పదవుల కోసం పరుగులు..పార్లమెంట్​ ఎన్నికల లోపే భర్తీ చేసే ఛాన్స్​

పదవుల కోసం పరుగులు..పార్లమెంట్​ ఎన్నికల లోపే భర్తీ చేసే ఛాన్స్​
  •     గాడ్​ఫాదర్​లతో ముమ్మర ప్రయత్నాలు
  •     పార్టీ కోసం పడ్డ కష్టాన్ని వివరిస్తూ మద్దతు పొందే యత్నం

నిజామాబాద్, వెలుగు : జిల్లా కాంగ్రెస్​లో నామినేటెడ్​ పోస్టుల రేస్​ షురువైంది. ఆయా పదవులను దక్కించుకునేందుకు లీడర్లు దౌడు తీస్తున్నారు. తమ గాడ్ ఫాదర్ల ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పదేండ్ల పాటు అధికారంలో లేకున్నా పార్టీ వెన్నంటే నిలిచామని, అధికార బీఆర్ఎస్ ఒత్తిళ్లను తట్టుకొని మరీ నిలబడ్డ తమకు సముచిత స్థానం ఇవ్వాలని కోరుతున్నారు.

నామినేటెడ్​ పోస్టులను భర్తీ చేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్​ ఉండడం, ఢిల్లీ పెద్దలు కూడా అందుకు గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. లోక్​సభ ఎలక్షన్​కు ముందే ఆయా పోస్టులు భర్తీ అయ్యే సంకేతాలు కనిపిస్తుండడంతో ముఖ్య లీడర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

జిల్లాలో నాలుగు కీలక పోస్టులు

నిజామాబాద్​ వ్యవసాయ మార్కెట్​కు ఏటా రూ.2,300 కోట్ల ​టర్నోవర్ ​ఉంటుంది. రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం తర్వాత ఇదే పెద్ద మార్కెట్. సాలీన రూ.23 కోట్ల ఆదాయమున్న ఈ కమిటీ చైర్మన్​ పదవిని డిప్యూటీ మినిస్టర్​ హోదాతో సమానమైన పోస్టుగా భావిస్తారు.

నుడా (నిజామాబాద్​ అర్బన్ ​డెవలప్​మెంట్ ​అథారిటీ) చైర్మన్​ పోస్ట్​కూడా కీలకమైందే. రియల్ ఎస్టేట్​వ్యాపారాలకు పర్మిషన్, బిల్డింగ్​ కన్​స్ట్రక్షన్లకు అనుమతులిచ్చే నుడా పదవికి ప్రొటోకాల్​ ఉంటుంది. వీటి తర్వాత జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్, రూ.వందల కోట్ల ఆస్తులుండే వక్ఫ్​బోర్డు చైర్మన్​ పదవి ముఖ్యమైనవి.

మార్కెట్​ కమిటీలు, ఆలయాల చైర్మన్లు ..

బోధన్, వర్ని, కోటగిరి, వేల్పూర్, ఆర్మూర్, కమ్మర్​పల్లి అగ్రికల్చర్ ​మార్కెట్​కమిటీ, రెంజల్ ​మార్కెట్ ​ కమిటీ, ఆర్మూర్ సిద్ధులగుట్ట, మాధవ్​నగర్​ సాయిబాబా టెంపుల్, జానకంపేట​ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ చైర్మన్ ​పోస్టులకు డిమాండ్​ ఉంది. గత బీఆర్ఎస్ ​గవర్నమెంట్​మార్కెట్​ కమిటీ చైర్మన్ ​పోస్టులకు రొటేషన్ ​పద్ధతి రిజర్వేషన్ ​నిర్ణయించి పాలక మండళ్లను నియమించింది. స్టేట్​లో కాంగ్రెస్​గవర్నమెంట్​వచ్చాక పాలకవర్గాలను రద్దు చేస్తూ స్పెషల్​ జీవో జారీ చేసింది.

పాత రిజర్వేషన్​ను క్యాన్సల్​ చేస్తూ నిర్ణయాలు వెలువడుతాయని నేతలు భావిస్తున్నారు. సామాజికవర్గాల ప్రాతిపదికన మార్కెట్​కమిటీలు, ఆలయాల ధర్మకర్తల నియామకాలు జరపాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అన్నిచోట్లా ప్రతి పోస్టుకు కనీసం ఐదుగురు నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్​ఎమ్మెల్యేలు లేని సెగ్మెంట్లలో ఇన్​చార్జుల సిఫార్సులకు ప్రయార్టీ ఇవ్వనున్నారు.

ఆశావహుల్లో..

రూరల్​ అసెంబ్లీ టికెట్ ​ఆశించి భంగపడ్డ నగేశ్​రెడ్డి గతంలో మార్కెట్​ కమిటీ చైర్మన్​గా పనిచేశారు. మైనార్టీ నేత తాహెర్, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గడుగు గంగాధర్, బీసీ లీడర్ ​కేశవేణు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్​ పోస్టులను ఆశిస్తున్నారు. సాధ్యంకాని పక్షంలో జిల్లాలోని ముఖ్యమైన పదవుల్లోనైనా పాగా వేయాలని యోచిస్తున్నారు.

ముప్ప గంగారెడ్డి, శేఖర్​గౌడ్, మాజీ ఎంపీపీ యాదగిరి కూడా ఈ​పోస్టులపై కన్నేశారు. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న తమకు ప్రయార్టీ ఇవ్వాలనే ఇవ్వాలని వాదిస్తున్నారు. జిల్లాలోని నామినేటెడ్​ పోస్టులకు ఎమ్మెల్యేల రెకమండేషన్ ​అవసరం కావడంతో ఆ దిశగా ప్రయత్నాలు స్టార్ట్​ చేశారు.