- అమాయకులపై కేసులు ఎత్తివేయాలి
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చెర్మన్ బక్కి వెంకటయ్య
- సీఎంకు రిపోర్ట్ అందజేస్తామని వెల్లడి
కొడంగల్/సంగారెడ్డి/ పరిగి, వెలుగు: లగచర్లలో అధికారులపై దాడి దురదృష్టకరమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపేర్కొన్నారు. సోమవారం కమిషన్ మెంబర్స్ రాంబాబు నాయక్, శంకర్, నీలాదేవితో కలిసి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండా, లగచర్లలో పర్యటించారు. ముందుగా రోటిబండతండాలో రైతులతో సమావేశం నిర్వహించారు. దాడి చేయని వారిపైనా కేసులు పెట్టి జైలుకు పంపారని, వారిపై కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ తాను సీఎంతో మాట్లాడి అమాయకులపై కేసులు ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడున్న పరిస్థితులపై ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక ఇవ్వాలని, కమిషన్ తరపున తాము కూడా రిపోర్ట్ ఇస్తామన్నారు. 2013 చట్టం ప్రకారం ప్రభుత్వం భూసేకరణ చేపట్టాలని, భూమినే నమ్ముకుని బతుకుతున్న గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని, రైతులను ఒప్పించిన తర్వాతే భూములను తీసుకోవాలన్నారు.
అమాయకులపై కేసులు పెట్టారు.
లగచర్లలో కలెక్టర్ పై దాడి సరైంది కాదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. ఈ ఘటనలో అమాయకులపై కేసులు పెట్టడంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనను సాకుగా చేసుకొని పోలీసులు గ్రామాలపై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారన్నారు. అమాకులపై కేసులు ఎత్తేసి జైలు నుంచి విడుదల చేయించాలని కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వారికి నోటీసులు ఇచ్చి నివేదిక కోరామని, నివేదికలు రాగానే కమిషన్ చట్టపరంగా ముందుకెళ్తుందని తెలిపారు. రిపోర్టు ఆధారంగా సీఎంను కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతామని చెప్పారు. చైర్మన్ వెంట దళిత సంఘాల నాయకులు కె జగన్, దుర్గాప్రసాద్ ఉన్నారు. గిరిజన లీడర్లు కమిషన్ సభ్యులను కలిసి వినతిపత్రం అందజేశారు.