
వ్యవసాయ భూమిలో రసాయనిక ఎరువులు, మందుల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దీనివల్ల సాగుభూమితోపాటు పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. నీటి వనరులు( వాటర్ బాడీస్ ), మనుషులు, జీవరాశి మొదలైన వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కాబట్టి వ్యవసాయ భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు విస్తృతంగా జరగాలి. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాగుభూముల్లో శాస్త్రీయంగా చేసిన పరిశోధనల వల్ల వెల్లడైన అంశాలతో ఒక రీసెర్చ్ పేపర్‌ను రాయడం జరిగింది.
ఈ పరిశోధన పత్రాన్ని ప్రతిష్టాత్మకమైన స్కోపస్ ఇండెక్స్డ్ ( scopus Indexed) జర్నల్.. సింగపూర్ కేంద్రంగా ఉన్న ‘ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎర్త్ సైన్సెస్’లో ప్రచురించడం జరిగింది. గత పది సంవత్సరాల క్రితం సాగుభూమిలో ఎలాంటి మందులు వాడేవారు, ప్రస్తుతం ఎలాంటి మందులు వాడుతున్నారు, ఎంత మోతాదులో వాడుతున్నారు అనే అంశాలపై పరిశోధన చేయడం జరిగింది.
ఇందుకుగాను తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట, జనగాం, కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలకు చెందిన పలు గ్రామాల్లోని సాగుభూముల్లో శాస్త్రీయ ఉపకరణాలను ఉపయోగించి రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేయడం జరిగింది. ఈ పరిశోధన వల్ల భూమి ఆరోగ్యం ( భూసారం) గత పది సంవత్సరాల క్రితం ఎలా ఉంది? అనేది తెలిసింది. సాగు భూమిలో రసాయనిక ఎరువులు, మందులు వాడకంపై రైతులకు ఉన్న అవగాహన ఏమిటి? అసలు మందుల వాడకం ఎందువల్ల చేస్తున్నారు..? అనేది కూడా తెలిసింది. ఉదాహరణకు ఒక ఎకరం వరి లేదా పత్తి పంట సాగులో గత పది ఏళ్ల క్రితం 70 కిలోల యూరియా, 100 కిలోల (క్వింటాల్) డీఏపీ వాడేవారు. అదే ఇప్పుడు ఒకే వరి పంటలో ఎకరానికి 150 కిలోల యూరియా, 250 కిలోల ( రెండున్నర క్వింటాల్స్) డీఏపీ మందులను వాడుతున్నారు.
పంట చేనుల్లో విష రసాయనాలు
ఒకప్పుడు పొటాషియం వరి పంటకు మాత్రమే వాడేవారు. కానీ, ఇప్పుడు వరితోపాటు పత్తి పంటకు కూడా పొటాషియం వాడుతున్నారు. అది కూడా ఎకరాకు 75 కిలోల నుంచి క్వింటాల్ వరకు వాడుతున్నారు. పది సంవత్సరాల క్రితం వరి పొలాలకు తెగుళ్లు పట్టినప్పుడు మాత్రమే క్రిమిసంహారక మందులను పిచికారి చేసేవారు. అలాగే ఎకరా పత్తికి అవసరం మేరకు ఒక లీటర్ లోపు పురుగుల మందులను పిచికారి చేసేవారు. గడ్డి మందులను ( హెర్బిసైడ్స్) వాడేవారు కాదు.
గడ్డి మందులు మరింత ప్రమాదం
ఇప్పుడు వరి పంటకు అవసరం ఉన్నా లేకున్నా అధిక దిగుబడి ఆశతో ఒక లీటర్ పైనే పురుగుల మందులను, గడ్డి మందులను ఎక్కువ మోతాదులో పిచికారి చేస్తున్నారు. అదే పత్తి పంటకు అయితే ఎకరాకు రెండు లీటర్ల నుంచి మూడున్నర లీటర్ల మేరకు పురుగుల మందు గడ్డి మందు వాడుతున్నారు. ఒకప్పుడు కూలీలను ఉపయోగించి పంట చేనులలో గడ్డిని తొలగించేవారు.
ప్రస్తుతం అలా చేయకుండా గడ్డి మందులను పిచికారి చేస్తూ పంట చేనులలో విష రసాయనాలను నింపుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని రైతులను అడిగినప్పుడు కూలీల ద్వారా గడ్డిని తొలగించాలంటే ఒక ఎకరానికి మూడు రోజుల సమయంతోపాటు సుమారు రూ.3 వేల వరకు వ్యయం అవుతుందని, అదే గడ్డి మందును పిచికారి చేయడం వల్ల ఒక ఎకరానికి మూడు గంటల్లో కేవలం వెయ్యి రూపాయలలోపే ఖర్చు అవుతుందని తెలిపారు. అందువల్ల తాము ఈ విధానాన్ని ఎంచుకున్నామని రైతులు వివరించారు.
భూమి సారవంతం కావాలంటే వందల ఏండ్లు
ఒక పిడికెడు మట్టి సహజంగా సారవంతం కావడానికి వందలాది సంవత్సరాలు సమయం పడుతుంది. అలాంటిది మానవుల విపరీత పోకడల వల్ల అధిక మోతాదులో క్రిమిసంహారక మందులను వాడటం వల్ల భూసారంతో పాటు మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మానవుల విపరీత చర్యల వల్ల అధిక రాబడి కోసం నియంత్రణ లేని రసాయనిక ఎరువులు మందుల వాడకం వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లడమే కాకుండా పర్యావరణానికి, సర్వ జీవరాశికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది.
