బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి రూపొందిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్, టీజర్ ఆసక్తిని పెంచాయి. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ శనివారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘ది రేజ్ ఆఫ్ డాకు’ పేరుతో విడుదలైన ఈ పాటను తమన్ కంపోజ్ చేయగా... భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి ఎనర్జిటిక్‌గా పాడారు. ‘‘డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా” అంటూ బాలకృష్ణ క్యారెక్టరైజేషన్‌ను పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేస్తూ అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశారు.
బాలకృష్ణ గత మూడు చిత్రాలకు సంగీతాన్ని అందించి ఆ చిత్రాల విజయంలో కీలకపాత్ర పోషించిన తమన్.. మరోసారి తన మార్క్ చూపించారు. ఇక లిరికల్ వీడియోలో మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించారు బాలయ్య. భార్య పాత్రలో ప్రగ్యా జైస్వాల్ కనిపించింది. భారీ యాక్షన్ సీన్స్, బలమైన భావోద్వేగాలతో సినిమా ఉండబోతోందని ఈ వీడియోతో అర్థమవుతోంది. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.