బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు నమ్మిన్రు

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పడానికి హుజూరాబాద్​ తీర్పే సంకేతం. అమరవీరుల త్యాగాలను విస్మరించి కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకుంటున్న టీఆర్ఎస్ ను అంతమొందించేందుకు ప్రజలు ఇచ్చిన సందేశం ఇది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. అహంకారానికి సమాధి కట్టి బీజేపీకే పట్టం కట్టారు. ధర్మానికి.. అధర్మానికి జరిగిన ఎన్నికల్లో ధర్మం గెలిచింది. డబ్బులు, మద్యం ఓడిపోయాయి. హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న గులాబీ దండుకు ప్రజలు కర్రుకాల్చి వాతలు పెడుతూ బీజేపీకి జేజేలు పలికారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దెదింపడం.. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయం. 

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అవినీతి, నియంత, అహంకార, కుటుంబ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారనడానికి హుజూరాబాద్​లో బీజేపీ గెలుపే నిదర్శనం. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఈ ఎన్నికతో స్పష్టమైంది. హుజూరాబాద్ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి రాజకీయాలకు మద్దతు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో అడ్డదారుల్లో గెలవాలని టీఆర్ఎస్ చూసినా.. బీజేపీకే ప్రజలు పట్టం గట్టారు. ప్రజలిచ్చిన ఈ చరిత్రాత్మక తీర్పు రాష్ట్రంలోని పాలకులకు కనువిప్పు కలిగించాలి. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా, కోట్లు కుమ్మరించినా, ఓటుకు వేల కొద్దీ డబ్బులు పంచినా బీజేపీ, ఈటల రాజేందర్‌నే గెలుపు వరించింది. వందల కోట్ల ధన ప్రవాహంలో కూడా ప్రజాస్వామ్యం బతికే ఉందని నిరూపించిన హుజూరాబాద్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ తీర్పు ప్రగతిభవన్ వరకు వెళ్లాలి. తెలంగాణ బీజేపీకి ఆశీస్సులు అందించిన హుజూరాబాద్ ప్రజలను తెలంగాణ సమాజం మరువదు.

ప్రజలను తప్పుదోవ పట్టించిన్రు

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్​ను అహంకారపూరితంగా రాష్ట్ర కేబినెట్​నుంచి బర్తరఫ్​చేయడంతో హుజూరాబాద్​ ఉప ఎన్నిక వచ్చింది. ఈటల ఆత్మగౌరవం దెబ్బతినడంతో తనను బర్తరఫ్​ చేసిన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈటల మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇది అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక. చివరికి అధికార పార్టీ పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినా ప్రజలు నీతికి, నిజాయితీకే ఓటు వేశారు. ఓటు విలువను కాపాడారు. ఓటు అనే ఆయుధాన్ని వాడుకుని ప్రజాస్వామ్యానికి, ప్రజా నాయకుడికి పట్టం కట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెరుగుదలకు మోడీ ప్రభుత్వమే కారణమని ప్రజలను టీఆర్ఎస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. హరీశ్​ అదే పనిగా గ్యాస్ సిలిండర్‌ను వెంటబెట్టుకుని ప్రచారం చేశారు.

వేల కోట్లు కుమ్మరించినా..

