వీళ్లు మహా రిచ్!

ఒకరు నిత్యం కోట్ల రూపాయల్లో రాబడిగల వెంకటేశ్వరుడు… మరొకరు లక్ష కోట్ల రూపాయల ఆస్తులుగల అనంతపద్మనాభుడు.. దేశంలో ఎక్కువ సంపద ఆలయాల్లో ఉందని 2011లో వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ లెక్కలేసింది. ఇండియాలోని ఆలయాల్లో దాదాపు 22,000 టన్నుల బంగారం ఉందని అంచనా. దీని విలువ లక్ష కోట్ల డాలర్లు. రూపాయల్లో 70 లక్షల కోట్ల పైమాటే!  చాలా ఆలయాలపై ప్రభుత్వాలకు పూర్తిస్థాయి మేనేజిమెంట్ లేదు. కొన్ని మఠాల చేతుల్లో ఉంటే, మరికొన్ని ఒకప్పటి సంస్థానాల చేతుల్లో ఉంది. శబరిమల అయ్యప్పస్వామివారి ఆభరణాలన్నీ పందళం రాజుల వద్దనే ఉంటాయి. వీటి లెక్కలు తేల్చాల్సిందిగా ఈమధ్య సుప్రీం కోర్టు ఆదేశించింది. కేరళ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్​ సి.ఎన్​.రామచంద్రన్​ నాయర్​ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ లెక్కన దేశంలో ఎక్కువ రాబడి ఉన్న దేవాలయాలు ఎక్కడెక్కడున్నాయో చూద్దాం.   ి

పిలిస్తే పలుకుతాడన్న నమ్మకంతో దైవాన్ని ప్రార్థిస్తారు భక్తులు. కష్టమొచ్చినా, కన్నీరొచ్చినా, శుభమైనా, అదృష్టం కలిసొచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఇష్టదైవమే. హిందువులకు జగమంతా దేవుని ఇల్లే. ముక్కోటి దేవతల్లో ఏ ఒక్కరైనా కనికరించి తమను కరుణించడా అనుకుంటారు. అందుకే కాశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు అనేక దేవాలయాలు. ఇవి కేవలం భక్తి ప్రచారక కేంద్రాలు మాత్రమే కాదు. భారతీయ సంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్నికూడా ఎన్నో తరాలుగా కొనసాగిస్తూ వస్తున్నాయి. చారిత్రక కాలంలో చక్రవర్తులు, రాజులు, సామంతులు, జమీందారులు దేవాలయాలను తమ ఆర్థిక వ్యవస్థలో భాగం చేసుకునేవారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అనగొండలోని ఆలయం ట్రెజరీగా ఉండేదంటారు. రాజులు తమకు ప్రజలు కట్టిన పన్నుల సొమ్మును, ఇతరత్రా వచ్చిన రాబడిని, యుద్ధాలలో గెలిచిన బంగారం, వెండి, వజ్రాలు వంటివి ఆలయాల్లోనే దాచుకునేవారు.

ఇటీవల తిరువనంతపురంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయంలో నేలమాళిగను తెరిచినప్పుడు అంతులేని సంపద బయటపడింది. ఆలయం దిగువనగల గదులను తెరవగా కళ్లు చెదిరిపోయే బంగారం, బంగారు విగ్రహాలు, అతి విలువైన వెండి, వజ్రాలు, మణులు, ఇత్తడి సామగ్రి కనిపించింది. ట్రావెన్కూర్​ రాజ్యానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని నిర్వహించేవారు. తాము కేవలం భగవంతుడి తరఫున కస్టోడియన్లమే తప్ప, తమకు ఈ సంపదకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరించేవారని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో అనంత పద్మనాభుడిని దర్శించుకుని, పూజలు చేసి బయటకు వచ్చాక, కాలిధూళి సైతం తమతో పాటు రాకూడదన్న ఉద్దేశంతో అక్కడే ట్రావెన్కూర్​ రాజులు కాళ్లు కడుక్కునేవారట! అంత నిష్టగా దేవుడి సంపదను, సొమ్మును చూసుకునేవారని దీనిని బట్టి తెలుస్తోంది.

ఆయా ఆలయాలు ఎంత గొప్పవైనప్పటికీ లోకల్​గా ఉండేవాళ్లకే తెలిసేది. దూర ప్రాంతాలవాళ్లకు తెలిసినా అప్పట్లో కనెక్టివిటీ లేకపోవడంవల్ల పెద్దగా బయటివాళ్లు వచ్చేవారు కాదు. వెంకటేశ్వర స్వామి అనగానే టక్కున గుర్తొచ్చే తిరుపతికి సైతం ఓ ముప్పయి నలభై ఏళ్ల క్రితం వరకు భక్తుల తాకిడి పెద్దగా ఉండేది కాదు. ఎవరికైనా వెంకటేశ్వరుడి పేరు పెట్టి, తలనీలాల ముడుపు కడితే, ఆ చిన్నారులకు అయిదారేళ్లు వచ్చేవరకు తిరుపతి వెళ్లలేని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. రాత్రికి గుర్తొస్తే తెల్లవారుజామునే తిరుపతికి వెళ్లగల రేంజ్​లో సదుపాయాలు వచ్చేశాయి. గదుల బుకింగ్​ మొదలుకొని దేవుడి కల్యాణాల వరకు అన్నీ ఆన్​లైన్​లోనే బుక్​ చేసుకొని వెళ్లగలుగుతున్నారు.

