అయోధ్య భూముల కొనుగోలు పక్కాగానే జరిగింది

కోట్లాది మంది హిందువుల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. అయితే దేశంలోని కొన్ని శక్తులకు అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ఇష్టం లేదు. అందుకే ఏదో ఒకరకమైన అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే రామ మందిర భూముల కొనుగోలుకు సంబంధించి ప్రతిపక్ష నాయకులు ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సక్రమంగా జరిగిన భూ కొనుగోలులో కుంభకోణం జరిగిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ, అబద్ధాలతో ఎక్కువ కాలం మనుగడ సాగించలేమని ప్రతిపక్షాలు గుర్తించాలి. నిలకడ మీద తెలిసే నిజాలు ఇలాంటి కుట్రలను కకావికలం చేస్తాయి.

రామ జన్మ స్థానంలో రామ మందిర నిర్మాణం కోసం 500 ఏండ్లుగా జరుగుతున్న ధార్మిక న్యాయ పోరాటాలు 2019 నవంబర్​లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో కొలిక్కి వచ్చాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 5న శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది. కోర్టు నిర్దేశించిన 14 వేల చదరపు అడుగుల స్థలంతోపాటు తన అధీనంలో ఉన్న 70 ఎకరాలను కూడా ట్రస్టుకు అప్పగించింది. గతేడాది ఆగస్టు 5న ప్రధాని మోడీ భూమి పూజ చేసి రామ మందిర నిర్మాణం ప్రారంభించారు. ట్రస్టు నిర్వహించిన నిధి సేకరణ కార్యక్రమానికి ఊహించినదానికన్నా ఎక్కువగా స్పందించిన భక్తులు సుమారు రూ.2,400 కోట్లు సమకూర్చారు. మరికొందరు స్వచ్ఛందంగా రూ.700 కోట్ల వరకూ ఆన్​లైన్​ ద్వారా ట్రస్టుకు అందించారు. పనులు చురుకుగా సాగుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు రామ మందిర నిర్మాణం పూర్తవుతుందా? ఎప్పుడెప్పుడు అయోధ్యలో రామ్​లాలా దర్శనం చేసుకుందామా? అని దేశమంతా ఎదురుచూస్తోంది. 

భూముల కొనుగోలుపై అబద్ధపు ప్రచారం
ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధాంత రాహిత్యంతో, అవసాన దశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్, ఆమ్​ ఆద్మీ, సమాజ్​వాదీ పార్టీలు దేశంలో అధికారంలో ఉన్న జాతీయవాద శక్తులను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు మొదలుపెట్టి ప్రజలను భ్రమల్లోకి నెట్టి పబ్బం గడుపుకునే కుతంత్రాలకు దిగాయి. నిజానిజాలతో ఈ పార్టీలకు సంబంధం లేదు. అవతలి వారిపై బురదజల్లి పారిపోవడం ఒక్కటే ఈ పార్టీలకు తెలుసు. ఎవరైనా నిజాలను బయటపెడితే వాటిని భరించే శక్తి కూడా ఈ పార్టీలకు ఉండదు. దుష్టపన్నాగంలో భాగంగానే సమాజ్​వాదీ, కాంగ్రెస్, ఆమ్​ఆద్మీ పార్టీలు శరవేగంగా సాగుతున్న మందిర నిర్మాణానికి అడ్డంకులు సృష్టించేందుకుగాను ఆధారాలు లేని వాదనలతో మరోసారి అబద్ధాలను ప్రసారం చేయడం మొదలుపెట్టారు. చిత్తశుద్ధితో ప్రతి రూపాయికీ జవాబుదారీతనం వహిస్తూ మందిర నిర్మాణం సాగిస్తున్న ట్రస్టు సభ్యులపై అనవసరపు అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేశాయి. నిజం నిగ్గుతేల్చేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందన్న వాదనను అసరాగా తీసుకుని బీజేపీ వ్యతిరేకులు, మోడీ, జాతీయవాద శక్తుల వ్యతిరేకులు సోషల్​ మీడియాలో అసత్య ప్రచారం మొదలు పెట్టారు.

2019లో కుసుమ్–అన్సారీ మధ్య ఒప్పందం
ఆప్, ఎస్పీ, కాంగ్రెస్​ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిజమేనా అని విచారణలోకి వెళితే అసలు కుంభకోణమే లేదన్న వాస్తవం తెలుస్తుంది. 2019 సెప్టెంబర్​17న కుసుమ్​ పాఠక్​ అనే మహిళ తనకు సంబంధించిన భూమిని రూ.రెండు కోట్లకు అమ్మడానికి అన్సారీ అనే వ్యక్తితో సేల్​ అగ్రిమెంట్​ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అన్సారీ రూ.50 లక్షలను అడ్వాన్స్​గా కుసుమ్​ కు ఇచ్చాడు. మూడేండ్లలోగా మిగిలిన రూ.కోటిన్నర ఇచ్చి భూమి రిజిస్టర్​ చేయించుకుంటానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. కుసుమ్​ పాఠక్​–అన్సారీల మధ్య భూ ఒప్పందం కుదిరిన కొన్ని నెలలకు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఏర్పాటైన తీర్థ క్షేత్ర ట్రస్టు విశాలమైన మందిర నిర్మాణం, భక్తులు, యాత్రీకుల సౌకర్యార్థం భవనాల నిర్మాణానికి భూములు సేకరించడం మొదలుపెట్టింది. కుసుమ్–అన్సారీ మధ్య ఒప్పందం కుదిరిన భూమి అయోధ్య రైల్వే స్టేషన్​కు దగ్గరగా ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ఇది ఎంతో ఉపయోగకరమైనది. సేల్​ అగ్రిమెంట్​ ప్రకారం ఈ భూమి అన్సారీ అధీనంలో ఉంది. కానీ, ఆయన టైటిల్​ హోల్డర్​ కాదు. ఎందుకంటే అన్సారీ పేరు మీద భూమి రిజిస్ట్రేషన్​ జరగలేదు. అంటే భూయజమాని కుసుమ్ మాత్రమే. భూసేకరణ జరుగుతున్న సమయంలో ఈ భూమిని ట్రస్టుకు అమ్మడానికి అన్సారీ అంగీకరించారు. భూమి అమ్మడానికి ఆయనకు హక్కు లేదు కాబట్టి ముందుగా భూమిని తన పేరు మీదకు మార్చుకుని అప్పుడు అమ్మాలని ట్రస్టు సూచించింది. ఎటువంటి వివాదాలు, లిటిగేషన్లలో పడటం ట్రస్టుకు ఇష్టం లేదు. కాబట్టి టైటిల్​ తెచ్చుకున్నాక కొంటామని స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది మార్చిలో ఈ భూమి టైటిల్​ మారింది.

మార్కెట్​ రేటు కంటే తక్కువకే భూమి కొనుగోలు
2019 ముందు ఉన్న భూముల ధరలు.. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుక్షణం ఆరు రెట్లు పెరిగాయని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే భూములు ధరలకు రెక్కలొచ్చి విపరీతంగా పెరిగిపోయాయన్నది వాస్తవం. అయోధ్యలో ప్రస్తుత యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా భూముల ధరలు పదింతలు పెరిగాయి. అన్సారీ నుంచి రూ.18.5 కోట్లకు ట్రస్టు కొనుగోలు చేసిన భూమి విలువ ఈ రోజున రూ.24 కోట్లు ఉంటుందని అంచనా. భవ్యమైన రామ మందిర నిర్మాణం, మందిర భద్రతను దృష్టిలో పెట్టుకుని వాస్తు దోషాలను సవరిస్తూ భక్తుల సౌకర్యార్థం ట్రస్టు భూమిని కొనుగోలు చేస్తున్నది. అందులో భాగంగానే అన్సారీ దగ్గర ఈ భూమిని కొన్నది. మొత్తం ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్​లైన్​లోనే జరిగాయి. ఒక్క పైసా కూడా నగదు రూపంలో వాడ లేదు. అన్సారీ దగ్గర కొన్న భూమి నగరం నడిబొడ్డున ఉన్నది. అయినప్పటికీ మార్కెట్​ విలువ కంటే తక్కువగా చదరపు అడుగును రూ.1,423కు కొనుగోలు చేశారు. మార్కెట్​ విలువ ఇంతకంటే ఎక్కువగా ఉన్నది. ప్రతిపక్ష నాయకులు వాస్తవాలు తెలిసి కూడా తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని భ్రమింప చేసే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్​లో జరుగుతున్న స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్​ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఎస్పీ, ఆప్, కాంగ్రెస్​ నాయకులు రామ మందిర నిర్మాణాన్ని వివాదాస్పదం చేయాలని ప్రయత్నించడం దురదృష్టకరం. తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ పార్టీలు చేస్తున్న దుర్మార్గాలను ప్రజలు ఎండగడతారు. నిదానంగా వచ్చినా నిజం నిలకడగా వస్తుంది. అజ్ఞానపు, కుట్ర పూరిత చీకట్లను పటాపంచలు చేస్తుంది.

పూర్తి వివరాలు బయటపెడితే వివాదమే లేదు
రాజకీయ అస్తమయం అంచుల్లో ఉన్న తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎస్పీ, ఆప్, కాంగ్రెస్​ ఈసారి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. రామ మందిర నిర్మాణానికి సేకరిస్తున్న భూముల కొనుగోలులో కుంభకోణం జరిగిందని, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఆయా పార్టీల నాయకులు రోడ్డెక్కారు. ఈ నాయకులెవరూ తమ ఆరోపణల్లో నిజం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ట్రస్టు సభ్యుల నుంచి ఎటువంటి వివరణా కోరలేదు. చేతికి దొరికిన సగం కాగితాల నుంచి పదాలు కూడగట్టి పసలేని ఆరోపణలకు దిగారు. ఊరు పేరు లేని నాయకులు చేసిన అసత్య ఆరోపణలను కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​గాంధీ కూడా ప్రచారం చేయడం దురదృష్టకరం. మందిర నిర్మాణానికి పైసా కూడా విరాళం ఇవ్వబోమని బహిరంగంగా ప్రకటన చేసిన వారంతా ఇప్పుడు కుంభకోణం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. అయోధ్యలో రూ.రెండు కోట్ల విలువ చేసే ఒక భూమిని ట్రస్టు రూ.18.5 కోట్లకు ఖరీదు చేసిందని, ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని ఆప్​ నాయకుడు సంజయ్​సింగ్​ ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా కొన్ని కాగితాలను మీడియాకు చూపించారు. అయితే వివరాలు పూర్తిగా తెలిసినా సంజయ్​సింగ్​ ఉద్దేశపూర్వకంగానే కొన్ని కాగితాలను బయటపెట్టలేదు. సంజయ్​ దాచిపెట్టిన కాగితాల్లోనే వాస్తవాలున్నాయి. పూర్తి వివరాలను బయటపెట్టి ఉంటే అసలు వివాదమే ఉండేది కాదు.

మార్చిలో మారిన యాజమాన్యపు హక్కులు
2021 మార్చి 18న ఈ భూమి తాలూకు టైటిల్​ డీడ్​ కుసుమ్​ నుంచి అన్సారీకి మారింది. అంటే అప్పటి నుంచి ఆ భూమికి యజమాని అన్సారీనే. ఈ భూమిని కొనడానికి ట్రస్టు అన్సారీతో సేల్​ అగ్రిమెంట్​ కుదుర్చుకున్నది. 2009కి ముందు నామమాత్రంగా ఉన్న అయోధ్య భూములు ధరలు ఆ తర్వాత విపరీతంగా పెరిగాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరల తాకిడి నుంచి బయటపడడానికి, మందిర నిర్మాణం కోసం భూమి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రస్టు ఆ భూములను వెనువెంటనే కొనుగోలు చేసింది. అయితే పది నిమిషాల వ్యవధిలోనే రెండు కోట్ల విలువ చేసే భూమి రూ.18.5 కోట్లకు పెరిగిందని, ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కుసుమ్​నుంచి కొనుగోలు చేసిన భూమిని అన్సారీ లేదా ఆయన స్థానంలో ఉండే మరో యజమాని ఎవరైనా సరే అప్పుడున్న మార్కెట్​ విలువకే అమ్ముతారు కానీ 2019 నాటి ధరకు అమ్మరు కదా? నిజానికి కుసుమ్–అన్సారీ మధ్య ఈ భూమి తాలుకు ఒప్పందాలు 2011 నుంచి జరుగుతూ వస్తున్నాయి. చివరి ఒప్పందం ప్రకారం రూ.రెండు కోట్లుగా నిర్ణయించుకున్నారు. భూ కొనుగోలు ఒప్పందాల విషయంలో ఉత్తరప్రదేశ్, బీహార్​ తదితర ప్రాంతాల్లో ఒక పద్ధతి ఉన్నది. అమ్మేవారు కొనేవారు సిద్ధంగా ఉంటే భూములు ఒప్పందాన్ని నోటరీ చేయించి వెంటనే రిజిస్ట్రేషన్​ చేస్తారు. అదే పద్ధతిలో మొదట కుసుమ్–అన్సారీ మధ్య.. ఆ వెనువెంటనే అన్సారీ–ట్రస్టుల మధ్య ఒప్పందం కుదిరి రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోయాయి.

- కామర్సు బాలసుబ్రహ్మణ్యం, సెక్రెటరీ, బీజేపీ పార్లమెంటరీ కార్యాలయం