సాగుభూమిని కాపాడకపోతే..
2015 నుంచి 2030 వరకు ‘యూఎన్- సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్’లోని 17 ముఖ్యమైన అంశాలలో వ్యవసాయాన్ని , భూమిని కాపాడుకోవడం లక్ష్యాలుగా ఉన్నవి. అయితే, ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు గడిచినా ఇంకా వినాశకరపోకడల దిశగానే వ్యవసాయరంగం కొనసాగుతోంది. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడు సహజంగానే మానవ మనుగడ జీవరాశి మనుగడతో పాటు పర్యావరణ పరిరక్షణ సమతుల్యత ఏర్పడుతుంది. భూమి ఆరోగ్యం గురించి పట్టించుకోకపోయినట్లయితే కొద్దిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా పంటల ఉత్పత్తి తగ్గిపోతూ ఆహార కొరత ఏర్పడుతుంది.
దీంతోపాటు ప్రజలు ఆకలి చావులకు గురయ్యే అవకాశం ఉంది. ఇది మొదటి దశ కాగా రెండో దశలో మానవులు వ్యవసాయం చేసుకోవడానికి అనువైన సాగు భూమి కూడా దొరకకపోవచ్చు. ఎందుకంటే నేడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం భూమిలో సాగుభూమికి అనుకూలమైనది కేవలం 21 శాతం మాత్రమే. ఇందులో పంటలు పండిస్తున్న భూమి కేవలం 12 శాతం మాత్రమే. ఈ పన్నెండు శాతం సాగుభూమిలో ఇప్పటికే దాదాపు ఒక శాతం నాన్ అగ్రికల్చరల్ కార్యకలాపాలు, పరిశ్రమలు, పట్టణీకరణ, రియల్ ఎస్టేట్ రంగం మొదలైన కారణాలతో కాంక్రీట్ జంగల్‌గా మారింది. ఇదే కారణాలతో రానున్న కాలంలో కూడా సాగుభూమి తగ్గే అవకాశం ఉంది.
వ్యవసాయ పద్ధతులపై నియంత్రణ
ఇప్పటికే క్రిమిసంహారక మందులు, ఫెర్టిలైజర్స్ వల్ల 40 శాతం మేరకు సాగు భూమిసారం దెబ్బతిన్నది. కాగా 2050 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్ల నుంచి 1000 కోట్లకు చేరుకోనున్నది ఒకవైపు జనాభా పెరుగుతుంది మరోవైపు సాగుభూమి శాతం తగ్గుతుంది. ఈ కారణాలతో ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మంది మానవులు ఆహారం దొరకక మృత్యువాత పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా రైతులు.. భూసారం పరిరక్షణ, ఆహార భద్రతకు తప్పనిసరిగా సుస్థిర వ్యవసాయ పద్ధతులను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ పద్ధతులపై నిర్దిష్టమైన నియంత్రణ పద్ధతులు అమలుచేయాలి. తగిన పాలసీలు రూపకల్పన చేయడమే కాకుండా వాటిని కచ్చితంగా అమలు చేయాలి. ఈ పాలసీల అమలుకు దేశ రాజధాని నుంచి మొదలుకొని రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల వరకు తగిన అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే మానవ మనుగడను, జీవరాశి రక్షణను, పర్యావరణ పరిరక్షణను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు సాగు భూమిని అందించగలుగుతాం.
మాయమైన సేంద్రీయ ఎరువులు
పదేళ్ల క్రితం రైతు కుటుంబంలో పశు సంపద చూస్తే ఒక మోతాదులో అనగా ఒక ఇంటికి రెండు ఎడ్లు, ఒక ఆవు, ఒక బర్రె కనీసం ఉండేవి. అప్పుడు రైతులు సాగుభూమిని నాగలితో దున్నేవారు. ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల పేరుతో ట్రాక్టర్లు ఉపయోగించి అవసరానికి మించిన లోతులో భూమిని దున్నడం జరుగుతోంది. పశువుల, గొర్రెల -మేకల నుంచి వచ్చే సేంద్రీయ ఎరువులు కూడా పంట పొలాల్లో చల్లడం మానేశారు.
నాగలితో దున్నిన భూమి వల్ల విత్తనానికి ఎంతమేరకు పోషక బలాలు అవసరమో అంత మేరకు లభించేవి. కానీ, సాగు భూమిని ట్రాక్టర్‌తో అధికంగా దున్నడం వల్ల భూమి పొరల్లో ఉన్న ఫెర్టిలిటీ (భూసారం) అధికమై గడ్డి మొలవడం జరుగుతోంది. ఈ గడ్డిని తొలగించడానికి రైతులు మళ్లీ గడ్డి మందులను పిచికారి చేసి భూమిలో ఉన్న విలువైన సూక్ష్మ- స్థూల పోషకాలను నాశనం చేస్తున్నారు.
- కత్తెరసాల శ్రీనివాస్,
ఉస్మానియా యూనివర్సిటీ