హైదరాబాద్ లో ట్రాఫిక్​ సమస్యకు బాధ్యులెవరు?

హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద వాహనాల రద్దీ పెరుగుతున్నది. బండ్లు నడుపుతున్నోళ్లకేమో యాష్ట వస్తుండగా, కాలినడకన వెళ్లవారికి భయం వేస్తున్నది. కనీసం నడవడానికి స్థలం లేని పరిస్థితి చాలా రోడ్ల మీద ఉన్నది. బండ్ల నుంచి వచ్చే పొగ, హారన్ల మోత, వాటి వేగం, డ్రైవర్ల ఆత్రుత, రోడ్ల మీద గుంతలు.. ఇలా నిత్యం ఇబ్బందులే. ఇవన్నీ సాధారణ సమయంలో ఎదుర్కొనే సమస్యలైతే.. ఇక వర్షం పడితే వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతం. ఆదాయం మీదనే ధ్యాస పెడుతున్న ప్రభుత్వ పెద్దలకు నగర ప్రణాళికల మీద కనీస ఆలోచన లేకపోవడంతో రోజు రోజుకూ వాహనాల రద్దీ జటిల సమస్యగా మారుతున్నది.

చట్టం అందరికీ సమానం అని రాజ్యాంగం చెబుతున్నా, నగర రోడ్లు ఒక ఉమ్మడి ఆస్తిగా భావిస్తున్నప్పుడు కేవలం కొందరికే ‘రోడ్లను’ అప్పజెబుతున్న పాలనా వ్యవస్థను మనం ప్రశ్నించడం లేదు. ట్రాఫిక్ పరిస్థితి చూసి ప్రమాదాల బారిన పడకూడదనుకుని కొందరు ఎస్ యూవీలను కొంటున్నారు. ఇవి పెద్దగ ఉండటంతో రోడ్డు మీద జాగ ఎక్కువ తీసుకుంటాయి. అందులో సాధారణంగా ఒక్కరు లేదా ఇద్దరు ప్రయాణిస్తారు. అలా రోడ్డు కొందరికే పరిమితం అవుతున్నది. ఎస్​యూవీల సంఖ్య ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఒక కిలోమీటర్ మేర ఆ వాహనాలు నిలిపితే అందులో పట్టుమని 30 మంది కూడా ప్రయాణం చేయరు. ఇలాంటి రోడ్డు కబ్జా మీద అధ్యయనాలు జరగాలి. ఇంటికి 4 లేక 5 కార్లు ఉన్నవారు తక్కువ. అసలు వాహనాలు లేని కుటుంబాల సంఖ్య ఎక్కువ. వీరి పట్ల ప్రభుత్వానికి ఆలోచన లేదు. ప్రతి నగరంలో 50 శాతం గాలి కాలుష్యం కేవలం10 శాతం మోటారు వాహనాల వల్లేనని ఒక అంచనా. వాహనాల్లో ప్రయాణికులను బట్టి కూడా కాలుష్యాన్ని అంచనా వేస్తారు. ఉదాహరణకు ఒక డీజిల్ బస్సు పొగ సాధారణ కారు కంటే ఎక్కువ. అయితే, బస్సులో 50 మంది ప్రయాణించే వీలు ఉంది. కారులో కేవలం నలుగురు మాత్రమే వెళ్తారు. అలా ప్రతి వాహన కాలుష్యాన్ని ప్రయాణికుల సామర్థ్యం బట్టి గుణిస్తే ప్రతి కారు ప్రయాణికుడు చేసే కాలుష్యం చాలా ఎక్కువ. పాదచారులు, సైకిళ్లు, రిక్షాల నుంచి వచ్చే కాలుష్యం సున్నా. నగరంలో కాలుష్యం తగ్గించాలన్నా, రోడ్డు నిడివి బట్టి ప్రయాణ సౌకర్యం ఉండాలన్నా ప్రయాణించే పద్ధతి బట్టి కాలుష్యం చేయని వాహనం పట్ల ప్రభుత్వ విధానం సానుకూలంగా ఉండాలి. దురదృష్టవశాత్తు మన నగరాల్లో పూర్తిగా ఉల్టా ఉంటుంది. పరిమిత ప్రయాణికులను చేరవేసే కార్లకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజా రవాణా వ్యవస్థకు ఉండదు. పాదచారులు, సైకిళ్లు, రిక్షాలు, బస్సులకు, రైళ్లకు తగిన భూమి కానీ, వసతులు కానీ, ప్రాధాన్యత కానీ రోడ్ల మీద, రోడ్లను నిర్వహించే విధానంలో ఎక్కడా ఉండ. ఫలితంగా, అందరూ వ్యక్తిగత వాహనాల వైపు మొగ్గు చూపుతూ, సమస్యను ఇంకా జటిలం చేస్తున్నారు. 

రోడ్ల వెడల్పు ఎంతని చేస్తారు?

