భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో అత్యంత ప్రధానమైన రెండు ఘట్టాల్లో కమ్యూనిస్టులు, ప్రపంచ కమ్యూనిజం ప్రయోజనాల రక్షణ పేరుతో దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారు. ఒకటి, 1942లో క్విట్ ఇండియా పోరాటంలో, రెండోది నిజాంకు వ్యతిరేకంగా జరిగిన హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో..! నిజాం వ్యతిరేక పోరాటమంటేనే కమ్యూనిస్టులు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా కొంతమంది చరిత్రను వక్రీకరించి ఊదరగొట్టారు. పటేల్ ముందు నిజాం తలొగ్గడం, రజాకార్లు తోక ముడవడమే సాయుధ పోరాటానికి లక్ష్యమైతే, రజాకార్ల దురాగతాలకు చరమగీతం పాడిన 1948 సెప్టెంబర్ 17 రోజున కమ్యూనిస్టుల పోరాటం ఎందుకు ముగియలేదు?
నా డు అన్ని పార్టీలతో కలిసి హిందూ భావజాలంతో ఏర్పడ్డ ఆంధ్రమహాసభలో చొరబడి కేవలం 11వ, 12వ ఆంధ్ర మహాసభ నాయకత్వాన్ని చేజిక్కించుకొని సాగించిన పోరునంతా తమ ఖాతాలో వేసుకోవడానికి కమ్యూనిస్టులు విఫలయత్నం చేశారు.. చేస్తూనే ఉన్నారు. నిజాం వ్యతిరేక పోరాటం ముసుగులో ‘ఆపరేషన్ పోలో’ ప్రారంభమవుతుందనగా నిరంకుశ నిజాంకు మోకరిల్లి రజాకార్లతో ఆయుధాలు పంచుకొని, తెలంగాణ ప్రజల్ని విముక్తుల్ని చేసి నిజాం మెడలు వంచడానికి వచ్చిన భారత భద్రతాదళాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగించారు.1948 మే 4న కమ్యూనిస్టు పార్టీ నిజాం రజాకార్లతో కుమ్మక్కై ‘స్వతంత్ర భారత ప్రభుత్వం భూస్వామ్య బూర్జువా ప్రభుత్వమని, ఆ ప్రభుత్వ దళాలను హైదరాబాద్ సంస్థానానికి రానివ్వొద్దు’ అని ప్రకటనలు గుప్పించారు కమ్యూనిస్టులు.
కాంగ్రెస్ పతాకంతోపాటు ఎర్ర జెండా
1940లో హైదరాబాద్ కమ్యూనిస్టులు కలిసి 'కామ్రేడ్స్ అసోసియేషన్'ను స్థాపించారు. మొదట కమ్యూనిస్టులు కాంగ్రెస్‌లోనే ఉండి తమ కార్యకలాపాలు సాగించారు. తొలుత కాంగ్రెస్ సత్యాగ్రహంలో పాల్గొని 'ఆంధ్రమహాసభ'లు నిర్వహించినవారిలో రావి నారాయణరెడ్డి ఒకరు. 1944వ సంవత్సరంలో భువనగిరిలో జరిగిన సమావేశంలో నారాయణరెడ్డి నేతృత్వంలో కమ్యూని
స్టులు ఆంధ్రమహాసభను తమ వశం చేసుకున్నారు.
రజాకార్ సైన్యాన్ని ప్రజాసైన్యంగా..
1948లో అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభ కలకత్తాలో జరిగింది. అప్పటికే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. నెహ్రూ ప్రధానమంత్రిగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నెహ్రూ ప్రభుత్వం భారతీయ పెట్టుబడిదారులదనీ, సంస్థానాలను అందులో చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే ఆధికారం యూనియన్ ప్రభుత్వానికి లేదనే ఒక నూతన సిద్ధాంతాన్ని కలకత్తా మహాసభలో కమ్యూనిస్టు పార్టీ వారు ప్రతిపాదించారు. అప్పటినుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది. రజాకార్ సైన్యాన్ని ప్రజాసైన్యంగా వర్ణించడం ప్రారంభించారు. దీని ఫలితంగా మగ్ధూం మొహియిద్దీన్, మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం రద్దుచేసింది. కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేశారు.
కమ్యూనిస్టులు రజాకార్లతో కుమ్మక్కై..
