- ఫ్రీడమ్ ఫైటర్ల వారసులకు రిజర్వేషన్లపై బంగ్లాదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత
- ప్రతిపక్షాలు, స్టూడెంట్ల ఉద్యమంతో అగ్నిగుండంలా మారిన దేశం
- ఢాకా వీధుల్లో రక్తపాతం వందల్లో మరణాలు
- కుప్పకూలిన ప్రభుత్వం..దేశం వెడిచి వెళ్లిన ప్రధాని షేక్ హసీనా
సెంట్రల్ డెస్క్ : విద్యార్థులు, ప్రభుత్వ మద్దతుదారుల మధ్య ఘర్షణ, హింసాత్మక ఘటనలలో బంగ్లాదేశ్ అగ్నిగుండంగా మారింది. 30 శాతం కోటాకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం.. ప్రధాని షేక్ హసీనా అధికార పీఠం వదిలి దేశం నంచి పారిపోయేలా చేసింది. 2009 నుంచి ఆమె దేశాన్ని పాలిస్తున్నారు. ఇటీవల 2024 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పార్టీ అవామీ లీగ్ ఏకపక్షంగా విజయం సాధించింది. ఏడు నెలలు తిరగక ముందే తను రాజీనామా చేయాల్సిన విపత్కర పరిస్థితి వస్తుందని ఆమె ఊహించి కూడా ఉండరు. 1971 ఫ్రీడమ్ ఫైటర్ల వారసులకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల రోజుల కింద దీనిపై దేశ వ్యాప్తంగా విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ఉద్యమం పెను తుఫానుగా మారి బంగ్లాదేశ్ ను అల్లకల్లోలం చేసింది. ప్రభుత్వం కుప్పకూలడం, ప్రధాని దేశం విడిచి పారిపోవడంతో చివరకు దేశమే ఖల్లాస్ అయింది.
స్వాతంత్రోద్యమ వారసుల కోటాతో..
బంగ్లాదేశ్ 1971 మార్చిలో పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఆ సమయంలో తొమ్మిది నెలలు జరిగిన ఈ అంతర్యుద్ధంలో 30 లక్షల మంది అమరులయ్యారు. 2022 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ జనాభా 17.12 కోట్లు. తాజాగా షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం 1971 అమరుల వారసులకు ఉద్యోగాల్లో 30 రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేశారు. రోడ్లు, రైల్వే లైన్లను ముట్టడించారు. ఈ రిజర్వేషన్లతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుతుందని ఆరోపించారు. రిజర్వేషన్ల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పన్నులు, బిల్లులు ఏవీ కట్టొద్దని ప్రజలను కోరారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల్ని, ఫ్యాక్టరీలను మూసేయాలని ఉద్యమించారు. ఆందోళనలు అల్లర్లకు దారితీశాయి. హింసాత్మకంగా మారాయి. చిన్నగా మొదలైన ఉద్యమం దేశాన్ని అగ్నిగుండం చేసింది.
ఆజ్యం పోసిన హసీనా కామెంట్లు
విద్యార్థులు టైమ్ వృథా చేసుకుంటున్నారని షేక్ హసీనా చేసిన కామెంట్లు స్టూడెంట్లలో మరింత కసిని పెంచాయి. అల్లర్ల సందర్భంగా జరిగిన ప్రతి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆమె హెచ్చరించారు. ప్రధాన మంత్రి వ్యాఖ్యలతో విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ టెలివిజన్ హెడ్ క్వార్టర్స్, ప్రభుత్వ ఆఫీసులను ఘెరావ్ చేశారు. దీంతో.. ప్రభుత్వం ఇంటర్నెట్ ఆపేసింది. విద్యార్థులు, ప్రభుత్వ మద్దతుదారుల మధ్య ఘర్షలు మరింత చెలరేగాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించి సైన్యాన్ని మోహరించింది.
లాంగ్ మార్చ్‌కు విద్యార్థుల పిలుపు
ఈ వివాదంపై సుప్రీం కోర్టు ఆగస్టు 7న తుది తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆగస్టు 4న రాజధాని ఢాకా సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చారు. ఆగస్టు 6న ‘లాంగ్ మార్చ్ టు ఢాకా’ చేపట్టనున్నట్టు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. అలాగే నిరవధిక కర్ఫ్యూ విధిచింది. ఢాకాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు తమ లాంగ్ మార్చ్‌ను సోమవారమే నిర్వహించాలని నిర్ణయించారు. పెద్ద సంఖ్యలో ఢాకాలో రోడ్లపైకి వచ్చారు. ఇదే తరుణంలో విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాజీ సైన్యాధికారులు భద్రతా బలగాలకు సూచిస్తున్నారు. చర్చల ద్వారా ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థులు ర్యాలీగా ప్రధాని నివాసం వెళ్లారు. ఇదే సమయంలో ఆర్మీ షేక్ హసీనాను ప్రధాని పదవికి 45 నిమిషాల్లో రాజీనామా చేయాలని చెప్పింది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి ఆర్మీ హెలీకాప్టర్‌లో భారత్‌కు చేరకున్నారు. ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లారు.
కోటా 5 శాతానికి తగ్గించిన సుప్రీంకోర్టు
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒక శాతం గిరిజనులకు, మరొక శాతం ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని పేర్కొంది. మిగిలిన 93 శాతం నియామకాలు మెరిట్ ఆధారంగానే చేపట్టాలని చెప్పింది. అయితే స్టూడెంట్లు దీనికి అంగీకరించలేదు. స్వాతంత్య్ర సమరయోధుల వారసుల కోటాను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలను కొనసాగించారు.
వరుసగా ఐదోసారి..
షేక్‌హసీనా.. పూర్వపు తూర్పు పాకిస్తాన్(ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉంది)లో 1947 సెప్టెంబర్‌లో జన్మించారు. 1960లో ఢాకా యూనివర్సిటీ లో చదువుకుంటున్నప్పుడే ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం నడిపిన షేక్‌ముజిబుర్ రెహ్మాన్ కూమార్తె అయిన హసీనా.. తండ్రిని పాకిస్తాన్ జైల్లో పెట్టినప్పుడు అతడికి రాజకీయ అనుసంధానకర్తగా పనిచేశారు. తండ్రి వారసత్వంతో దేశ రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీపై విజయం సాధించి షేక్‌హసీనా తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. 2001 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2008లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయంతో 2009లో తిరిగి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్‌పీ అయోమయంలో పడింది. 2004లో తన ర్యాలీలో గ్రెనేడ్ పేలగా, హసీనా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 2009 నుంచి ఇప్పటివరకూ వరుసగా నాలుగుసార్లు గెలిచి, హసీనా రికార్డు సాధించారు. ఆమెను మద్దతుదారులందరూ ఉక్కు మహిళగా పిలుచుకుంటారు. అయితే, రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత హసీనా అసలు స్వరూపం బయటపడిందని, ఆమె నియంతృత్వ విధానాలు అమలు చేయడం మొదలు పెట్టారని అక్కడి ప్రొఫెసర్లు సహా ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. 2009లో అధికారంలోకి వచ్చిన వెంటనే హసీనా 1971 యుద్ధ నేరాల కేసులను విచారించేందుకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. హింసాత్మక నిరసనలకు దారితీసిన కొంతమంది ప్రతిపక్ష సభ్యులను ట్రిబ్యునల్ దోషులుగా కూడా నిర్ధారించింది. దేశంలో ప్రతిపక్షమే లేకుండా చేశారని హసీనాపై విమర్శలున్నాయి.
మా అమ్మ ఇక రాజకీయాల్లోకి రారు: నజీబ్
షేక్ హసీనా రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారని, మళ్లీ రాజకీయాల్లోకి తిరిగి రారని ఆమె కొడుకు సజీబ్ వాజెద్ జాయ్ వెల్లడించారు. ‘‘పేద దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ను హసీనా ఎంతో శ్రమించి ఆర్థికంగా బలోపేతం చేశారు. ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలబెట్టారు. కానీ ఇటీవల జరిగిన పరిణమాల పట్ల ఆమె తీవ్రంగా నిరాశ చెందారు. ఆమె ఇక మళ్లీ రాజకీయాల్లోకి రారు” అని ఆయన సోమవారం బీబీసీ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా, హసీనా పూర్తి పేరు షేక్ హసీనా వాజెద్. ఆమె భర్త ఎంఏ వాజెద్ మియా న్యూక్లియర్ సైంటిస్ట్ గా పని చేశారు. 2009లో అనారోగ్యంతో చనిపోయారు. హసీనాకు ప్రస్తుతం కొడుకు సజీబ్ వాజెద్ జాయ్, కూతురు సైమా వాజెద్ ఉన్నారు. సజీబ్ వాజెద్ వ్యాపార, రాజకీయ రంగాల్లో ఉన్నారు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ ప్రధానికి ఐటీ సలహాదారుగా వ్యవహరించారు.
హిందువులపై దాడులు..ఇద్దరి హత్య
బంగ్లాదేశ్‌లో నిరసనకారులు హిందువుల ఇండ్లు, సంస్థలు, దేవాలయాలపై కూడా దాడులు చేస్తున్నారు. ఆదివారం రంగపూర్ లో ఒక హిందూ అవామీ లీగ్ నేత, కౌన్సిలర్ కాజల్ రాయ్ తోపాటు ఆయన బంధువును నిరసనకారులు హత్య చేశారు. నోవఖాలీ జిల్లాలోనూ యాంటీ కోటా నిరసనకారులు ప్రత్యేకంగా హిందువుల ఇండ్లతోపాటు ఇస్కాన్, కాళీ టెంపుల్స్ పై దాడులు చేస్తున్నారు. ధన్మోండీలోని ఇందిరా గాంధీ ఇండియన్ కల్చరల్ సెంటర్ తోపాటు 4 టెంపుల్స్ పై దాడి చేశారు.