2 వేల రూపాయల నోట్లపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం(నవంబర్ 4, 2024) కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో చలామణీ అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు ప్రజల నుంచి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినట్లు ఆర్బీఐ తెలిపింది. కేవలం రూ.6,970 కోట్ల రూపాయల విలువ కలిగిన 2 వేల రూపాయల నోట్లు మాత్రమే ప్రస్తుతం దేశంలోని ప్రజల దగ్గర ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
2023, మే 19న చలామణీ నుంచి 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించినట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ ఈ ప్రకటన చేసే సమయానికి, అంటే మే 19, 2023 నాటికి దేశంలో 3.56 లక్షల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు చలామణీలో ఉన్నాయి. అక్టోబర్ 31, 2024 నాటికి చలామణీలో ఉన్న 2 వేల రూపాయల నోట్ల సంఖ్య రూ.6,970 కోట్లకు పడిపోయినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
Also Read:-గుడిలోని ఏసీ నీళ్లను అమృతంగా తాగుతున్న భక్తులు
అక్టోబర్ 7, 2023 వరకూ అన్ని బ్యాంకుల బ్రాంచుల్లో 2 వేల నోట్లను డిపాజిట్ లేదా ఎక్సేంజ్ చేసుకునే సదుపాయం ఉంది. ఆ తర్వాత నుంచి ఆర్బీఐకి చెందిన 19 ఆఫీసుల్లో 2 వేల నోట్లు మార్చుకునే ఫెసిలిటీ ఆర్బీఐ కల్పించింది.
బెంగళూరు, హైదరాబాద్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగర్, చెన్నై, గౌహతి, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్ కత్తా, లక్నో, ముంబై, నాగ్ పూర్, పాట్నా, న్యూఢిల్లీ, తిరువనంతపురం, అహ్మదాబాద్ ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో 2 వేల నోట్లను డిపాజిట్ గానీ, ఎక్సేంజ్ గానీ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసుల్లో కూడా 2 వేల నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా 2016 నవంబర్లో 2 వేల రూపాయల నోట్లను చలామణీలోకి తెచ్చిన సంగతి తెలిసిందే.