
- మామ పొలాన్ని దున్నడానికి వచ్చిన అల్లుడు
- చేసుకోబోయే యువతిని ట్రాక్టర్‌పై ఊరికి తీసుకు వెళ్తుండగా ప్రమాదం
- భద్రాద్రి జిల్లా వీకే రామవరం సమీపంలో ఘటన
అశ్వాపురం వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కాబోయే దంపతులు కన్నుమూశారు. అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన తాటి ప్రసాద్ (25) ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన పత్రి నాగమణి (25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు వర్గాల పెద్దలకు విషయం చెప్పడంతో వారు కూడా పెండ్లికి అంగీకరించి నిశ్చితార్థం కూడా జరిపించారు. ఈ క్రమంలో సోమవారం ప్రసాద్ తన అత్తగారి ఊరైన కమలాపురంలో కాబోయే అత్తమామల పొలంలో
వ్యవసాయ పనులు చేసేందుకు సొంత ట్రాక్టర్ ను తీసుకుని వెళ్లాడు. పని అయిపోయాక రాత్రి వేళ నాగమణిని ట్రాక్టర్ పై కూర్చోబెట్టుకుని తుమ్మలచెరువుకు వస్తున్నాడు. ములకలపల్లి మండలంలోని వీకే రామవరం దగ్గర గతుకుల రోడ్డు ఉండడంతో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పొలంలో బోల్తా పడింది. దీంతో ప్రసాద్, నాగమణి అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.