యాదాద్రి, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు యాదాద్రి జిల్లా రైతులను కంటతడి పెట్టిస్తోంది. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కోసం మూడుసార్లు భూమిని కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు ట్రిపుల్ఆర్కోసం భూ సేకరణకు సర్వే చేస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. భూమినే నమ్ముకొన్న తాము ఇక నుంచి ఎలా బతకాలని వాపోతన్నారు. చౌటుప్పల్, తుర్కపల్లి పరిధిలో కొంత సర్వే జరిగినా.. రాయగిరిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండడంతో సర్వే ప్రారంభం కాలేదు. అలైన్మెంట్మార్చాలని డిమాండ్‌చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ సహా మంత్రుల పర్యటనల సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యాయ సాయం కోసం అడ్వొకేట్లను కలుస్తున్నారు.
యాదాద్రిలో 1853.04 ఎకరాలు
యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాయగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లోని 23 గ్రామాల నుంచి వెళ్లే 59.33 కిలోమీటర్ల రీజినల్రింగ్రోడ్డు కోసం 1853.04 సేకరించాల్సి ఉంది. దీని కోసం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గెజిట్నోటిఫికేషన్విడుదల చేశారు. యాదాద్రి జిల్లాలో రెవెన్యూ అడిషనల్కలెక్టర్, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు సర్వే నిర్వహించాల్సి ఉంది. అడిషనల్కలెక్టర్పరిధిలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో 580.17 ఎకరాల్లో పెగ్ మార్కింగ్ పూర్తైంది. తుర్కపల్లి మండలంలోని వేలుపల్లి, యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపూర్, దాతరుపల్లి గ్రామాల్లో 216 ఎకరాలకు సంబంధించి రైతుల వారీగా భూమిని గుర్తించారు. చౌటుప్పల్ ఆర్డీవో పరిధిలోని వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో సేకరించాల్సిన 780.17 ఎకరాల్లో పెగ్ మార్కింగ్ సాగుతోంది. భువనగిరి ఆర్డీవో పరిధిలో492 ఎకరాలు సేకరించాల్సి ఉండగా రాయగిరి రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుండడంతో ఏ గ్రామంలోనూ పెగ్‌మార్కింగ్ ప్రారంభం కాలేదు.
రాయగిరికే ఎక్కువ నష్టం
రీజినల్ రింగ్‌రోడ్డు కారణంగా రాయగిరి రైతులకే ఎక్కువగా నష్టం జరుగుతోంది. రాయగిరి పరిధిలో సెంట్రల్వస్తుండడం వల్ల భూ సేకరణ, రోడ్డు విస్తరణ ఇక్కడే ఎక్కువగా ఉండనుంది. దీంతో ఈ ఒక్క గ్రామంలోనే 70 మందికి పైగా 266. 14 ఎకరాలు కోల్పోతున్నారు. మిగిలిన 22 గ్రామాల్లో వలిగొండ మండలం రెడ్లరేపాకలో గరిష్ఠంగా 124.19 ఎకరాలు సేకరిస్తుండగా, భువనగిరి మండలం కేసారంలో 14.33 సేకరించాల్సి ఉంది. జిల్లాలో 59.33 కిలోమీటర్ల రోడ్డు వేయనుండగా ఇందులో ఒక్క రాయగిరిలో 7 కిలోమీటర్ల రోడ్డు వేయనున్నారు. ఆ తర్వాత తుర్కపల్లి మండలం వీరారెడ్డి పల్లిలో 4.58 కి.మీ., మిగిలిన 21 గ్రామాల్లో కిలో మీటర్ నుంచి నాలుగు కిలోమీటర్ల లోపు వేయనున్నారు. గతంలో కూడా రాయగిరి రైతులే ఎక్కువ నష్టపోయారు. కాళేశ్వరం కాల్వలు, హై టెన్షన్కరెంట్ లైన్, జాతీయ రహదారి విస్తరణలో 145 ఎకరాలు కోల్పోయారు. ఇప్పుడు ఇదే గ్రామంలో 266.14 ఎకరాలు సేకరించాలని చూస్తున్నారు. యాదగిరిగుట్టకు వెళ్లే రోడ్డును భవిష్యత్‌లో విస్తరించనున్నారు. దీనికి కూడా ఈ గ్రామ భూములు సేకరించాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే అలైన్మెంట్మార్చారని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత అలైన్మెంట్ప్రకారం పెద్ద పెద్ద రియల్ఎస్టేట్కంపెనీలు, వ్యాపారస్తులకు చెందిన భూములు పోయేవని, ఇప్పడు అలా జరగకుండా మార్పులు చేశారని ఆరోపిస్తున్నారు.
ఆందోళన బాట
ట్రిపుల్ ఆర్ కారణంగా భూమి కోల్పోతున్న రైతులు, ప్రధానంగా రాయగిరి గ్రామస్తులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సర్వే కోసం వచ్చినవారిని అడ్డుకోవడంతో ఆపేశారు. ఇప్పటికే కలెక్టర్పమేలా సత్పతికి పలుసార్లు, ఎంపీలు బండి సంజయ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రాలు అందించారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని రైతులు కలవడానికి ప్రయత్నించగా మహిళా రైతులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం కేసీఆర్ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించిన రైతులను అరెస్ట్‌చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఒక వైపు ఆందోళనలు నిర్వహిస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి రైతులు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ లాయర్ఎన్ రామచందర్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే, లాయర్ రఘునందన్‌రావు, ప్రముఖ లాయర్రచనారెడ్డిని రైతులు కలుసుకొని న్యాయ సాయం కోరారు. అదే విధంగా గవర్నర్ తమిళిసై ఏర్పాటు చేసిన గ్రీవెన్స్బాక్స్లో వినతిపత్రం సైతం వేశారు.
భూమికి భూమి ఇవ్వాలి
ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన మూడున్నర ఎకరాలు ట్రిపుల్ఆర్కింద పోతోంది. డిగ్రీ చేసినా ఉద్యోగం రాకపోవడంతో ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న. భూమికి భూమి ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చాకే మా భూముల్లో సర్వే చేయాలి.
– కర్రె మహేశ్, దాతరుపల్లి
14 ఎకరాలు పోతోంది
మా బాబాయి అయిలయ్య, మాకు కలిసి 14 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికే ఎకరం భూమి హై టెన్షన్ కరెంట్ లైన్ టవర్ల కోసం తీసుకున్నారు. రూపాయి కూడా ఇవ్వలేదు. డిగ్రీ చదివిన నేను డెయిరీ ఫాం పెట్టుకున్న. ఇప్పుడు ఉన్న 14 ఎకరాల భూమి ట్రిపుల్ ఆర్కింద పోతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
- తెల్జూరి శ్రీకాంత్, రాయగిరి