బ్రిటిష్ పాలకులు పరిపాలనా రంగంలో ప్రవేశ పెట్టిన సంస్కరణలు వర్ణవ్యవస్థ విచ్ఛిన్నానికి దారితీశాయి. ఆంగ్ల విద్య కింది స్థాయి కులాల వారినీ విద్యావంతులను చేసింది. ఈ క్రమంలో అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లతోపాటు నిమ్న కులాలు సంస్కృతీకరణ ద్వారా అగ్రవర్ణాల స్థాయికి ఎదగడానికి ప్రయత్నించారు.
తమిళనాడు..
నాడార్ ఉద్యమం : దక్షిణ తమిళనాడులోని రామ్‌నాథ్ జిల్లాలోని షానాన్లు అనే కులస్తులు కల్లుగీత కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. క్రమంగా వర్తక వాణిజ్యాల్లో అభివృద్ధి చెంది 1901 జనాభా లెక్కల్లో తమను నాడార్(క్షత్రియ స్థాయి)లుగా రాయించుకున్నారు. 1910లో నాడార్ మహాజన సంఘాన్ని స్థాపించాడు.
పల్లీల ఉద్యమం : పల్లీలు ఉత్తర తమిళనాడులోని నిమ్న కులంవారు. 1921 నుంచి క్షత్రియులుగా చెప్పుకుంటూ వన్నియకుల క్షత్రియులుగా పిలుచుకున్నారు. వీరు బ్రాహ్మణ సంప్రదాయాలను అనుకరించడం ప్రారంభించారు.
జస్టిస్ ఉద్యమం : దక్షిణ భారత ప్రజాసంఘం/ దక్షిణ భారత పీపుల్స్ అసోసియేషన్ 1916 నవంబర్‌లో ఏర్పాటైంది. ఈ సంస్థ స్థాపనలో పిట్టు త్యాగరాయ శెట్టి, నటేషా మొదలియార్, టీఎం నాయర్ కీలక పాత్ర పోషించారు. ఈ సంఘం 1917 ఫిబ్రవరి 26న జస్టిస్ అనే ఆంగ్ల దినపత్రికను ప్రారంభించింది. 1916 డిసెంబర్లో బ్రాహ్మణేతరుల ప్రయోజనాలను కాపాడటం కోసం దక్షిణ భారత లిబరేషన్ ఫెడరేషన్ ప్రారంభమైంది. ఇది 1917లో జస్టిస్ పార్టీగా అవతరించింది. ఈ పార్టీ బ్రిటిష్ ప్రభుత్వ అనుకూల పార్టీగా ఆదరణ పొందింది. దేశంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా స్థాపించబడిన తొలి రాజకీయ పార్టీ. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమమే జస్టిస్ ఉద్యమం. ఈ ఉద్యమం విద్య, ప్రభుత్వ, రాజకీయరంగాల్లో బ్రాహ్మణాధిక్యతను వ్యతిరేకించి మధ్యస్థాయి కులాలైన తమిళ వెల్లాలులు, మొదలియార్లు, శెట్టియార్లు, తెలుగురెడ్లు, కమ్మలు, నాయుడులు, బలిజలకు మెరుగైన అవకాశాల కోసం ఉద్యమించారు.
ఆత్మగౌరవ ఉద్యమం : ఆత్మగౌరవ ఉద్యమాన్ని 1925లో ఇ.వి.రామస్వామి నాయకర్ ప్రారంభించారు. ఈయన జస్టిస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమంలో భాగంగా దేవాలయ ప్రవేశం, మనుస్మృతిని తగులబెట్టడం, పురోహితులు లేకుండా పెళ్లిళ్లు జరపడం వంటి కార్యక్రమాలను నిర్వహించింది. రామస్వామి నాయకర్ పత్రికలు కురి అరసు, విదత్తులై, పగుతరివు.
కేరళ..
ఎఝవా ఉద్యమం : కేరళలో నిమ్నకులాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన తొలి వ్యక్తి శ్రీనారాయణగురు. ఈయన అట్టడుగు వర్గమైన ఎఝవా తెగకు చెందినవారు. 1880లో అరవైపురం దేవాలయంలో తానే విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉద్యమాన్ని ప్రారంభించారు. అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండిస్తూ జాతి మీమాంస అనే వ్యాసం రాశారు. శ్రీ నారాయణగురు ధర్మ పరిపాలన యోగాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా కేరళలో వెనుకబడిన వారి కోసం అనేక దేవాలయాలను నిర్మించారు. శ్రీనారాయణ గురు అనుచరులను నియో బుద్ధిస్టులు అంటారు.
నాయర్ ఉద్యమం : ట్రావెన్కోర్ ప్రాంతంలో మధ్యతరగతి కులాల వారు నాయర్లు. వీరు నంబూద్రి బ్రాహ్మణుల, ఇతర మలయాళేతర బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారు. నంబూద్రి బ్రాహ్మణుల ఎదుట నాయర్ మహిళలు అనాచ్ఛాదిత గుండెలతో తిరగాలనే షరతు వీరికి ఆగ్రహం తెప్పించింది. కేరళలో వెలువడిన మొదటి నవల ఇందులేఖ నంబూద్రి సాంఘిక ఆధిక్యత మీద దాడి చేసింది. కె.రామకృష్ణ పిళ్లై స్వదేశీ అభిమాని అనే పత్రికను నడిపారు. 1914లో ఎం.పద్మనాథ పిళ్లై నాయర్ సర్వీస్ సొసైటీని స్థాపించారు.
వైకోమ్ ఉద్యమం : 1924లో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.పి.కేశవమీనన్, టి.కె.మాధవన్‌లు వైకోమ్ ప్రాంతంలోని శ్రీ పార్వతీపరమేశ్వర దేవాలయంలో ప్రారంభించారు. ఈ ఆలయ ప్రవేశ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. నలుమూలల నుంచి అనేక మంది జాతాలుగా వచ్చారు. వీటిలో అతి ముఖ్యమైంది ఆత్మగౌరవ ఉద్యమ జాతా. దీనిని ఇ.వి. రామస్వామి నాయకర్ మదురై నుంచి వైకోమ్ వరకు చేపట్టారు.
శ్రీగురువాయూర్ ఉద్యమం : శ్రీగురువాయూర్ ఉద్యమాన్ని 1931లో కేలప్పన్(కేరళ రాజకీయ ఖడ్గం) శ్రీగురువాయూర్ శ్రీకృష్ణుని దేవాలయంలో ప్రారంభించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా సుబ్రమణ్యతింబు జాత వచ్చింది. దీనిని కాలికట్ నుంచి శ్రీగురువాయూర్ వరకు చేపట్టారు.
మహార్ ఉద్యమం : మహార్ ఉద్యమ బాధ్యతలను 1920 నుంచి బి.ఆర్.అంబేద్కర్ చేపట్టారు. 1924లో బహిష్కృత హితకారిణి సమాజాన్ని బొంబాయిలో ప్రారంభించారు. 1927లో సమాజ్ సమత సంఘం స్థాపించడంతోపాటు బహిష్కృత భారత్ అనే మరాఠీ పక్ష పత్రికను నడిపారు. 1926–34 మధ్య కాలంలో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నామినేటెడ్ మెంబర్‌గా వ్యవహరించారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. 1936–37 ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన అన్ని సీట్లలో విజయం సాధించింది. 1942లో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య అనే రాజకీయ పార్టీని స్థాపించారు.1945లో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. అంబేద్కర్ ప్రసిద్ధ గ్రంథాలు Annihilation of caste, Castes in india: Their mechanism, genesis and development, Pakistan and partition of India. ముఖ్య పత్రికలు మూక్ నాయక్, బహిష్కృత భారత్.
సత్యశోధక్ ఉద్యమం : మహారాష్ట్ర తోటమాలి కులానికి చెందిన విద్యావేత్త మహాత్మ జ్యోతి బాపూలే. 1870లో గులాంగిరి అనే పుస్తకం ద్వారా బ్రాహ్మణ ఆధిక్యత మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 1873లో సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు. భార్య సావిత్రిభాయి పూలేతో కలిసి పునె వద్ద వెనుకబడిన వర్గాల కోసం పాఠశాలను స్థాపించారు. ఇషారా అనే పుస్తకంలో నిమ్నకులాల వారి హక్కులను తెలియజేసి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించారు. మహాత్మ జ్యోతి బాపూలే గ్రంథాలు గులాంగిరి, సర్వజ్ఞిక్ సత్యధర్మ పుస్తక్. సంస్థలు దీనబంధు సార్వజనిక సభ(1884), సత్యశోధక్ సమాజ్.