హత్య, హత్యా యత్నం కేసుల్లో యువకుడికి జీవిత ఖైదు

హత్య, హత్యా యత్నం కేసుల్లో యువకుడికి జీవిత ఖైదు

ఎల్బీనగర్, వెలుగు : హత్య, హత్యాయత్నం కేసులో ఓ యువకుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సిక్​చౌహానికి చెందిన సర్దార్ చంకోతి అలియాస్ కరణ్ సింగ్(19) 2023 జనవరిలో నార్సింగి పీఎస్​పరిధిలోని ఓఆర్ఆర్​వద్ద కత్తులతో హిజ్రాలను బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, హిజ్రాలకు సంబంధించిన కిషోర్ కుమార్ రెడ్డి, శివరాజ్ అక్కడికి చేరుకున్నారు. గమనించిన కరణ్​సింగ్​అక్కడి నుంచి మంచిరేవుల చెరువు వైపు పారిపోయాడు. 

కిషోర్ కుమార్ రెడ్డి, శివరాజ్ వెంబడించగా, వారిద్దరిపై కరణ్ సింగ్ కత్తితో దాడిచేశాడు. గాయపడిన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కిషోర్ కుమార్ రెడ్డి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పరారీలో ఉన్న కరణ్​సింగ్​కోసం వెతుకుతుండగా ఫతే నగర్ లో పోలీసులకు తెలిసింది. శివకుమార్, రాజు నాయక్, విజయ్ కుమార్ తో కూడిన పోలీస్​టీమ్​అక్కడికి వెళ్లగా రాజునాయక్, విజయ్ కుమార్ పై కరణ్ సింగ్ కత్తితో దాడి చేశాడు. 

అతికష్టం మీద నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. హత్య కేసులో కరణ్​సింగ్​కు జీవితఖైదు విధిస్తూ ఈ నెల 11న రంగారెడ్డి జిల్లా 9వ అడిషనల్ సెషన్స్ జడ్జి హర్ష తీర్పు వెలువరించారు. గురువారం హత్యాయత్నం కేసులో మరోసారి జీవిత ఖైదు విధిస్తు తీర్పునిచ్చారు.