కొత్తగా స్వతంత్రమైన ప్రతిదేశంలోనూ అది స్థిరపడకముందే, సాయుధ తిరుగుబాటు ద్వారా ఆ దేశ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవడానికి కృషిచేయడం కమ్యూనిస్టుల వ్యూహం. అందుకోసం ఎవరితోనైనా చేతులు కలపడానికి వారు సిద్ధమే. ఇండోనేసియా స్వతంత్రమైన తొలిరోజుల్లో దారుల్ - ఇస్లాం అనే మతసంస్థతో కలిసి కమ్యూనిస్టులు తిరుగుబాటు చేశారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్లతో కలసి ఈ విధానాన్నే అనుసరించేందుకు ప్రయత్నించారు. 1948లో భారత స్వాతంత్య్ర సంగ్రామపు తుదిపోరాట ఘట్టం జరుగుతున్నప్పుడు కమ్యూనిస్టులు మధ్యయుగపు ఫ్యూడల్ నిజాం ఫాసిస్టు తత్వంతో పాటు, మతోన్మాదులైన రజాకార్లతో కుమ్మక్కై 'స్వతంత్ర హైదరాబాద్' నినాదాన్ని బలపరిచారు. దీని పర్యవసానంగానే కమ్యూనిస్టులు నిజాం ప్రభుత్వం నుంచి ఎంతో సహాయం పొందగలిగారు.
రజాకార్ల దమనకాండ
మరోవైపు రజాకార్లు నిజాం ప్రోత్సాహంతో 1926లోనే మజ్లిస్- ఎ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థను స్థాపించారు. ఖాసిం రజ్వీ నాయకత్వంలో నిజాం నిరంకుశ భూస్వామ్య వలస పాలనను కొనసాగించడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. 1946లో ఈ సంస్థ 'రజాకార్ దళం' పేరుతో సైనికదళాన్ని పోలిన సాయుధ దళాన్ని నెలకొల్పుకున్నది. ఈ రజాకార్లకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాలు, సైనిక దళాలకుండే అనేక సదుపాయాలను నిజాం ప్రభుత్వం కల్పించింది. ఈ దళం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విషప్రచారం సాగించేవారు.1948లో ఖాసిం రజ్వీ నేతృత్వంలో హైదరాబాద్ రాజ్యాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి మారణకాండ సృష్టించాడు. ఇదే లక్ష్యంతో 50 వేల మంది రజాకార్లను తయారు చేశాడు. రజాకార్లు, పోలీసులతో, కమ్యూనిస్టులకు ఘర్షణలు జరిగాయి. బలవంతంగా
మతమార్పిడులకు లొంగని వందలమంది సామూహికంగా బలయ్యారు.
'పోలీసు చర్య'
హైదరాబాద్ సంస్థాన ప్రజలు మరింత అరాచకానికి, అత్యాచారాలకు గురికాకుండా నివారించేందుకు సైన్యాలను హైదరాబాద్ కు పంపించాలని భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 9వ తేదీన నిర్ణయించింది. సెప్టెంబరు 13వ తేదీ సోమవారం నాడు భారత సైన్యాలు హైదరాబాద్ సంస్థానం మీద పోలీసు చర్య ప్రారంభించాయి. మేజర్ జనరల్ జె. ఎస్. చౌధురి దీనికి నాయకత్వం వహించారు. ప్రధానమైన సైనిక దళాలు షోలాపూర్-– హైదరాబాద్ రోడ్డుమార్గాన రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించగా, విజయవాడ- – హైదరాబాద్ రోడ్డు ద్వారా అనుబంధ దళాలు ప్రవేశించాయి. గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి మాత్రం దీనిని కేవలం 'పోలీసు చర్య'గా అభివర్ణించారు.
నిజాం లొంగుబాటు
'పోలీసు చర్య' ప్రారంభం కాగానే హైదరాబాద్‌లోని భారత ఏజెంటు జనరల్ కేఎం మున్షీని గృహ
నిర్బంధానికి గురిచేశారు. హైదరాబాద్ సైన్యాలు మొదటి రెండురోజులు భారత సైన్యాలను స్వల్పంగా ఎదిరించాయి. ఆ తర్వాత హైదరాబాద్ సైన్యం పారిపోవడం ప్రారంభమైంది. సెప్టెంబరు 17వ తేదీన తాను యుద్ధవిరమణ చేస్తున్నట్లూ, రజాకార్ దళాన్ని రద్దుచేస్తున్నట్లూ నిజాం భారత ప్రభుత్వానికి కేఎం మున్షీ ద్వారా కబురు పంపారు. ఆ తర్వాత, మధ్యాహ్నం హైదరాబాద్ సైన్యాధిపతి (కమాండర్- ఇన్- ఛీఫ్) ప్రిన్స్ అజంజా లాంఛనంగా అసఫ్ జాహీ పతాకాన్ని దింపివేసి లొంగిపోయినట్లు ప్రకటించారు.
- డాక్టర్ ఎస్. ప్రకాష్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి