హైదరాబాద్ : సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంతో మరోసారి ఫైర్ సెఫ్టీ నిబంధనలు తెరపైకి వస్తున్నాయి. బిల్డింగ్ లో దుకాణ యజమానాలు నిబంధనలు పాటిస్తున్నారా..? లేదా అనే చర్చ నడుస్తోంది. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ మెన్స్ వేర్ షాపులకు పెట్టింది పేరు.. ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. రోజూ వేలాది మంది బట్టలు కొనుగోలుకు వస్తుంటారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ కు మెన్స్ వేర్ కు ఫారెవర్ అనే ట్యాగ్ కూడా ఉంది. బ్రాండెడ్ తోపాటు అన్ బ్రాండెడ్ దుస్తులకు పెట్టింది పేరు ఈ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ లో దాదాపు 300 దుకాణాలు ఉంటాయి. కొన్ని బట్టల దుకాణాలు, మరికొన్ని పలు కంపెనీల ఆఫీసులు ఉన్నట్లు తెలుస్తోంది. కాంప్లెక్స్ 8 అంతస్తుల్లో ఉంటుంది.
1980లో భవనం నిర్మించారని తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ ను పార్కింగ్ కు కేటాయించారు. 1,2,3వ అంతస్తుల్లో బట్టల షాపులు ఉంటాయి. పై అంతస్తుల్లో బట్టల గోదాములతో పాటు కొన్ని కంపెనీల ఆఫీసులు ఉన్నాయని చెబుతున్నారు. భారీగా మంటలు ఎగిసిపడేందుకు కూడా బట్టలే కారణమని అంటున్నారు. అగ్ని ప్రమాదం సమయంలో కొంతమంది తమ ఆఫీసుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
మరో గంటలో మంటలు అదుపులోకి వస్తే ప్రమాద తీవ్రత తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ మంటలు అదుపులోకి రాకపోతే.. భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. 7,8వ ఫ్లోర్లతో పాటు మిగతా అంతస్తులకు కూడా మంటలు సోకితే.. బిల్డింగ్ ను కూల్చివేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం బిల్డింగ్ నాలుగు వైపుల నుంచి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.