దీనివల్ల దేవాలయాలకు రోజువారీ రాబడి చాలా పెరుగుతోంది. అనంతపద్మనాభ స్వామివారిది ఏక మొత్తంగా రాజుల కాలంలో జమ చేసిన సంపద కాగా, తిరుమలలోని వెంకటేశ్వరస్వామిది నిత్య పంటగా వస్తున్న రాబడి. అనంతపద్మనాభుని నేలమాళిగల్లోని సంపద విలువను రూపాయల్లో లక్ష 42 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే, తిరుమలలో కేవలం లడ్డూల ద్వారా వచ్చే రాబడే ఏటా 200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. 2019–20లో టీటీడీ బడ్జెట్​ అంచనా రూ. 3,116 కోట్ల. దీనిలో హుండీలో భక్తులు సమర్పించుకునే ముడుపులు రూ. 1200 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇది కాకుండా, నగలు, స్థిరాస్తులు, డిపాజిట్లు రూపంలో స్వామివారికి నిత్యం కోట్ల రూపాయల్లో రాబడి వస్తోంది. శరస్వ్య శరణాగతికి చిహ్నంగా తలనీలాలు సమర్పించుకుంటారు. ఈ తల వెంట్రుకలను వేలం ద్వారా పోయిన ఫైనాన్షియల్​ ఇయర్​లో రూ. 125 కోట్ల వచ్చినట్లు టీటీడీ తెలిపింది. బంగారం సుమారుగా 9 టన్నుల వరకు ఉందని, వివిధ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లపై రూ.846 కోట్ల వరకు వస్తుందని అఫీషియల్​గా పేర్కొంది.

పురాణాల్లో చెప్పిన ప్రకారంగా… మనకు అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వైష్ణవ సంప్రదాయంలో 108 ఆలయాలను పవిత్రంగా భావిస్తారు. అంటే శ్రీమహావిష్ణువు కొలువైన ఆలయాలుగా 108 గుడులను గుర్తించారు. ధనిక పేద తారతమ్యం లేకుండా అందరూ దేవుడి ఎదుట నిలబడి తమ తమ బాధలు చెప్పుకుని ఉపశమనం పొందుతుంటారు. టెంపుల్​ టూరిజం కూడా పెరిగినందువల్ల ఇప్పుడు ఎక్కడికైనా సులువుగా వెళ్లగలుగుతున్నారు. భక్తులు హుండీల్లో వేసే మొక్కులతోపాటు, వేల ఏళ్లుగా రాజులు ఇచ్చిన మడిమాన్యాలు, నగలు, కానుకలతో దేశంలోని ఆలయాలు చాలా రిచ్​గా ఉన్నాయి.

ఎక్కువ రాబడి ఉన్న గుడులు

దేశంలోని అత్యంత సంపద కలిగిన ఆలయాల్లో తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం టాప్​ పొజిషన్​లో ఉండగా, రోజువారీగా ఎక్కువ రాబడిగల ఆలయాల్లో తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం మొదటి స్థానంలో ఉంది. రిచ్​ టెంపుల్స్​ లిస్టు గనుక తీసినట్లయితే… టాప్​ ఫైవ్​లో పై రెండు దేవాలయాలతోపాటు జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం, షిర్డీలో సాయిబాబా మందిరం, ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్​ వస్తాయి. వీటి తర్వాత సంపన్నవంతమైన ఆలయాల్లో స్వర్ణ మందిరం (అమృతసర్​), మీనాక్షి ఆలయం (మదురై), జగన్నాథ స్వామి మందిరం (పూరి), కాశీ విశ్వనాథ ఆలయం (వారణాసి), అయ్యప్పస్వామి ఆలయం (శబరిమల), సోమనాథ్​ మందిరం (గుజరాత్​), గురువాయూరప్ప ఆలయం (గురువాయూర్​), మహాలక్ష్మి దేవాలయం (కొల్హాపూర్​), అమరనాథ్​ గుహాలయం (జమ్మూ), స్వామినారాయణ్​ మందిరం (ఢిల్లీ) ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటాయి.

ఈ పదిహేను ఆలయాల్లోనూ ఉన్న సంపదతో అనేక ధార్మిక కార్యక్రమాలు, భక్తులకోసం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీటీడీ అనుబంధంగా ఉన్న ఆలయాల నిర్వహణను టీటీడీయే చూసుకుంటుంది. భక్తులకు సౌకర్యాలకోసం ఏటా 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. అలాగే, హిందూ ధర్మ పరిరక్షణకోసం 180 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. రోజుకు కనీసం యాభై వేల మంది భక్తులు వస్తుంటారని, బ్రహ్మోత్సవాల సమయంలో లక్షన్నరకు పైగానే వస్తారని చెబుతారు. టాప్​–15లోని మిగతా ఆలయాలుకూడా భక్తులు ఎక్కువగా వచ్చేవే అయినప్పటికీ… వైష్ణోదేవి గుడి, అమరనాథ్​ గుడి వంటివి సీజనల్​గా కిటకిటలాడుతుంటాయి. అవి కాశ్మీర్ ఏరియాలో ఉండడంతో వేసవికాలంలోనే భక్తుల రాకపోకలు ఎక్కువ. అలాగే, శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికికూడా నవంబర్​–జనవరి నెలల మధ్యలోనే భక్తులు వెళ్తారు.