ట్రబుల్ షూటర్ అంటూ హరీశ్ ను రంగంలోకి దింపినా.. వేల కోట్లు గుమ్మరించినా.. అన్ని పథకాలు వర్తింపజేసినా.. పదవులన్నీ హుజూరాబాద్ కే కట్టబెట్టినా.. కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి, రమణ లాంటి నాయకులను చేర్చుకున్నా లాభం లేకపోయింది. ప్రతి మండల కేంద్రానికి ఒక మంత్రి.. వారికి సహాయకంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. చోటా మోటా సహా నాయకులు కొనుగోలు.. 5 నెలలుగా గులాబీ నేతలంతా హుజూరాబాద్​లోనే మకాం వేసినా.. ఈటలను కేసీఆర్ ఓడించలేకపోయారు. టీఆర్ఎస్ పార్టీ అంతా కలిసి పోరాడినా రాష్ట్రంలో కమల వికాసాన్ని నిలువరించలేక పోయింది. టీఆర్ఎస్ సిట్టింగ్ సీటులో బీజేపీ జెండా పాతింది. మంత్రి హరీశ్​ అన్నీ తానై ప్రచారం నిర్వహించినా హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రజలు కారును షెడ్డుకు పంపించారు. టీఆర్ఎస్ ఆర్థబలం, అంగబలం, అధికార దుర్వినియోగం, అరాచకాలు, అక్రమాలను దీటుగా ఎదుర్కొని ప్రజా బలంతో బీజేపీ అభ్యర్థి ఈటల ఘనవిజయం సాధించారు. దీంతో హుజూరాబాద్ గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడింది. కమలం గాలికి టీఆర్ఎస్ కారు కొట్టుకుపోయింది.

బీజేపీనే ప్రత్యామ్నాయమని నమ్మిన్రు

సబ్ కా సాత్- సబ్ కా వికాస్- సబ్ కా విశ్వాస్-సబ్ కా ప్రయాస్ నినాదంతో ముందుకెళ్తూ, సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన పథకాలు, కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. అందుకే దేశ ప్రజలందరూ ఇప్పుడు బీజేపీ పక్షాన నిలబడటమే కాకుండా కమలం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​కు దీటైన ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని గుర్తించారు. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పట్ల జనం ఎప్పుడో విశ్వాసం కోల్పోయారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే టీఆర్ఎస్ పంచన చేరతారని, ప్రజల పక్షాన ఉండరని, స్వప్రయోజనాల కోసం పాటుపడతారని వారు భావిస్తున్నారు. మతోన్మాద మజ్లీస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ వేరు కాదు, ఒక గూటి పక్షులే అనే నిర్ధారణకు వచ్చారు. అందుకే బీజేపీ, నరేంద్రమోడీ పని తీరు పట్ల ఆకర్షితులవుతున్నారు. అందుకే కలసి రండి, బీజేపీ వేదిక ద్వారా కలిసి యుద్ధం చేద్దాం. అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కానీ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులిచ్చిందో గ్రామాలవారీగా ప్రజలకు వివరించాం. ఎవరు వాస్తవాలు చెప్పారు.. ఎవరు అబద్ధాలు చెప్పారో హుజూరాబాద్ ప్రజలు గ్రహించి తీర్పునిచ్చారు.

ఈ తీర్పు టీఆర్ఎస్​కు చెంపపెట్టు

హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ విజయం పట్ల తెలంగాణలోని ప్రతి గ్రామంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గెలుపును రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులంతా స్వాగతిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలు కూడా ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ అక్రమాలతో విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. ఈ ఉపఎన్నికలో జరిగినంత అరాచకం, అధికార దుర్వినియోగం మరెక్కడా కనపడలేదు. ఈటల రాజేందర్ పై కేసుల పేరుతో దారుణంగా వేధించారు. హైదరాబాద్ లో వారి కుటుంబ సభ్యులను వేధించారు. బీజేపీ నాయకులు ప్రచారానికి వెళ్తే అడుగడుగునా సోదాల పేరుతో అడ్డంకులు సృష్టించారు. కొందరు అధికారులు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ శాశ్వతం అనుకొని అతిగా వ్యవహరించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుల ప్రగల్భాలకు హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు చెంపపెట్టులాంటిది.

అన్ని వర్గాలు కలిసి రావాలె

ఆత్మగౌరవం పోరాటంగా భావించి హుజూరాబాద్ స్థానాన్ని దక్కించుకునేందుకు ముందు నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించిన బీజేపీని అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొని విజయం సాధించింది. ఎన్ని రకాలుగా వేధింపులు, ఇబ్బందులు, కేసులు పెట్టవచ్చో.. కుటుంబం, వ్యక్తిగత ప్రతిష్ఠకు ఎన్ని రకాలుగా భంగం కలిగించవచ్చో అన్నింటినీ టీఆర్ఎస్ ప్రయోగించింది. అందుకే టీఆర్ఎస్​ అరాచక పాలనకు వ్యతిరేకంగా హుజూరాబాద్ ప్రజలు ఈ రూపంలో తీర్పు ఇచ్చారు. ఈ ఫలితం సీఎం కేసీఆర్ కు గుణపాఠం కావాలి. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారు, టీఆర్ఎస్ చేతిలో అవమానాలకు గురైన ఉద్యమకారులు ఏకం కావాలి. విద్యావంతులు, యువకులు, జాతీయవాదులు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, మేధావులు, రాజకీయాల్లోకి రావాలి. బీజేపీతో కలిసి నడవాలి. తెలంగాణను టీఆర్ఎస్ నుంచి విముక్తి కలిగించే పోరాటానికి కలిసి రావాలని పిలుపునిస్తున్నాం. ఇతర పార్టీల నాయకులకు మోడీ నిర్ణయాలు, బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఉమ్మడి లక్ష్యం నెరవేర్చడానికి వస్తే స్వాగతిస్తాం. హుజూరాబాద్ విజయం స్ఫూర్తిగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తాం. గోల్కొండ కోట మీద కాషాయ జెండా రెపరెపలాడే వరకు ఈ జైత్రయాత్రను కొనసాగించడానికి తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించాల్సిందిగా మనవి. 

గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేస్తం

హుజూరాబాద్ ఓటర్లు బీజేపీకి స్ఫూర్తిదాయక విజయాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అహంకారానికి గుణపాఠం చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో, దుబ్బాక ఫలితాలను హుజూరాబాద్ లో బీజేపీ పునరావృతం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటాం. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవడానికి మోడీ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. హుజూరాబాద్ గెలుపు ద్వారా బీజేపీ పట్ల బాధ్యత పెరిగింది, అందుకే ఇకపై బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. కొత్త, పాత నాయకుల కలయికతో ఇంకా కలిసి వచ్చేవారిని కలుపుకుని తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తాం. దశాబ్దాల తరబడి చేసిన త్యాగాలను, నక్సలైట్ల, జిహాదీ ఉగ్రవాదుల దాడులకు బలైన అమరవీరుల కలలను సాకారం చేయడానికి కలిసి నడుస్తాం. గతంలో సిద్ధాంత వ్యాప్తి కోసం ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లం. ఇక మా పోటీ గెలవడానికి, గెలిచి నిలబడడానికి అంతరాలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం.

టీఆర్ఎస్​ సర్కారు రూపాయి కూడా తగ్గించలే

మోడీ ప్రభుత్వం దీపావళి కానుకగా పెట్రోల్​పై లీటర్​కు రూ.5 , డీజిల్ పై లీటర్ కు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా రైతులకు ఊరట కల్పించింది. దానికి అనుగుణంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ను తగ్గించారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్​పై రూ.12, లీటర్​ డీజిల్ పై రూ.20 నుంచి రూ.25 వరకు తగ్గిస్తే తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదన్న చందంగా టీఆర్ఎస్​ సర్కారు వ్యవహరిస్తున్నది. కేంద్రం జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువచ్చి ప్రజలను ఆదుకుంటామంటే ససేమీరా వద్దని టీఆర్ఎస్ ద్వంద్వ నీతితో ప్రజలను మోసం చేస్తున్నది. వాళ్లు చెప్పే మాటల్లో నిజాయితీ లేకపోవడం వల్ల విశ్వసనీయత కోల్పోతున్నారు. హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ మాయమాటలు నమ్మలేదంటే తెలంగాణ ప్రజల ఆలోచన దీనికి అద్దం పడుతోంది.

- డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా