IND vs AUS 3rd Test: ఆస్ట్రేలియా బ్యాటింగ్.. తొలి సెషన్‌కు వర్షం అంతరాయం

IND vs AUS 3rd Test: ఆస్ట్రేలియా బ్యాటింగ్.. తొలి సెషన్‌కు వర్షం అంతరాయం

గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో తొలి సెషన్ లో కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. నాథన్ మెక్‌స్వీనీ(4), ఉస్మాన్ ఖవాజా (19) క్రీజ్ లో ఉన్నారు.

ఆస్ట్రేలియా డిఫెన్స్ 

వర్షం పడే సూచనలు ఉండడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. పిచ్ మీద ఉన్న తేమను ఉపయోగించుకొని వికెట్లు తీయాలని భావించిన భారత జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్లు అవకాశం ఇవ్వలేదు. మెక్‌స్వీనీ, ఖవాజా పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యారు. దీంతో పరుగులు రాకపోగా.. వికెట్లు కూడా లభించలేదు. దీనికి తోడు పదే పదే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడం భారత బౌలర్లకు చిరాకు తెప్పించింది. వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు.  

రెండు మార్పులతో భారత్

ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. రెండో టెస్టులో విఫలమైన యువ బౌలర్ హర్షిత్ రాణా స్థానంలో ఆకాష్ దీప్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు. మరోవైపు ఆస్ట్రేలియా స్కాట్ బోలాండ్ స్థానంలో హేజల్ వుడ్ ను తుది జట్టులోకి తీసుకొచ్చింది.