న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సెకండ్ ఫేజ్ రుణమాఫీ సందర్భంగా తెలంగాణ రైతులకు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ‘మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీని విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని 6.4 లక్షల రైతు కుటుంబాలకు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ ఉపశమనం కల్పిస్తుంది’ అని రాహుల్ బుధవారం ట్వీట్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం దేశంలోని రైతులను అప్పుల ఊబిలో ఇరికించిందని విమర్శించారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టపరమైన హామీని కేంద్రం తిరస్కరించిందని గుర్తుచేశారు. సాధ్యమైన ప్రతిచోటా వ్యవసాయ కుటుంబాలకు సాయం అందించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని పేర్కొన్నారు.