రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీరంగం సృష్టించారు. భూ వివాదానికి సంబంధించి గ్రామస్థులపై దాడులకు దిగారు. వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లిపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 17పై నెలకొన్న వివాదంపై మాట్లాడుదామని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామస్థులను చర్చలకు పిలిచారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.
ALSO READ | ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రౌడీలతో తమను కొట్టించారని గ్రామస్థులు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌లో రికార్డులు తారుమారు చేసి వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిన రియల్ వ్యాపారులు.. ఇప్పుడు మాట్లాడుకుందామని పిలిచి తమపై దాడులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీలింగ్ ల్యాండ్‌ను పట్టాగా రికార్డ్‌లలో చూపించి మా భూములు గుంజుకున్నారని వాపోయిన గ్రామస్థులు.. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడుకుందామని పిలిచి మాపై కర్రలు, రాడ్లతో దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.