వాహనాల సంఖ్య పెరిగినా కొద్దీ రోడ్లను వెడల్పు చేయడం సాధ్యం కాదు. కొందరే కార్లు కొంటున్నా, అందరి కోసం ఉన్న రోడ్డు కొందరికే ఉపయోగపడితే అనేక విపరిణామాలు సంభవిస్తాయి. పొడవు, వెడల్పు ఉన్న కార్ల సంఖ్యను ప్రోత్సహిస్తే అది ‘అభివృద్ధి’ కాదు. అందుకే, వాహనాల సంఖ్యతో పాటు వాహన కాలుష్యం మీద నియంత్రణ ఉండాలంటే నగరానికి ఒక శాస్త్రీయ, రవాణా విధానం కావాలి. ప్రస్తుతం అది లేదు. ఇక్కడనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వాహనాలతో పాటు, ఇంకెక్కడివో వాహనాలు, నిత్యం నగరానికి వచ్చి పోయే వాహనాలు వెరసి కనీసం70 నుంచి 80 లక్షల వాహనాలు నగరంలో ఉండవచ్చు. ఇన్ని వాహనాలకు తగిన రోడ్ల వ్యవస్థ ఉన్నదా? లేదు. వాహనాలు నడిపేవారిని బట్టి కూడా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనల మీద సరైన అవగాహన లేకపోవడమూ ఒక కారణమే. రోడ్ల మీద రద్దీ లేకుండా వాహనాలు సులువుగా వెళ్లాలంటే డ్రైవర్ల పాత్ర కూడా ఉంటుంది. సరైన శిక్షణ లేని వారు, అహంకారంగా నడిపే వారు, చట్టాన్ని నిత్యం ఉల్లంఘించేవారు, తదితరుల వల్ల కూడా వాహనాల మధ్య పోటీ ఏర్పడి రోడ్ల మీద పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్నది. డ్రైవర్లకు క్రమశిక్షణ చాలా అవసరం. అది వాహనం నడపడానికి నేర్చుకునే దశలోనే వస్తుంది. అక్కడ క్రమశిక్షణ అలవడాలంటే శిక్షణ ఇచ్చే సంస్థల పని తీరు బట్టి, వారు సేఫ్టీ గురించి తమ దగ్గర శిక్షితులకు చెప్పే తీరు బట్టి వస్తుంది. వాహన చోదక లైసెన్స్ సరళీ
కృతం చేసినా శిక్షణ దశలో కఠిన పద్ధతులు లేకపోవడంతో డ్రైవర్లు, ఇతరులు ఇబ్బంది పడుతున్నారు.

నాలుగు ప్రధాన మార్గాల్లో..

హైదరాబాద్ నగరానికి విజయవాడ, నాగపూర్, బెంగుళూర్ ముంబయి వైపు నాలుగు మార్గాలతోపాటు, వరంగల్, కరీంనగర్, నాగార్జునసాగర్, వికారాబాద్ వైపు ప్రధాన దారులు ఉన్నాయి. ఈ మార్గాల వెంబడి సిటీ వేగంగా విస్తరిస్తున్నది. కూకట్ పల్లి నుంచి చార్మినార్ వరకు, ఎల్​బీ నగర్ వైపు రోజు దాదాపు 39 లక్షల మంది ప్రయాణిస్తారని15 ఏండ్ల కిందటి ఒక ట్రాఫిక్ నివేదికలో ఉంది. రెండు ప్రధాన మార్గాల్లో మెట్రో రైలు నిర్మాణం వల్ల రోడ్డు నిడివి తగ్గింది. మెట్రో రైలులో కేవలం 5 లక్షల మంది మాత్రమే ప్రయాణించే వీలు ఉన్నది. ఈ మార్గాల్లో ఇంక రోడ్డు విస్తరణ సాధ్యం కాదు. ఈ లోపు ఇదే మార్గాల్లో నిత్య ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇంకా కొత్త కాలనీలు, నిర్మాణాలు వస్తున్నాయి. కాలనీలు విస్తరించిన కొద్దీ కొత్త వాహనాలు ఈ మార్గాలు ఎక్కక తప్పదు. వీటిని వెడల్పు చేసిన పరిస్థితిలో మార్పు లేనంతగా వాహనాల సంఖ్య పెరిగింది. సమస్య ఏమిటంటే వీటికి సమాంతర లేదా ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఉన్నవి ఇరుకుగా ఉన్నాయి. విస్తరించే అవకాశాలు కూడా అయిపోయాయి. ప్రభుత్వం ఇప్పుడు పొడవాటి ఫ్లైఓవర్లు పరిష్కారంగా భావిస్తున్నది. కానీ.. ఫ్లై ఓవర్ల వల్ల దీర్ఘకాలిక ఉపశమనం లభించే అవకాశాలు ఉండవని ప్రపంచ అనుభవం చెబుతున్నది. వాటి చుట్టూ నివసించే వారి ప్రయాణం ఇంకా దుర్భరం అవుతున్నది. అధ్యయనం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హ్రస్వ దృష్టితో చేపడుతున్న ‘అభివృద్ధి’ పథం ఫలితాలను ఇవ్వకపోగా సమస్యలను జటిలం చేస్తున్నది.

