విశ్లేషణ: హుజురాబాద్‌లో చేసిన తప్పుల వల్లే ఓడిన్రు

హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికలో గెలవడం కోసం సీఎం కేసీఆర్‌‌‌‌ తన సర్వశక్తులూ ఒడ్డారు. గెలవడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో అన్నీ వేశారు. అయినా హుజూరాబాద్‌‌ ప్రజలు ఆయన ఎత్తుగడలను సాగనివ్వలేదు. ప్రజలు ఈటల రాజేందర్​ను గెలిపించి కేసీఆర్​కు సరైన బుద్దే చెప్పారు. అసలు టీఆర్ఎస్ ఓటమికి, ఈటల గెలుపునకు దారితీసిన కారణాలను ఒకసారి చూద్దాం.

వాస్తవం చెప్పాలంటే కేసీఆర్‌‌‌‌ ఈ ఎన్నికలో తన పదవిని అడ్డుపెట్టుకుని ఎన్నో మార్గాల ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. కొందరు మంత్రులు ముఖ్యంగా హరీశ్​​రావు, గంగుల కమలాకర్‌‌‌‌ లాంటి వాళ్లు కొన్ని నెలలుగా హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలోనే ఉన్నారు. ఈటల రాజేందర్‌‌‌‌ను ఎలాగైనా ఓడించడానికి ఎన్ని చేయాలో కేసీఆర్‌‌‌‌ అన్నీ చేశారు. దళితుల ఓట్లను గంపగుత్తగా పొందాలని దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి హుజూరాబాద్​కు వేల కోట్ల రూపాయలు తరలించారు. బహుశా ఇంత ఖరీదైన ఎన్నిక తెలంగాణలో ఇంతకుముందెన్నడూ జరగలేదు. తమకు డబ్బులు పంచలేదని ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయడం మరెక్కడా చూడలేదు. ఎందుకిలా జరిగిందంటే! ఒక్క ఓటుకు టీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లు 6 వేల వరకు ఇచ్చారని ప్రజలు చెప్పుకున్నారు. మనీ, మద్యం ఏరులై పారింది. అయిదారు నెలలుగా జిల్లా యంత్రాంగం మొత్తం హుజూరాబాద్‌‌ మరలేటట్లు చేశారు. ఎక్కడా ఇవ్వని కాంట్రాక్టర్ల బిల్లులను ఇక్కడే రిలీజ్‌‌ చేశారు. దాదాపు 400 కోట్లు విడుదల చేసినట్టు తెలిసింది. కొత్త పెన్షన్లను ఇచ్చారు. బీసీ ఓట్లను ఆకర్షించడానికి బీసీ కమిషన్‌‌ వేసి బీసీ కమిషనర్‌‌‌‌తో మాట్లాడించారు. ఆర్‌‌‌‌.కృష్ణయ్య లాంటి బీసీ నాయకులతో తమకు మద్దతు ప్రకటించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీకి సీటిచ్చారు. అనేకమంది ఈటల మద్దతుదారులను కొనుగోలు చేశారు. కేసీఆర్‌‌‌‌ వాసాలమర్రికి వెళ్లి దళిత బంధు అమలును ప్రకటించారు. దళిత బంధు చెక్కులు పాస్‌‌ కావడానికి డబ్బు రిలీజ్‌‌ చేశారు. కేంద్రం పెట్రో ధరలు పెంచిన విషయాన్ని, ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్‌‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని, ఈటలకు కేసీఆర్‌‌‌‌ అన్యాయం చేయలేదని, ఎన్నో పదవులు ఇచ్చారని హరీశ్​ నెత్తీనోరు బాదుకొని చెప్పారు. ఇదీగాక టీఆర్‌‌‌‌ఎస్‌‌ అభ్యర్థిగా ఒక బీసీని నిలబెట్టారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎందుకు ఓడిపోయిందనే దానిపై ఇప్పుడు చర్చంతా నడుస్తోంది. దీనికి నవరత్నాల్లా తొమ్మిది కారణాలున్నాయి.

ప్రజలు టీఆర్ఎస్​ను ఓడించడానికి కారణాలు..

  • ఈటలకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించారు. బీజేపీ కార్యకర్తల బలం పని విధానం, నాయకుల శ్రద్ధ మరో కారణం. మంచివారిని, అమాయకులను బాధపెడితే జరిగేది ఇదే. ఒకరిని అణచాలని చూడొద్దు. ఈటల మీద భూ కబ్జా ఆరోపణలు చేశారు. రెవెన్యూ యంత్రాంగం అంతా కదిలింది. 24 గంటల్లో రిపోర్టు ఇచ్చారు. ఎలా సాధ్యమయ్యింది? సాక్షాత్తూ సీఎం ఈటలను నలిపేయాలని చూశాడు. 
  • కేసీఆర్​ కేబినెట్​లో భూకబ్జాదారులు, భూదురాక్రమణదారులు, అవినీతిపరులు లేరా? అందరి మీదా చర్యలు తీసుకుంటే అదోరకంగా ఉండేది. కానీ ఒక్క ఈటలనే టార్గెట్‌‌ చేయడాన్ని ప్రజలు పక్షపాతమనుకున్నారు. కేసీఆర్‌‌‌‌ పక్షపాత ధోరణి అందరూ చూశారు. 
  • కేసీఆర్‌‌‌‌, టీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రాబల్యం క్రమంగా తగ్గుతున్నది. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావు గెలిచారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన సీట్లు సంపాదించింది. ముఖ్యమైన లోక్‌‌సభా స్థానాలను ఆ పార్టీ గెలుచుకొన్నది. ఇక్కడే కేసీఆర్‌‌,‌‌ టీఆర్‌‌‌‌ఎస్‌‌ పతనం ప్రారంభమైంది. గాజు బంగ్లాలో ఉండేవారు ఇతరులపై రాళ్లు రువ్వొద్దు.
  • నిరుద్యోగ సమస్య. ఇటీవల ఒక ఓయూ విద్యార్థి ఉద్యోగ నోటిఫికేషన్స్‌‌ రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. క్రమంగా నిరుద్యోగులు ఆశలు వదులుకున్నారు. లక్ష ఉద్యోగాలన్నారు. ఇంటికొక ఉద్యోగమన్నారు. దళితులకు మూడెకరాల భూమి అన్నారు. డబుల్‌‌ బెడ్‌‌రూమ్‌‌ ఇండ్లు అన్నారు. ఆచరణలో సాధ్యం కాలేదు. ఈ రోజు లక్ష ఉద్యోగాలు అనలేదంటున్నారు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని అనలేదని కేసీఆర్‌‌‌‌ అంటున్నారు.
  • ఈటలకు ప్రజల్లో మంచి పేరుంది. ఇంటికి వెళ్లిన వారికి కనీసం భోజనం పెడతాడని నియోజకవర్గ ప్రజలకు విశ్వాసం కలిగింది. ఈటల సౌమ్యుడు. ఎక్కడా అహంకారం కనబడదు. అతని వ్యక్తిత్వం ప్రజలకు నచ్చింది. తన ఆత్మగౌరవం దెబ్బతిన్నది. నన్ను చంపాలని చూస్తున్నారు. నన్ను సాదుకొంటారా? చంపుకుంటారా? మీ ఇష్టం అన్నాడు. ఒకటి రెండుసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవి దొంగ కన్నీళ్లు కావు. ఇవి ప్రజలకు సానుభూతి కలిగించాయి. కేసీఆర్​కు బుద్ది చెప్పాలని ప్రజలు అనుకున్నారు.
  • దళిత బంధు పథకానికి వస్తే తమ పక్కింటి వ్యక్తికి 10 లక్షల రూపాయలు వచ్చి తమకు రాలేదని ఇతర వర్గాల్లోని పేదలు ఆలోచించవచ్చు. ఓట్ల కోసం కులాలను చీల్చే విధానాన్ని ప్రజలు అంగీకరించలేదనిపిస్తున్నది. ఇక ఎందరు దళితులు కేసీఆర్​కు ఓటేశారో ఇప్పడు చెప్పలేం. 
  • రాజేందర్‌‌‌‌ ఉద్యమకారుడు. అభ్యుదయ భావాలు కలవాడు. కేసీఆర్‌‌‌‌ మొదటి నుంచీ ఉద్యమకారులను చిన్నచూపు చూశాడు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని కేబినెట్​లో చేర్చుకున్నాడు. 1969 నాటి ఉద్యమకారులను గుర్తించలేదు. చాలాచోట్ల తెలంగాణ ఉద్యమంలో కేసుల్లో చిక్కుకున్న వారిపై కేసులు ఎత్తివేయలేదు. అమరవీరుల కుటుంబాలను ఆదరించలేదు. వారికి న్యాయం చేయలేదు. వారికి పేరుకు ఓడిపోయే ఒకటీ రెండు సీట్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చాడు. 
  • ఎవరైనా ఎంత తెలివైన వారైనా ఒకట్రెండు సార్లు మోసం చేయొచ్చు. ప్రతిసారి మోసం చేయలేరు. అనేక సంఘటనల్లో అవినీతిపై పోరాడుతున్నట్లు నాటకాలు. ఆ తరువాత ఏమీ జరిగిందో తెలీదు. ప్రజలు ఊహించలేరా! ప్రజలను ఎల్లకాలం మభ్య పెడ్తానని అనుకోవడం ఎంత తప్పో తెలుసుకోవాలి. 
  • సామాజిక వర్గాలు కూడా టీఆర్‌‌‌‌ఎస్‌‌ వెంట వెళ్లలేదు. బండి సంజయ్‌‌ బీసీ, ఈటల బీసీ, అలా బీజేపీని బీసీల నుంచి దూరం చేయలేకపోయారు. ఇక కాంగ్రెస్‌‌, బీజేపీ కుమ్మక్కు కావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే దేశమంతటా అవి ప్రధాన శత్రువులు. రేపటి ఎన్నికల్లో (పార్లమెంటు) వాటి మధ్యే ప్రధాన పోటీ. అయితే హుజూరాబాద్‌‌లో కాంగ్రెస్‌‌ అభ్యర్థిని నిలపాలా? వద్దా? అని చాలా రోజులు ఆలోచించారు. ఎలాగూ గెలుస్తామనే నమ్మకం వారికి ఎన్నడూ లేదు. అదీగాక ప్రజలు ప్రధాన పోటీదారులనే చూస్తారు. కేసీఆర్‌‌‌‌ అహంకారానికి, ఈటల ఆత్మగౌరవానికి జరిగిన పోటీ గానే ప్రజలు భావించినట్లున్నారు. అందుకే కాంగ్రెస్‌‌కు ఓట్లు రాలేదు.

