IND vs AUS 3rd Test : మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. తొలి రోజు 13.2 ఓవర్లే

IND vs AUS 3rd Test : మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. తొలి రోజు 13.2 ఓవర్లే
  • 13.2 ఓవర్లే..తొలి రోజు ఆటకు వాన అంతరాయం ఆసీస్ 28/0

బ్రిస్బేన్‌ ‌: టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న  బోర్డర్‌‌–గావస్కర్ ట్రోఫీని వాన పలుకరించింది. గబ్బాలో శనివారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్‌‌ను ఇబ్బంది పెట్టింది. దాంతో మొదటి రోజు కొద్దిసేపు ఆట మాత్రమే సాధ్యమైంది. చివరి రెండు సెషన్లు రద్దయ్యాయి. వర్ష సూచన నేపథ్యంలో టాస్ నెగ్గిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు.   ఆడిన 13.2 ఓవర్లలో ఆస్ట్రేలియా వికెట్‌‌ నష్టపోకుండా 28/0తో ఆటను ముగించింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (47 బాల్స్‌‌లో 3 ఫోర్లతో19 బ్యాటింగ్‌‌), నేథన్ మెక్‌‌స్వీని (33 బాల్స్‌‌లో 4 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.

ఈ ఇద్దరూ అద్భుతమైన డిఫెన్స్తో ఇండియా పేస్‌‌ లీడర్  జస్‌‌ప్రీత్ బుమ్రా (6 ఓవర్లలో 0/8)ను ఎదుర్కొన్నారు. బుమ్రా బౌలింగ్‌‌లో జాగ్రత్తగా ఆడుతూనే సిరాజ్ (4 ఓవర్లలో 0/13) వేసిన షార్ట్‌‌ బాల్స్‌‌ను ఖవాజా బౌండ్రీకి తరలించాడు. ఓపెనర్లిద్దరూ ఎక్కువ బాల్స్‌‌ను వదిలేశారు. చల్లటి వాతావరణానికి తోడు పిచ్‌‌పై బౌన్స్ లభించినా ఇండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఆరు ఓవర్లు వేసిన బుమ్రా వికెట్‌‌ తీసే బంతులు ఎక్కువగా వేయలేకపోయాడు. సిరాజ్‌‌ షార్ట్ బాల్స్‌‌తో పరుగులు ఇచ్చుకున్నాడు. ఆరో ఓవర్లో ఆసీస్‌‌ 19/0తో నిలిచిన దశలో వర్షం రావడంతో ఆట కాసేపు ఆగింది.

అరగంట తర్వాత తిరిగి మొదలైన వెంటనే సిరాజ్ బౌలింగ్‌‌లో స్క్వేర్ లెగ్ మీదుగా ఖవాజా ఫోర్ కొట్టాడు. మొదటి బౌలింగ్‌‌ మార్పుగా సిరాజ్ స్థానంలో బౌలింగ్‌‌కు వచ్చిన ఆకాశ్‌‌ దీప్‌‌ (3.2 ఓవర్లలో 0/2) ఆఫ్ స్టంప్ చానెల్‌‌లో బాల్స్‌‌ వేస్తూ కంగారూ ఓపెనర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా వికెట్‌‌ మాత్రం రాలేదు. కొద్దిసేపటికే మళ్లీ వాన రావడంతో ఆట ఆగిపోయింది. చివరి రెండు సెషన్లలో ఆట సాధ్యం కాలేదు.  

స్థానిక టైమ్ ప్రకారం సాయంత్రం 4.13 గంటలకు మొదటి రోజు ఆటను ముగిస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. రెండో రోజు 98 ఓవర్లు ఆడించేలా అరగంట ముందుగానే (ఇండియా టైమ్ ప్రకారం ఉ. 5.20) ఆటను ప్రారంభించనున్నారు. కాగా, ఈ మ్యాచ్‌‌లో ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. అశ్విన్ ప్లేస్‌‌లో జడేజా, హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్‌‌ దీప్ తుది జట్టులోకి వచ్చారు. స్కాట్ బోలాండ్ స్థానంలో ఆస్ట్రేలియా జోష్ హేజిల్‌‌వుడ్‌‌ను తీసుకుంది. 

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌ : 13.2 ఓవర్లలో 28/0 (ఖవాజా 19 బ్యాటింగ్‌‌, మెక్‌‌స్వీని 4 బ్యాటింగ్‌‌, బుమ్రా 0/8)