌస్‌లు మునగడంతో అసలు నిజం బయటికి
- ఎస్సారెస్పీ కిందే 12 లక్షల ఎకరాలు సాగు
- కాళేశ్వరం కింద ఒక్క ఎకరాకూ నీళ్లిస్తలే..
- పైగా జనం నెత్తిన మూడేండ్లలో రూ.2 వేల కోట్ల కరెంటు బిల్లులు
వెలుగు, నెట్‌వర్క్ : రాష్ట్రంలో నాలుగేండ్లుగా ఏ ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చినా, ఏ చెరువు మత్తడి దుంకినా అవన్నీ కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లేనని గొప్పలకు పోయిన టీఆర్ఎస్ పెద్దలకు పంప్‌హౌస్‌ల మునకతో కొత్త చిక్కు వచ్చి పడింది. వర్షాలు, వరదల వల్ల ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీటిని కాళేశ్వరం ఘనతగానే చెప్పుకున్న సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ సీజన్‌లో పంప్‌హౌస్‌లు పని చేయకున్నా.. ఒక్క చుక్క కూడా ఎత్తిపోయకున్నా.. ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి. దీంతో గడిచిన నాలుగేండ్లుగా భారీ వర్షాల వల్లే రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయన్న విషయం బట్టబయలైంది. నిజానికి కాళేశ్వరం ప్రారంభించాక వరుసగా మూడేండ్ల పాటు లిఫ్ట్ చేసిన నీళ్లన్నింటినీ వరదల కారణంగా దిగువకే వదిలేశారు. పైగా ఇలా నీటిని లిఫ్ట్ చేయడానికి భారీగా కరెంటు ఉపయోగించాల్సి వచ్చింది. దీని కారణంగా రూ.2 వేల కోట్ల పవర్ చార్జీల భారాన్ని జనం మోయాల్సి వచ్చింది.
మూడు నెలలుగా రెస్ట్
కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైన కన్నెపల్లి పంప్‌హౌస్ నీట మునిగి వంద రోజులు దాటింది. జులై 14న గోదావరిలో వచ్చిన భారీ వరదలకు పంప్‌హౌస్ ప్రొటెక్షన్ వాల్ కూలిపోయి 17 బాహుబలి మోటార్లు మునిగిపోయాయి. పలు మోటార్లు, ప్యానల్‌బోర్డులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఈ సీజన్‌లో కనీసం ఒక్క రోజు కూడా నడవకముందే మూతపడ్డ కాళేశ్వరం లిఫ్టు స్కీం మూడు నెలలుగా ‘రెస్ట్’ తీసుకుంటున్నది.
కానీ కాళేశ్వరంతో సంబంధం లేకుండా ఎప్పట్లాగే ఈసారి కూడా ప్రాజెక్టులన్నీ వర్షాలు, వరదలతో పూర్తిగా నిండాయి. ఆయా ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కింద వానకాలంలో లక్ష్యం మేర సాగునీరు ఇచ్చినప్పటికీ యాసంగికి సరిపడా నీళ్లున్నాయి. ఎల్లంపల్లి కెపాసిటీ 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం19.341 టీఎంసీలు ఉన్నాయి. ఎస్సారెస్పీ, మిడ్ మానేర్, ఎల్ఎండీ, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్.. ఇలా దాదాపు అన్నీ నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. కొత్తగా నిర్మించిన మల్లన్న సాగర్‌లో మాత్రమే ఫుల్రిజర్వాయర్ లెవెల్ కొనసాగించడం లేదు. అందువల్లే (ప్రాజెక్టు సామర్థ్యం 50 టీఎంసీలు) 15 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
నిర్ణయించిన ఆయకట్టుకూ ఇయ్యలే
2021–-22 వానాకాలం సీజన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం 57 వేల ఎకరాలకు నీళ్లివ్వాలని శివమ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూన్ 23న ఈఎన్సీ (జనరల్) మురళీధర్ అధ్యక్షతన నిర్వహించిన మీటింగ్ మినిట్స్ జులై 7న బయటకు రావడంతో.. కాళేశ్వరంతో లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నామని అప్పటిదాకా సర్కారు చెప్తున్నదంతా అబద్ధమని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఈ వానాకాలం 39.04 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ప్రకటిస్తే అందులో కాళేశ్వరం ప్రాజెక్టు వాటా 1.4 శాతం మాత్రమే. ఈలోగా జులై 14న కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు మునిగిపోవడంతో ఆ 57 వేల ఎకరాలు కూడా కాళేశ్వరం ఖాతాలో పడలేదు. కాళేశ్వరం నీళ్లు రాకపోయినప్పటికీ వర్షాలు, ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు పుణ్యమా అని
రంగనాయకసాగర్ కింద కూడా 48,500 ఎకరాల వరి, 9,100 ఎకరాల ఆరుతడి పంటలకు నీళ్లు అందాయి.
శ్రీరాంసాగరే నేటికీ నంబర్‌వన్
కాళేశ్వరం ద్వారా 18 లక్షల 25 వేల 700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిస్తామని సర్కారు చెప్పినప్పటికీ గడిచిన నాలు గేండ్లలో ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు. దీంతో మరోసారి రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టే నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో ఎస్సారెస్పీ స్టేజ్-1, 2 కలిపి 12.29 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాతి స్థానంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 6.17 లక్షల ఎకరాలకు నీళ్లు అందాయి. లక్షా 20 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నాలుగేండ్లయినా రైతాంగానికి ఎలాంటి ఫాయిదా లేకపోగా.. గత ప్రభుత్వాలు కట్టిన ఎస్సారెస్పీ, సాగర్ ప్రాజెక్టులే సాగుకు దిక్కవుతున్నాయి.
మూడేండ్లు ఎత్తిపోసి.. కిందికే వదిలేసి..
వానాకాలంలో భారీ వర్షాలు పడితే త్వరగానే ఎల్లంపల్లి నిండుతున్నది. దీంతో అప్పటికే ఎత్తిపోసిన నీటిని దిగువకు వదిలేయాల్సి వస్తున్నది. పోనీ సీజన్ చివర్లో ఎత్తిపోద్దామంటే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉండట్లేదు. 2019లో 60 టీఎంసీలు ఎత్తిపోశాక భారీ వర్షాలు పడి నీళ్లన్నింటినీ కిందికి వదిలేశారు. 2020 సీజన్ ప్రారంభంలో భారీ వర్షాల కారణంగా లిఫ్టులను పూర్తిస్థాయిలో నడపలేదు. కేవలం 33 టీఎంసీలు ఎత్తిపోశారు. చివర్లో ఎత్తిపోద్దామన్నా ప్రాణహిత దగ్గర నీళ్లు లేకుండా పోయాయి. 2021 సీజన్‌లో జూన్ 16 నుంచి 20 రోజుల్లో 32 టీఎంసీలను ఎత్తిపోశారు. కానీ భారీ వర్షాలు, వరదల కారణంగా జులై మూడోవారంలో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఖుల్లా పెట్టి ఎత్తిపోసిన నీళ్లన్నీ మళ్లీ కిందికి వదిలేశారు. మూడేండ్లలో కాళేశ్వరం లిఫ్టుల కారణంగా రూ.2 వేల కోట్ల కరెంట్ బిల్లులు మీద పడడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు.