రాజ్యాంగబద్ధమైన పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి

మరో ఐదు రోజుల్లో  రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. జులై 21న ఓట్ల లెక్కింపు. తేదీల మాట ఎలా ఉన్నా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛన ప్రాయమే. బీజేపీకి ఉన్న ఓట్ల సంఖ్యకు ప్రతిపక్షాలకున్న ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ముర్ము విజయం ఖాయమైనట్లే.రాజకీయాల్లో సహా, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం సరాసరి 25.8 శాతంగా ఉంది. ఈ విషయంలో 197 దేశాలకు గానూ మన దేశ స్థానం148. లోక్ సభలో మొత్తం సభ్యులకు గానూ 14 శాతంతో 78 మంది ఎంపీలు, రాజ్యసభలో 11శాతంతో 27 మంది మహిళా సభ్యులు ఉన్నారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లు 26 ఏండ్లుగా పాస్ కాలేదు. అలాంటి వాతావరణంలో కూడా మన దేశంలో ఈ మధ్యకాలంలో రాజకీయ అవసరాల నిమిత్తమే అయినప్పటికీ కొన్ని కీలక పదవులు మహిళలను వరిస్తున్నాయి. నిజానికి అమెరికా లాంటి దేశాల్లో కూడా మహిళలు అత్యున్నత పదవులు చేపట్టడం అంటే దుస్సాహసమే. 2017లోనే రాష్ట్రపతిగా ముర్ము పేరు పరిశీలనకు వచ్చింది.  కానీ అప్పటికి ఆమె వయసు కేవలం 59 ఏళ్లు. ఈసారి కూడా 20 పేర్లు పరిశీలనలోకి  రాగా తర్జనభర్జనల తర్వాత ఆమె పేరును ఖాయం చేశారు. మన దేశంలో దళిత, ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఉండటం ఇంతవరకు జరగలేదు. ఇప్పుడా అవకాశం వచ్చింది. భారతావని మొత్తం దీన్ని ఆహ్వానించాల్సిందే. ఉదారవాద పార్టీల కన్నా మితవాద పక్షమైన బీజేపీ నుంచి ఒక మహిళా అభ్యర్థి రావడం భారతీయ రాజకీయ చరిత్రలో ముఖ్య ఘట్టమేనని మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు.

అందరిలాగే ఆమె కూడా.. 

ఒడిశా రాజకీయాల్లో  పైచేయిగా ఉన్న గిరిజన సంతాలు తెగకు చెందిన పంచాయతీరాజ్ వ్యవస్థ లోని గ్రామాధికారుల కుటుంబంలో ముర్ము పుట్టారు. భర్త శ్యామ్ చరణ్ ముర్ము ప్రభుత్వ ఉద్యోగి. ముర్ము చదివింది భువనేశ్వర్​లో. ఆమెది సాధారణ జీవితమే కానీ ఇప్పుడు ద్రౌపది ముర్ము దేశమంతా మార్మోగుతున్న పేరు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళ భారత అత్యున్నత పదవి రాష్ట్రపతి హోదా పొందనున్నారు. 1997లో రాజకీయ ప్రవేశం.. ఆపై 2000లో  మొదటిసారిగా శాసనసభ ప్రవేశం, మంత్రిగా బాధ్యతలు నిర్వహణ, పార్టీ పరంగా కూడా అనేక బాధ్యతలు చేపట్టారామె. 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నీలకంఠ అవార్డు అందుకున్నారు. 2017లో జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా  బాధ్యతలు చేపట్టారు.

దృఢ చిత్తం..

ద్రౌపది ముర్ము రాజకీయంగా ఎదుగుతున్న దశలో కేవలం ఐదేండ్ల వ్యవధిలోనే తన ఇద్దరు కుమారులు, భర్తను కోల్పోయారు. ఆ సమయంలో మానసికంగా తాను ఎంతో కుంగిపోయానని స్వయంగా ఆమె పలు ఇంటర్వ్యూల్లో  తెలిపారు. అయితే ఆధ్యాత్మిక చింతనతో దాన్ని అధిగమించగలిగారు. 2015లో జార్ఖండ్ గవర్నర్ గా  బాధ్యతలు చేపట్టారు. అదనంగా మరొక ఏడాది ఆ పదవిలో ఉన్నారు. అయితే ముర్ము గవర్నర్ బాధ్యతలు చేపట్టేటప్పటికి జార్ఖండ్ లో బీజేపీ అధికారంలో ఉంది. రెండు ముఖ్యమైన బిల్లు(ఒకటి చోటా నాగపూర్ టెనెన్స్ యాక్ట్ 1908, సంతాలు పరగణ టెనెన్స్ యాక్ట్ 1949)లను సవరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. గిరిజన ప్రాంతాలను వ్యవసాయం నుంచి వాణిజ్యానికి మార్చుకునే వెసులుబాటు కల్పించేందుకు ఈ రెండింటిని తెచ్చింది. ఈ సవరణ బిల్లులు గిరిజనులు సహా పౌర సమాజంలో తీవ్ర గగ్గోలు  పుట్టించాయి. అలజడి రేపాయి. గిరిజన హక్కులు, వారి ప్రాంతాల్లో ఉండే సహజ వనరులపై గల హక్కులకు భంగం కలిగించేలా ఉన్న ఈ బిల్లులు గవర్నర్ ముర్ము దృష్టికి వచ్చాయి. ఒక గవర్నర్ గా జోక్యం చేసుకొని, తనకున్న రాజ్యాంగపరమైన అధికారాన్ని వినియోగించి ఆమె వాటిని తిరస్కరించారు. ఇది ఆమెలోని తన జాతి పట్ల ఉన్న నిబద్ధతకు మచ్చుతునకగా నిలిచింది. అధికార బీజేపీ నిర్ణయాలను తిరస్కరించడం అంత సులువైన విషయం కాదు. పైగా విపక్షాల మన్ననలు కూడా అందుకున్నారు.

ఎన్ని విమర్శలు ఉన్నా..

నిజమే.. ఒక ఆదివాసి,  ఒక దళిత వ్యక్తి అత్యున్నత పదవిలోకి వస్తే సమాజంలో ఉన్న అణచివేతలు ఠక్కుమని ఆగిపోవు. అయినప్పటికీ ముర్ము లాంటి వారిని ఆహ్వానించాల్సిందే. అవకాశం ఉంటే జార్ఖండ్ లోలా   జాతీయ స్థాయిలో  ఆమె పనిచేస్తారని ఆశించడంలో తప్పులేదు కదా. చుట్టూ ఉన్న వాతావరణం, పురుషాధిక్యత సమాజం, మతాలు, కులాలు ఆధారంగా నడిచే దేశ రాజకీయాలు ఆమెకు సహకరిస్తేనే  ఏమైనా మార్పులు తీసుకురాగలరు. అంతే కానీ ప్రథమ మహిళా కాబట్టి అన్నీ మార్చేయాలనుకోవడం అత్యాశే అవుతుంది. అసంబద్ధం కూడా. మహిళా నాయకులు ఆధిపత్యం చెలాయించిన ఈ 50, 60 ఏండ్లలో మహిళలపై అత్యాచారాలు ఆగలేదు. అణచివేతల సంఖ్య తగ్గలేదు. ఆధునికత పెరిగే కొద్దీ  స్త్రీ, పురుష వివక్ష మరో రూపంలో పెరిగింది.  అలాగని అంది వచ్చిన అవకాశాలను జారవిడుచుకోవడం సమంజసం కాదు. దేశ వ్యాప్త౦గా లక్షా 50 వేల గూడెంలున్నాయి. అందులో చాలా వాటికి కనీసం రోడ్లు లేవు. తాగునీరు, విద్య, వైద్యం, సరైన ఇండ్లు లేవు, దేశ ఉద్యోగితలో గిరిజనుల శాతం 6కు మించలేదు. ఉన్నా కూడా చిన్న చితక ఉద్యోగాలే అధికం. ఏటా అంటు వ్యాధులు ముఖ్యంగా మలేరియాతో వేల సంఖ్యలో గిరిజనులు మరణిస్తున్నారు. మైనింగ్ పేరిట మైదాన ప్రాంతాలకు వారిని తరిమేస్తున్నారు. గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ద్రౌపది ముర్ము ఇలాంటి సమస్యల్లో  కొన్నింటినైనా పరిష్కార దిశగా తీసుకెళ్తారని ఆకాంక్షిద్దాం. అలాగే ఎవరికి ప్రతినిధిగా ఎంచుకున్నారో,  ఆ జనులకు మేలు కలిగేలా చర్యలు తీసుకున్నప్పుడే ఆమెకు సముచిత విలువ, గౌరవం ఇచ్చినట్టు అని గుర్తెరిగి మసలుకోవాల్సిన బాధ్యత కూడా ఎంపిక  చేసిన ప్రస్తుత  ప్రభుత్వ౦పై ఉందనేది సత్యం. 
‌‌‌‌- పండలనేని గాయత్రి

సీనియర్​ జర్నలిస్ట్