ఉద్యమాలు, పోరాటంతోనే తెలంగాణ సాకారం

తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటం ప్రత్యేకమైనది. జేఏసీ పిలుపుతో కార్మికులు రోజుల తరబడి పనులు మానేసి సమ్మె చేశారు. లాఠీ దెబ్బలు, పోలీస్​ నిర్బంధాలకు బెదరకుండా ప్రతి సందర్భంలో ముందుండి కొట్లాడిన్రు. ఒక్క బొగ్గు పెల్ల కూడా కదలక.. కరెంట్​ఉత్పత్తిపై ప్రభావం పడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. కోల్​బెల్ట్​పరిధిలో కార్మిక సంఘాలతోపాటు పలువురు నేతలు పార్లమెంట్​లోనూ కొట్లాడిన్రు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వరాష్ట్ర కోసం కోల్​బెల్ట్ పరిధిలో  జరిగిన ఉద్యమాన్ని యాదిజేసుకోవాల్సిన అవసరం ఉంది.​ స్వరాష్ట్ర సాధన కోసం రగిలిన ఉద్యమ సెగ తెలంగాణ  నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి నోయిడా వరకు తాకింది. 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానాల తర్వాత సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల సమ్మె ప్రభావం నోయిడా దాకా పడింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సింగరేణి నేతలను, జేఏసీ నేతలను, ఉద్యమ నాయకుడు ప్రస్తుత సీఎం కేసీఆర్​ను పిలిచి మాట్లాడారు. సమ్మెను విరమించాలని కోరారు. కేసీఆర్ దీక్ష, ఆయన అరెస్ట్ సందర్భంగా మొట్టమొదటి సారి సింగరేణి కార్మికులే సమ్మె చేశారు. శ్రీకాంతాచారి ఆత్మహత్య సందర్భంగా, హైదరాబాద్​ను యూటీ చేసే కుట్రను వ్యతిరేకిస్తూ, శ్రీకృష్ణ కమిటీ సందర్శన సందర్భంగా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సకల జనుల సమ్మె కన్నా ముందే ఏడుసార్లు తెలంగాణ కోసం సమ్మె పోరాటం చేసిన చరిత్ర సింగరేణి కార్మికులదే. 

ఉద్యమంలో ప్రముఖులు

బొగ్గు గని కార్మికుల సమ్మె వల్ల దక్షిణ భారతం మొత్తం కరెంట్​ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీంతో కేంద్రం మీద ఒత్తిడి పెరిగింది. పార్లమెంట్​లో బిల్లు పెట్టేంత వరకు సింగరేణి కార్మికుల ఉద్యమం ఆగలేదు. జర్నలిస్టుల కోల్ బెల్ట్ యాత్రలో టీఆర్ఎస్, జేఏసీ సహా అన్ని పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్​లో పోరాడారు. పార్లమెంట్​లో అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు తెలిపాయి. ఉస్మానియా విద్యార్థుల కంట్రిబ్యూషన్, మహిళల పాత్ర అద్భుతమైనది. ఎంతోమంది సింగరేణి కార్మికులు, సింగరేణి ప్రాంతం ఉద్యమకారులు, యూనియన్​ నేతలు జైలు పాలయ్యారు. మాజీ ఎంపీలు గడ్డం వివేకానంద, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, బి.వినోద్ కుమార్, విజయశాంతి తదితరుల పాత్ర కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ప్రశంసనీయం. కాకా గడ్డం వెంకట స్వామి ప్రొఫెసర్ జయశంకర్, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్​తో సమావేశమై స్వరాష్ట్ర సాధనపై చర్చించేవారు. తెలంగాణ కోసం ఓసారి సీడబ్ల్యూసీ సమావేశాన్ని సైతం కాకా బహిష్కరించి బయటకు వచ్చారు. 

లాఠీ దెబ్బలు, నిర్బంధాలు..

ఎంతో మంది ఉద్యమకారుల మీద కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, గడ్డం అరవింద రెడ్డి, లాంటివారు కోల్ బెల్ట్​లో కీలకంగా వ్యవహరించారు. లాఠీ దెబ్బలు, పోలీస్ నిర్బంధాలు ఎన్ని ఎదురైనా.. రాస్తారోకోలు, నిరసనలు ఆగలేదు. వంటా వార్పులు 385 వరకు జరిగాయి. జీఎం ఆఫీస్, మున్సిపల్, కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్​ఆఫీసుల ముందు ధర్నాలకైతే లెక్కే లేదు. ఇంటికి తాళాలు వేసి ఇంటిముందు దీక్షలు, పొయ్యి వెలిగించకుండా ఆందోళన ఒక సంచలనంగా పేర్కొనవచ్చు. బొగ్గు బావుల మీద ప్రతిరోజూ మీటింగులు నిరసనలు షరా మామూలయ్యాయి. గనుల బాట, ఏరియాల బాట కొనసాగేది.  ఒక్క సీఐటీయూ మినహా అన్ని యూనియన్లు ఉద్యమంలో పాలు పంచుకున్నాయి. టీబీజీ కేఎస్ టీఆర్ఎస్ అనుబంధ యూనియన్ కాబట్టి ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. కేసీఆర్ అరెస్ట్ సందర్భంగా కార్మికులు స్వచ్ఛందంగా నిరసన తెలుపుతూ విధులు బహిష్కరించారు. మొత్తంగా ఉద్యమంలో దాదాపు అన్ని యూనియన్ల నేతలు, కోల్ బెల్ట్ ప్రాంతంలో ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయిన దాఖలాలు ఉన్నాయి.

అధికారమే లక్ష్యంగా..

సీఎం కేసీఆర్​ నాయకత్వంలోని స్వరాష్ట్ర పాలనలో సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల పునరుద్ధరణ, తెలంగాణ ఇంక్రిమెంట్, సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకుని ఉంటున్న వారికి భూమి పట్టాలు లాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2014, 2018 లో రెండుసార్లు ప్రజలు టీఆర్​ఎస్​కే పట్టం కట్టారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం ఆరాట పడుతున్నాయి.2024 లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ దేశంలో విపక్ష పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. దేశంలో10 నుంచి11 కోట్ల ఓట్లు ఉన్న కాంగ్రెస్​తో కలిసి కూటమి కట్టడమా లేక విడిగా ముందుకు సాగడమా అనేది తేలాల్సి ఉంది. 

స్వరాష్ట్రం.. త్యాగాల ఫలితం

తెలంగాణ ఊరికే రాలేదు. రాష్ట్ర ఏర్పాటు వెనుక ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు ఉన్నాయి. పార్లమెంట్​లో సుష్మా స్వరాజ్ లాంటి ఉక్కు మహిళల అకుంఠిత పోరాటం, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం ఉంది. మొత్తానికి కేసీఆర్​ ఉద్యమ అవసరాన్ని, స్వరాష్ట్ర ప్రయోజనాలను ప్రజలకు వివరించి చైతన్యం చేయడంలో సక్సెస్​ అయ్యారు. దీన్ని ఎవరూ కాదనలేరు. ఎనిమిది సంవత్సరాల సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కన్నా మెరుగ్గానే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ రావడం, రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు నూతన ఒరవడి సృష్టించగలిగాయి. 
- ఎండీ మునీర్,
సీనియర్ జర్నలిస్ట్,