- పేపర్లలోనే సబర్మతి ప్లాన్
- మంత్రి కేటీఆర్ ప్రచార పర్యటనకు మూడేళ్లు
- పేరుకు 1,400 కోట్ల కేటాయింపులు.. ఖర్చు చేసింది రూ.2కోట్లే
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి తాగునీళ్లిచ్చిన మూసీ నది ఇప్పుడు కాలుష్యం, ఆక్రమణలతో జీవం కోల్పోయింది. జనాలు పెరిగారు, నివాసం పేరిట నదిని రెండు పక్కల నుంచీ ఆక్రమించేశారు. మూసీ నాలాలపై బంగ్లాలు కట్టేశారు. మూసీని బాగు చేస్తామని సర్కారు పెద్దలు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న హామీలన్నీ మాటలకే పరిమితమైపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్తగా హామీలు ఇవ్వడం, మూసీని ప్రక్షాళన చేస్తామని, సుందరంగా మారుస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం.. ఆ తర్వాత ఎట్లాంటి చర్యలు చేపట్టకుండా గాలికొదిలేయడం రివాజుగా మారిపోయింది.
33 కిలోమీటర్ల మేర..
అనంతగిరి కొండల్లో పుట్టి కృష్ణానదిలో కలిసే మూసీ నది.. హైదరాబాద్‌లో 33 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. కాలుష్యంతో నిండిపోయిన మూసీని ప్రక్షాళన చేస్తామని, ఆక్రమణలను తొలగించి పరిరక్షిస్తామని టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటైన రెండేళ్ల నాడు అసెంబ్లీలో ప్రకటించింది. ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్’ను కూడా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసి.. సుందరీకరణకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇది జరిగి మూడేండ్లయినా అడుగు కూడా ముందుకు పడలేదు.
కేంద్రం నిధులు ఇచ్చినా..
నది బేసిన్, చారిత్రక ఆనవాళ్లు ఉన్న నదుల పరిరక్షణలో భాగంగా కేంద్రం నేషనల్ రివర్ వాటర్ కన్జర్వేషన్ స్కీం కింద మూసీ ప్రక్షాళనకు 2001లో తొలి అడుగు పడింది. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ లో మొదలై 33 కిలోమీటర్ల మేర పారుతున్న మూసీని పరిరక్షించాలని నిర్ణయించారు. పరీవాహక ప్రాంతాల అభివృద్ధి, కాలుష్య కారకాల నియంత్రణ, మురుగు నీరు కలవకుండా ఇంటర్వ్నేషన్ అండ్ డైవర్షన్ నిర్మాణాలు, ల్యాండ్ స్కేప్, పార్కుల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించింది. అప్పటి ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం ఇచ్చే 75 శాతం ఫండ్‌లో రూ.400 కోట్లను విడుదల చేసింది. ఆ సొమ్మంతా ఖర్చుపెట్టినట్టు చూపించినా నదిలో మురుగు ఏ మాత్రం వదల్లేదు.
మొత్తం డ్రైనేజీ నీళ్లే..
