గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. చెరువులు కబ్జా చేసి నిర్మించిన భారీ బిల్డింగులు , కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు, సిబ్బంది. ఇందులో ఎంతటి వారైనా వదిలేది లేదంటున్నారు అధికారులు. హైడ్రా చర్యల్లో భాగంగా... మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అక్రమ నిర్మాణాలను ఉదయం నుంచి తొలగిస్తున్నారు సిబ్బంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి.
మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసి వేశారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లడానికి అనుమతి లేదంటూ భారీకేడ్లను ఏర్పాటు చేశారు. కూల్చివేతల ప్రాంతం దగ్గరకు ఎవరిని అనుమతించడం లేదు. హైదరాబాద్ లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు కారణాలు
- మాదాపూర్ లో 10 ఎకరాల్లో N కన్వెక్షన్ నిర్మాణం
- మొత్తం 29 ఎకరాల్లో తమ్మిడి కుంట చెరువు..
- తుమ్మడి చెరువును కబ్జా చేసి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం
- ఆక్రమించి కట్టారంటూ పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదులు
- ఎఫ్ టీఎల్( Full Tank Level), బఫర్ జోన్ లో ఉండటంతో కన్వెన్షన్ కూల్చివేత
- ఎన్ కన్వెన్షన్ చెరువుకు 25 మీటర్ల ఎఫ్ టీఎల్ లెవల్లో ఉన్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు
- కన్వెన్షన్ సెంటర్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ తో పాటు, బఫర్ జోన్ మరో 30 మీటర్లు కూడా ఉండాలి
- రూల్స్‌కి విరుద్ధంగా నిర్మించారంటూ హైడ్రా కూల్చివేత