మేడిగడ్డ కుంగిపోవడంపై కేంద్ర డ్యాం సేఫ్టీ వింగ్ రిపోర్ట్
ప్లానింగ్ ఒక మాదిరిగా.. నిర్మాణం మరో మోడల్
డిజైనింగ్, ప్లానింగ్, నిర్మాణంలో అనేక లోపాలు
బరాజ్ సరిచేసే వరకు నీరు నింపితే ప్రమాదకరం
అన్నారం, సుందిళ్లకూ ఇదే తరహా సమస్యలొస్తాయ్
పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే పునాదులు కుంగాయి
20 అంశాలపై నివేదిక కోరితే 11 మాత్రమే ఇచ్చారు
హైదరాబాద్: మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి నీటిపారుదల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని కేంద్ర డ్యాం సేఫ్టీ వింగ్ వెల్లడించింది. బరాజ్ నిర్మాణానికి ముందు అవసరమైన పరీక్షలు చేయలేదని పేర్కొంది. సెంట్రల్ డ్యాం సేఫ్టీ వింగ్ చీఫ్ సంజయ్ తెలంగాణ నీటిపారుదశాఖ చీఫ్ రజత్ కుమార్ కు నివేదిక పంపారు. అక్టోబర్ 20 వ తేదీన సెంట్రల్ డ్యాం సేఫ్టీ వింగ్ మేడిగడ్డ బరాజ్ ను పరిశీలించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 25 రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణానికి సంబంధించి 20 అంశాలతో కూడిన నివేదిక అడిగామని, వారు కేవలం 11 మాత్రమే ఇచ్చారన్నారు. ఈ నెల 29 లోపు పూర్తి స్థాయిలో స్ట్రక్చరల్ డేటాను ఇవ్వాలని సూచించారు.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే కుంగిపోయిందని పేర్కొన్నారు. ఇందుకు ప్లానింగ్, డిజైనింగ్, నాసిరకం నిర్మాణ సామగ్రి వాడటం కారణమని తెలిపారు. మొదట నీటిలో తేలియాడే డ్యాంగా డిజైన్ చేశారని, నిర్మాణం మాత్రం స్థిరంగా ఉండేదానిలా చేశారన్నారు. దీంతోనే సమస్య తలెత్తిందని చెప్పారు. అన్నారం, సుందిళ్ల నిర్మాణాలూ ఇదే విధంగా జరిగాయని చెప్పారు. ఆ రెండు ప్రాజెక్టులూ ప్రమాదం బారిన పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
బరాజ్ సరిచేసే వరకు నీరు నింపొద్దు
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డకు మరమ్మతులు చేసిన తర్వాతనే నీటిని నింపాలని, అలా కాకుండా నీటిని నింపితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని డ్యాంసేఫ్టీ వింగ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మేడిగడ్డ నిర్మాణం డ్యాం సేఫ్టీ యాక్ట్ 2001కి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు
ALSO READ :- ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్ట్ సీరియస్.. ప్రజలను గ్యాస్ ఛాంబర్లో ఉంచాలనుకుంటున్నారా..