ఒకప్పుడు నగరానికి తాగునీటిని ఇచ్చిన మూసీలో ఇప్పుడు మొత్తం డ్రైనేజీ నీళ్లే పారుతున్నాయి. నదిలోకి వచ్చే వాటర్ చానళ్లన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. యథేచ్చగా పారిశ్రామిక, మానవ వేస్టేజీని నదిలో వేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రతిరోజు ఉత్పత్తయ్యే 1,300 ఎంఎల్డీల మురుగునీటిలో.. 600 ఎంఎల్డీలనే శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నట్టు అధికారికంగా చెప్తున్నారు. కానీ భారీగా డ్రైనేజీ, ఇండస్ట్రియల్ వేస్టేజీ నదిలో కలుస్తోందని ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్టులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ బిట్స్ పిలానీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ సుమన్ కపూర్ మూసీపై అధ్యయనం చేశారు. నదిలో కలుస్తున్న మురుగుతో నది బేసిన్‌లోని భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయని తేల్చారు. మూసీ వెంబడి సీవరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేసి మురుగునీటిని శుద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
సబర్మతి టూర్ పేరిట కేటీఆర్ హడావుడి
గుజరాత్ లోని సబర్మతి నది తరహాలో మూసీ సుందరీకరణ పేరిట మంత్రి కేటీఆర్ అప్పట్లో హడావుడి చేశారు. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో మూసీ అభివృద్ధిపై హామీలు గుప్పించారు. ఆ ఎలక్షన్లలో గెలిచాక 2017 జులైలో కొత్త మేయర్, అధికారులతో కలిసి సబర్మతి ప్రాంతంలో పర్యటించారు. తర్వాతి నెలలోనే మూసీ పనులు స్టార్టవుతాయన్నారు. కానీ మూడేండ్లు దాటినా పనులు నామ్‌కే వస్తేగా జరుగుతున్నాయి. మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు ఆరేండ్లలో రూ.1,400 కోట్లు కేటాయించినట్టు చెప్పిన సర్కారు.. ఈ ఏడాది జనవరి నాటికి రూ.2 కోట్లే ఖర్చు చేసింది. ఇందులో మూసీ డెవలప్మెంట్కార్పొరేషన్స్టాఫ్ జీతభత్యాలు, డ్రోన్ సర్వేల ఖర్చే ఉంది. కార్పొరేషన్ అకౌంట్‌కు సర్కారు నుంచి ఎన్ని నిధులు వచ్చాయో ఏ ఆఫీసర్ దగ్గర కూడా సమాధానం లేదు. ఇక మూసీ కార్పొరేషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలున్నాయి. తొలి చైర్మన్‌గా ప్రేమ్ సింగ్ రాథోడ్‌ను నియమించగా.. రెండేళ్లలో అధికారులు రెడీ చేసిన ప్రణాళికలను చూసింది లేదు, సంతకాలు చేసింది లేదన్న ఆరోపణలున్నాయి. తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి పదవిచ్చారు. మంత్రి పదవి రాలేదన్న నిరాశలో ఉన్న ఆయనకు రివర్ ఫ్రంట్ చైర్మన్ బాధ్యతలు ఇచ్చారని పార్టీవర్గాలు చెప్తున్నాయి.
సబర్మతి తరహా యాక్షన్ ప్లాన్ ఏదీ?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 10 కిలోమీటర్ల మేర ప్రవహించే సబర్మతి రివర్ డెవలప్ మెంట్‌ను అక్కడి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రకటించిన ఏడాదిలోనే కిలోమీటర్‌కు రూ.105 కోట్లు ఖర్చు చేసేలా.. రూ.1,152 కోట్లతో యాక్షన్ ప్లాన్ రూపొందించింది. నదికి ఇరువైపులా ఉన్న 10 వేల కుటుంబాలకు వేరే ప్రాంతాల్లో ఇండ్లను కట్టించింది. కొన్నేళ్లలోనే నదిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. మన దగ్గర హైదరాబాద్‌లో 33 కిలో మీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ అభివృద్ధికి రూ.4,500 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదించారు. ఇప్పటివరకు రూ.1,400 కోట్లు కేటాయించినట్టు చూపారు. నది వెంబడి 40 వేలకుపైగా అక్రమ కట్టడాలు, వాటిల్లో లక్షన్నర మందికిపైగా ఉంటున్నారు. వాళ్లకు పునరావాసంపై సర్కారుకు క్లారిటీ లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల ఆక్రమణలను తొలగింపులోనూ సర్కారు చేతులెత్తేసింది
ఆరేండ్లలో చేసిందేమీ లేదు
ఎంతో చరిత్ర ఉన్న మూసీ నది పరిరక్షణ, సుందరీకరణ కోసం గత ఆరేండ్లలో టీఆర్ఎస్ సర్కారు చేసిందేమీ లేదు. మూసీ రివర్ డెవలప్ మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. ఆచరణలో కనిపించడం లేదు. గతంలో వైఎస్ హయాంలో మూసీ వెంబడి నందనవనాలు ఏర్పాటు చేసినా కనీసం పది శాతం కూడా పూర్తి కాలేదు.
–శ్రీనివాస్, సీపీఎం సిటీ సెక్రటరీ