తేదీ ముంచుకొస్తున్నా...తేలని ప్రజా ఎజెండా!

తేదీ ముంచుకొస్తున్నా...తేలని ప్రజా ఎజెండా!

లోక్‌‌సభ ఎన్నికలకు తెలుగునాట నామినేషన్ల పర్వం మొదలైనా, ఏ అంశం ఆధారంగా ప్రజాతీర్పు రానుందో తెలిపే ఎజెండా ఇంకా సెట్‌‌ కాలేదు. ప్రధాన పార్టీల విమర్శ, ప్రతి విమర్శలే తప్ప నిర్దిష్టంగా ఒక అంశాన్ని ఈ ఎన్నికలకు ప్రాతిపదిక చేయడంలో ఆయా పక్షాలు విఫలమయ్యాయి. ప్రజలెదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? వాటికి ఆయా రాజకీయ పార్టీల వద్దనున్న పరిష్కారాలేంటి?   అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. జరుగుతున్నవి లోక్‌‌సభ ఎన్నికలు కావడంతో స్థానికాంశాలు కాకుండా జాతీయాంశాలే ప్రాధాన్యత సంతరించుకుంటాయనే సంప్రదాయ వాదన ఒకటున్నా, ఇప్పుడు అందులోనూ స్పష్టత కొరవడింది.

పార్టీలు తమ రాజకీయ విధానాలనే ప్రచారాంశాలు చేస్తున్నాయి. లేదా ప్రత్యర్థులను, వారి విధానాలను విమర్శించడానికే  ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయి. ఫలితంగా రాజకీయ పార్టీలు  ప్రచారం  చేస్తున్న అంశాలపై  ప్రజలకు పెద్దగా ఆసక్తి ఉండటం లేదు.  అయినా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నో కొన్ని ఓట్లు పడతాయి, హెచ్చు-తగ్గులను బట్టి ఎవరి పక్షానో  ఫలితాలూ వెలువడుతాయి. కానీ, సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటర్లను చైతన్యపరచిన ‘జాగో తెలంగాణ’ వంటి పౌర సమాజ సంస్థలైనా... ఈ నాలుగు నెలల్లో ఏం జరిగింది?  అసలేం జరిగుండాల్సింది?  ఏం జరగబోతోంది? అన్న సమీక్ష చేపట్టలేదు.  ఓటర్లకు అవగాహన కలిగించి ఉండాల్సిందనే భావన బలంగా వ్యక్తమౌతోంది.

అసలు సమస్యలు గాలికే!

మెజారిటీ ప్రజానీకం తమ ప్రధాన సమస్యలుగా పరిగణిస్తున్న అంశాలకు రాజకీయ పార్టీలు అంతగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు.   మాటలతో ప్రత్యర్థులపై  స్కోర్‌‌ చేసి, రాజకీయంగా ఆధిక్యత పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. హిమాచల్‌‌ ప్రదేశ్‌‌,  గుజరాత్‌‌,  కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలప్పుడు,  ప్రస్తుత లోక్‌‌సభ ఎన్నికల ముందు జరిపిన ప్రీపోల్‌‌ సర్వేల్లోనూ.. ప్రజల దృష్టిలో ధరల పెరుగుదల,  నిరుద్యోగిత ప్రధాన సమస్యగా వెల్లడయింది. సెంటర్‌‌ ఫర్‌‌ స్టడీ ఆఫ్‌‌ డెవలపింగ్‌‌ సొసైటీస్‌‌ (సీఎస్‌‌డీఎస్‌‌)- లోక్‌‌నీతి జరిపిన వివిధ సర్వేల్లోనూ ఇదే విషయం పలుమార్లు రూఢీ అయింది. మీ ఓటు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశం ఏది? అన్న నిర్దిష్ట  ప్రశ్నకు 24 శాతం మంది నిరుద్యోగిత అంటే, మరో 24 శాతం మంది నిత్యావసరాల ధరల అసాధారణ పెరుగుదల అన్నారు. అంతగా బీజేపీ ప్రచారం చేసి, అదొక్కటే చాలనుకున్న ‘రామ మందిరం’ అంశం ఓటింగ్‌‌ సరళిని ప్రభావితం చేస్తుందని 8 శాతం మందే చెప్పినట్టు సీఎస్‌‌డీఎస్‌‌–-లోక్‌‌నీతి తాజా సర్వే తెలిపింది. ఎన్నికలను బాగా ప్రభావితం చేసేవిగా అత్యధికులు పరిగణిస్తున్న ఉద్యోగావకాశాల కల్పన విషయంలో గాని,  ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విధానంలో గానీ రాజకీయ వ్యవస్థ నుంచి స్పష్టతే కరవు!  ఏటా ఇన్ని ఉద్యోగాలిస్తామని ఇదివరకే మేనిఫెస్టోలో చెప్పిన బీజేపీ హామీ గాలికి పోయింది.  ఖాళీలన్నీ భర్తీ  చేస్తామంటున్న  కాంగ్రెస్‌‌ ప్రస్తుత హామీ  రేపేమవుతుందో  వేచి చూడాలి.  విద్య, వైద్యం, రుణభారం, వంటి విషయాల్లో ప్రమాణాలు, అవకాశాలు పెంచడానికి ఏం చేస్తారో?  ఎన్నికల ప్రణాళికల్లో చెప్పరు. బయటెక్కడా నిర్దిష్టంగా హామీలివ్వరు.

గ్యారెంటీలతో.. ఎన్ని సీట్లు గ్యారెంటీనో?

భారత రాజకీయాల్లో ఇప్పుడు ‘గ్యారెంటీల శకం’ నడుస్తోంది. అయిదు గ్యారెంటీలతో  కర్ణాటక, ఆరు గ్యారెంటీలతో  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గెలిచామని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్‌‌, దేశవ్యాప్తంగా ఇప్పుడు 5 గ్యారెంటీల్లో 25 అంశాలను జొప్పించింది. అవే తమను గెలిపిస్తాయని ఆశతో ఉంది. మరోవంక  బీజేపీ, ఒక్క ‘మోదీ గ్యారెంటీ’ చాలు తమకు ముచ్చటగా  మూడోమారు అధికారం కట్టబెట్టడానికి అని బలంగా విశ్వసిస్తోంది. మహిళలూ, కార్మికులూ, కర్షకులూ, యువత..ఇలా వివిధ వర్గాలకు ‘మోదీ గ్యారెంటీ’ అని మోదీయే  స్వీయ కంఠంతో వాణిజ్య ప్రకటనల్లో వస్తున్నారు. మరి, మౌలికంగా రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికీ ఇచ్చే గ్యారెంటీ సంగతేంటి? గ్యారెంటీలు అంటూ పార్టీలు ఇప్పుడిస్తున్న హామీలన్నీ దాని పరిధిలోకి రావా? వాళ్లు పేర్కొనే నిర్దిష్ట సామాజిక వర్గాలు, వయస్కుల వారు  కాకుండా ఇతర పౌరులందరికీ రాజ్యాంగం కల్పించే గ్యారెంటీలను ఎవరు నెరవేర్చాలి? అది ఎన్నికైన ప్రభుత్వాల బాధ్యత-,కర్తవ్యం కాదా?  అసలీ వ్యక్తుల పేరు మీద ప్రచారం చేసే ఈ గ్యారెంటీలేమిటి?   జనం అకౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేసే వివిధ సంక్షేమ కార్యక్రమాలు, ఇతరత్రా ఆర్థికంగా ప్రయోజనం కలిగించే సంక్షేమ పథకాలనే భుజాన వేసుకొని ఎన్నికల వీధుల్లో కలలను విక్రయించే బేహారీలుగా నాయకులు కనిపిస్తున్నారు. 

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రధాని మోదీ స్వయంగా చెబుతున్నారు, ‘దేశ ప్రజలకు మొదట (2014) ఆశ కల్పించాం, తర్వాత (2019) విశ్వాసం కలిగించాం, ఇప్పుడు (2024) గ్యారెంటీలతో వస్తున్నాం’అని. కాంగ్రెస్‌‌ ఇలాగే గ్యారెంటీల మాట చెబితే, ‘వారెంటీ గడువు ముగిసిన కాంగ్రెస్‌‌ ఇచ్చే గ్యారెంటీలకు విలువేముంది?’ అని బీజేపీ నాయకత్వం ఎంత ప్రతికూల ప్రచారం చేసినా.. కర్ణాటక, తెలంగాణ ఓటర్లు వారి మాట వినలేదు. కాంగ్రెస్‌‌ ఇచ్చిన గ్యారెంటీలనే నమ్మినట్టున్నారు. వారికి ఆయా రాష్ట్రాల్లో పట్టం కట్టారు.  కిందటి ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ ఇచ్చిన ఏ హామీలనూ ఓటర్లు నమ్మలేదు. మరి, ప్రస్తుత లోక్‌‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీతో పాటు రెండు ప్రధాన స్రవంతి పార్టీలిచ్చే గ్యారెంటీలకు, తిరిగి ఓటర్లు ఎన్నెన్ని సీట్లు గ్యారెంటీ ఇస్తారో వేచి చూడాల్సిందే!