ఇప్పటికైనా కళ్లు తెరవాలి

ఇప్పటికైనా కేసీఆర్‌‌‌‌ కళ్లు తెరిచి ఉద్యమకారులకు, మేధావులకు తగిన ప్రాధాన్యతనివ్వాలి. వారి సలహాలు తీసుకోవాలి. ఉద్యోగాలు సృష్టించాలి. ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. భూమిలేని పేదలకు భూమి పంచాలి. రైతుల పంటలను కొనుగోలు చేసి వారికి రక్షణ కల్పించాలి. మోసపు మాటలను, ఇతరులను అణగదొక్కే విధానాలను మానుకోవాలి. బడ్జెట్‌‌లో అత్యధిక మొత్తం కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయే విధానాలను మానుకొని ప్రజల సంక్షేమం గురించి, విద్య, వైద్యం గురించి, ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగుల గురించి, గిరిజనుల హక్కుల గురించి ఆలోచించాలి. పాపం హరీశ్ రావు నాలుగైదు నెలలుగా కాలికి బలపం కట్టుకొని తిరిగి, ఎన్ని మాటలు చెప్పాలో అన్నీ చెప్పారు. హరీశ్​ను​ హుజూరాబాద్‌‌ ఓటమికి బాధ్యుడిని చేయడం గురించి ప్రజలు రెండు రకాలుగా అనుకొంటున్నారు. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ అని కేసీఆర్​ ఆలోచించారు. ఓడిపోతే నెపం హరీశ్​ మీదకు నెట్టవచ్చని ఆలోచించారని నమ్ముతున్నారు. హరీశ్​విశ్వాసపాత్రునిగా పని చేశారు. అయితే కేసీఆర్‌‌‌‌ అతణ్ని విశ్వాసపాత్రునిగా చూస్తారా? తన కొడుక్కు అధికారం కట్టపెట్టడానికి ఏనాడైనా అడ్డుకావచ్చని ఆలోచిస్తారా? కాలమే చెబుతుంది.

- సత్య కిరణం, హైదరాబాద్​