- భూసేకరణ ఇప్పట్లో అయ్యేట్లు లేదు.. తేలని పరిహారం లెక్క
- రోజురోజుకు పెరుగుతున్న భూముల రేట్లు
- భూ సేకరణకు రాష్ట్ర సర్కారు కేటాయించింది 500 కోట్లే
- గత బడ్జెట్లో కేటాయించిన 750 కోట్లలో ఒక్క రూపాయీ విడుదల చేయలే
- 18 నెలల్లో భూసేకరణ పూర్తి కావాలన్న కేంద్రం..
- మూడేండ్లయినా పూర్తయ్యేలా కనిపిస్తలే
హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 18 నెలల్లో భూసేకరణ చేయాలని కేంద్రం చెప్పినప్పటికీ మూడేండ్లయినా ఈ తతంగం పూర్తయ్యేలా లేదు. భూసేకరణ విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. పరిహారం ఎంత ఇస్తారన్నది ఇంతవరకు తేలలేదు. పరిహారం తేల్చేదాకా తమ భూముల జోలికి రావొద్దని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పైగా భూ సేకరణకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా కేటాయించింది. దీంతో మొత్తం ప్రక్రియ ఆలస్యమై ప్రాజెక్ట్ ఖర్చు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.
కేటాయించింది రూ. 500 కోట్లే
రెండు దశల్లో నిర్మించనున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ 158.6 కిలో మీటర్లకు గత డిసెంబర్ చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్‌లో ప్రాజెక్టుకు రూ. 8 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. ఇందులో రూ. 2,500 కోట్లు భూసేకరణకే కావాలని అధికారులు చెప్తున్నారు. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు కోసం 2021–22 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించినప్పటికీ రూపాయి కూడా విడుదల చేయలేదు. ప్రస్తుత బడ్జెట్లో రూ. 500 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని, అవి కూడా సకాలంలో రిలీజ్ చేస్తారన్న గ్యారంటీ లేదని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసిన తర్వాత కేంద్రం తన వాటాను రిలీజ్ చేస్తుందని చెప్తున్నారు.
అధికారులను కేటాయించని రాష్ట్ర సర్కార్
ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి గ్రూప్ 1, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతోపాటు దాదాపు 300 మందిని కేటాయించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు సీఎస్‌కు లేఖ రాశారు.
ఫస్ట్ ఫేజ్‌లో 4 వేల ఎకరాలు
ఆర్ఆర్ఆర్ తొలిదశ పనుల అలైన్మెంట్ ఖరారు కావటంతో రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ ఏఐ) భూ సేకరణ మీద దృష్టి పెట్టాయి. ఫస్ట్ ఫేజ్ లో మూడు ఉమ్మడి జిల్లాలు మెదక్ , రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ , ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రోడ్డు వెళ్లే భూముల్లో అధికారులు మార్కింగ్ చేసే ప్రక్రియ సాగుతున్నది. అయితే ఇన్ని వేల ఎకరాల భూసేకరణ ఏడాదిన్నరలో సాధ్యమేనా అనే సందేహాలు తలెత్తు తున్నాయి. ఏయే గ్రామాలు, ఏయే మండలాల మీదుగా రూట్ వెళుతుందన్న అంశానికి సంబంధించిన వివరాలు కేంద్రానికి పంపినట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్తున్నారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే గ్రామాలకు చెందిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణపై నోటీసులు ఇచ్చి, పబ్లిక్ హియరింగ్ చేపట్టనుంది. అయితే ఇప్పటికే వివిధ ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలకు రైతుల నుంచి భూసేకరణ విషయంలో అధికారులు చేపడుతున్న పబ్లిక్ హియరింగ్‌లో నిత్యం ఆందోళనలు, వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్లయ్ రాలేదని అధికారులు చెప్తున్నారు. ఆర్డీవో స్థాయి అధికారులను కేటాయించకపోవడం కూడా భూసేకరణ ఆలస్యానికి కారణమవుతున్నది.
పరిహారం ఎంత?
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు భూమిని సేకరించే అంశంపై రైతులకు, భూములు ఇచ్చిన వారికి చెల్లించే పరిహారంపై సర్కారు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇరిగేషన్ ప్రాజెక్టులకు ల్యాండ్ సేకరిస్తే అక్కడి ధరలను బట్టి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తున్నది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు సేకరించిన ల్యాండ్ లో ఎకరాకు రూ. 8 లక్షలు ఇస్తుండగా.. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు ఎకరాకు రూ. 14 లక్షలు ఇస్తున్నది. 2013 ల్యాండ్ ఎక్విజీషన్ యాక్ట్ ప్రకారం.. సేకరిస్తున్న భూమి మార్కెట్ విలువకు మూడు రెట్లు ఎక్కువగా చెల్లించాలని ఉంది. ఉదాహరణకు ఎకరాకు రూ. 40 లక్షలు ధర ఉంటే రూ.1 కోటి 20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇంత చెల్లించటం భారం కాబట్టి రైతులను ఎంతో కొంత పరిహారానికి ఒప్పించి డబ్బులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం 2015 లో జీవో తెచ్చింది. దీని ప్రకారం పరిహారం చెల్లిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు శాంక్షన్ అయిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలు భూముల ధరలను భారీగా పెంచాయి. ఫస్ట్ ఫేజ్ రూట్ వెళ్తున్న ఉమ్మడి మెదక్ , రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మినిమం ఎకరా భూమి రూ.1 కోటి కి తక్కువ ఎక్కడా దొరకడం లేదు.
ఏండ్లయినా పరిహారం ఇవ్వట్లే
రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో సర్కారుపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి రెండు, మూడేండ్ల కింద భూములు సేకరించి ఇంత వరకు పరిహారం చెల్లించలేదని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. పరిహారం కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకు ప్రభుత్వం రెండేండ్ల కింద భూములు సేకరించి ఇంత వరకు పరిహారం చెల్లించలేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని అధికారులు చెప్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టుకు ల్యాండ్ ఇస్తే పరిహారం ఎప్పుడు వస్తదో తెలియదని రైతులు అంటున్నారు.