ప్రజాసమస్యలు పట్టని పార్టీలు

అసలు ప్రజాసమస్యలు ఎందుకు రాజకీయ ఎజెండా పైకి ఎక్కడం లేదు? ఎందుకు అవి ఎన్నికల్లో నిర్ణయాత్మక అంశాలు కావటం లేదు? రైతు పండించిన ధాన్యానికి మార్కెట్‌‌ సదుపాయం, -కొనుగోళ్లు, సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం, ఎండలు ముదిరేవేళ నాణ్యమైన విద్యుత్‌‌ సరఫరా వంటి కీలకమైన అంశాల్లో ఏ గ్యారెంటీ ఉండదా? పైగా, ‘రాజకీయంగా మన ఐడెంటిటీ ఇప్పుడే కీలకం, అందుకే మనకు ఢిల్లీలో ప్రాతినిధ్యం ఉండాలి, లోక్‌‌సభ స్థానాలు గెలవటం మనకు చాలా ముఖ్యం’ అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు భారత రాష్ట్ర సమితి అధినేత అయిన కేసీఆర్‌‌ ఉద్బోధ చేస్తున్నారు. ఆయన చెప్పారు సరే, అదే మాట పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలు చెబితే జనానికి ఎంత ఒంటబడుతుంది అన్నది కోటి రూకల ప్రశ్న! ‘ఆరు గ్యారెంటీలు సవ్యంగా అమలు కావాలంటే రాష్ట్రంలో గరిష్టంగా ఎంపీ సీట్లు గెలిపించండి’ అని కాంగ్రెస్‌‌ కొత్త మెలిక పెడుతోంది. 6 గ్యారెంటీలు ఇచ్చేటప్పుడు ‘షరతులు వర్తిస్తాయి’ అనలేదే! ఇంకోపక్క ‘దేశవ్యాప్తంగా బీజేపీని మళ్లీ గెలిపించండి, అందులో భాగంగా తెలంగాణలో కూడా.. ఇప్పటి వరకు మీరు చూసింది ‘ట్రయల్‌‌ మాత్రమే! పూర్తి నిడివి అసలు సినిమా ముందుంది’ అని బీజేపీ ఊరిస్తోంది. జనం బతుకుతో ముడిపడిన ప్రజా ఎజెండాను పక్కన పెట్టి, పార్టీలు తమకు అనుకూల వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి మాటల్ని పౌరులు ఏ మేరకు విశ్వసిస్తారు? ఎలా స్పందిస్తారు? అన్నది జూన్‌‌ 4న  తేలడం ఖాయం!

హైకోర్టు స్పందన దేనికి సంకేతం?

ఇటీవల  హైదరాబాద్‌‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఒక లేఖను తనకు తాను (సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌‌)గా స్వీకరించింది. హైదరాబాద్, దాని పరిసరాల్లో ఉన్న చెరువులు, కుంటలు దురాక్రమణలకు గురవుతున్నాయి, వాటిని బాధ్యులెవరూ అడ్డుకోవడం లేదు, సంరక్షించడం లేదు. ఇలా అయితే ఎలా?  నీటి ఎద్దడి సంక్షోభం తీవ్రమైతే ఏమిటి పరిస్థితి? అనే అర్థమొచ్చేలా హైకోర్టు జడ్జి ఒకరు ఈ లేఖను చీఫ్‌‌ జస్టిస్‌‌కి రాశారు. ఇవేవీ రాజకీయ వ్యవస్థకు, కనీసం ఎన్నికలప్పుడైనా పట్టకపోతే.. ఇక ప్రజా సమస్యలకు పరిష్కారమెప్పుడు? ఈ సమయంలోనే.. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రత్యర్థులను మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నోటికొచ్చినట్టు తిట్టారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ మేరకు అందిన ఫిర్యాదుకు స్పందిస్తూ  ఎన్నికల సంఘం కేసీఆర్‌‌కు నోటీసు ఇచ్చింది. ఫలానా గడువులోపు వివరణ ఇమ్మని, కానీ, వివరణ ఇవ్వడానికి తనకు ఇంకా కొంత గడువు కావాలని ఆయన స్పందించారు. పరస్పర విరుద్ధమైన ఈ పరిస్థితి దేన్ని సూచిస్తోంది?

 

- దిలీప్‌‌రెడ్డి,
పొలిటికల్‌‌ అనలిస్ట్‌‌,
 పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