రూల్స్​ సడలించి నిర్మాణాలు

తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ మధ్య సమన్వయం లేదు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తయారు చేసిన బృహత్తర ప్రణాళిక 2012–-2031 లోపభూయిష్టంగా ఉందని, కొత్తది తయారు చేస్తున్నామని చెప్పి 5 ఏండ్లు అవుతున్నది. ఇంకా ఆ ప్రణాళిక రాలేదు. ఈ లోపు ఎస్​ఆర్​డీపీ అని, లింక్ రోడ్లు అభివృద్ధి అని మొదలు పెట్టారు. కానీ ఎస్ఆర్​డీపీ ద్వారా ఫ్లై ఓవర్ల నిర్మాణం మాత్రమే చేస్తున్నారు. దాదాపు 250 లింక్ రోడ్లు చేపట్టామని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ఇప్పుడు లింక్ రోడ్లు అంటేనే ప్రణాళిక వైఫల్యం. అప్పట్లో ఆలోచించలేదు. పోనీ, కొత్త ప్రాంతాలైన కొంపల్లి, ఇంకా ఇతర అనేక శివారు గ్రామాల చుట్టూ జరిగే నిర్మాణాల పట్ల జాగరూకత ఉందా అంటే అదీ లేదు. రాబోయే నిర్మాణాలు కూడా అస్తవ్యస్తంగా నిలువుగా రావడం ఆయా ప్రాంతవాసులకు శాపంగా పరిణమించింది.

నగరీకరణలో అనేక గ్రామాలు విలీనం అయ్యాయి. గ్రామాల చుట్టూ బహుళ అంతస్తుల నిర్మాణాలు వచ్చాయి. అయితే, అక్కడ రోడ్ల నిడివి ముందే పెంచడం లేదు. ఉన్న బాటలోనే, బహుళ అంతస్తుల సముదాయాలు రావడం, వాటితో పాటు వ్యక్తిగత బండ్లు రావడం, ప్రజా రవాణా విస్తరించకపోవడంతో కొత్త కాలనీల్లో ట్రాఫిక్ సమస్య సంక్లిష్టంగా మారింది. మణికొండలో ట్రాఫిక్ దుర్భర పరిస్థితికి చేరడానికి ఈ నిర్లక్ష్యమే కారణం. 7 మీటర్లు అంత కంటే తక్కువ వెడల్పు ఉన్న రోడ్ల పక్కన వందల అపార్ట్ మెంట్లు నిర్మిస్తే వేల సంఖ్యలో వాహనాలు వస్తాయి. గ్రామకంఠం పరిధిలో ఉండే బాటలు బహుళ నిర్మాణాల నేపథ్యంలో రోడ్లు అవుతున్నాయి తప్పితే, గ్రామ స్థాయి ప్రణాళిక కూడా ఉండటం లేదు.

ఆదాయం మీదే ధ్యాస ?

దారుణ ఆలోచన ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ సంస్కరణల పేరిట ఉన్న నివాసాలను ఇంకా దట్టంగా చేయాలని సంకల్పిస్తున్నాయి. మెట్రో రైలు ఉన్న మార్గాల్లో భవన నిర్మాణాల రూల్స్​ సడలించడం ఇంకా ఎక్కువ నిర్మాణాలు రావడానికి ఆస్కారం కల్పిస్తున్నది. టీఓడీ(ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్​మెంట్) పేరుతో మెట్రో రైలు మార్గంలో ఒక అపార్ట్ మెంట్ స్థానంలో ఇంకా అనేక అపార్ట్​మెంట్లు రావాలనే లక్ష్యంతో రూల్స్ సవరిస్తున్నారు. అయితే దీని వల్ల10 అపార్ట్​మెంట్లు ఉండే చోట100 అపార్ట్​మెంట్లు వస్తే తాగు నీరు, మురుగు కాలువలు, విద్యుత్, రోడ్లు తదితర అనేక వసతులు కూడా ఆ మేరకు పునర్నిర్మాణం చేయాల్సి ఉంటుంది. దానికి ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టాలి. పెరిగే వాహనాలు తిరగడానికి, నిలిపేందుకు రోడ్డు, పార్కింగ్ వసతులు కావాలి. నిధుల లేమి, స్థలాభావం వల్ల ఇవేవీ సాధ్యం కావు. ఇప్పటికే దట్టంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకా దట్టంగా ఇండ్లు రావాలనే ఆలోచన చాలా దుర్మార్గం. ఇతర విషయాలు ఎట్లా ఉన్నా, ట్రాఫిక్ సమస్య ఇంకా ముదురుతున్నది. స్థూలంగా, పాలనలో లోకజ్ఞానం లోపించింది. ఆదాయం మీదనే ధ్యాస ఉన్న ప్రభుత్వ పెద్దలకు కనీస ఆలోచన లేకపోవడంతో వాహనాల రద్దీ ఒక జటిల సమస్యగా మారుతున్నది. హైదరాబాద్​తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి. 

- దొంతి నర్సింహా రెడ్డి
పాలసీ ఎనలిస్ట్