
- ప్రజాపాలనకు5.40 లక్షల అప్లికేషన్లు
- మీ సేవకు మరో 85 వేలు
- రెండు సార్లు అప్లై చేసుకున్న వాళ్లెందరో..
- స్క్రూటినీ చేసి కొత్త కార్డులు జారీ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: నగరంలో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి, కొత్త కార్డులు జారీ చేసే బాధ్యతను ప్రభుత్వం సివిల్సప్లయీస్డిపార్ట్మెంట్కే అప్పగించింది. ఇప్పటివరకు ప్రజాపాలన, మీసేవలో దరఖాస్తు చేసుకున్నవారి అప్లికేషన్లను పరిశీలించి వార్డు సభల్లో అర్హుల జాబితా చదివి వినిపిస్తామని అధికారులు చెబుతూ వస్తున్నారు.
అయితే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేతో లింక్ఉండడంతో నగరంలో వార్డు సభలకు ఆలస్యమవుతోంది. వార్డు సభలను మార్చి మొదటివారంలో నిర్వహిస్తామని, అందులోనే ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ప్రకటనతో పాటు రేషన్‌కార్డుల జాబితా చదివి వినిపిస్తారని చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించి రేషన్‌కార్డుల అర్హుల జాబితా ప్రకటించడం, మీసేవాల్లో దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగిపోతుండడంతో నగరవాసులు అసంతృప్తికి గురయ్యారు.
దీంతో మీసేవలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటుండడంతో ప్రభుత్వం వార్డు సభలతో సంబంధం లేకుండా రేషన్‌కార్డులను జారీ చేసే బాధ్యత పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కొంత కాలంగా రేషన్ కార్డు దరఖాస్తులు, స్వీకరణ, అర్హుల ఎంపికపై నెలకొన్న గందరగోళ పరిస్థితులు తొలగిపోనున్నాయి.
నాలుగు రోజుల్లోనే 85 వేల అప్లికేషన్లు
మీ సేవాలో దరఖాస్తు తీసుకోవడం మొదలుపెట్టిన నాలుగు రోజుల్లోనే తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 85వేల దరఖాస్తులు వచ్చినట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మరో వారం, పదిరోజుల్లో మరో లక్ష వరకూ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రజా పాలన సందర్భంగా 5.40 లక్షల దరఖాస్తులు వచ్చాయంటున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ మీ సేవ సెంటర్లలో కూడా దరఖాస్తు చేసుకుంటున్నారని, వారి అప్లికేషన్స్టేటస్తెలియకపోవడం వల్లే ఇలా చేస్తున్నారని గుర్తించారు. స్క్రూటినీ తర్వాత సంఖ్య తగ్గుతుందంటున్నారు.
పది రోజుల్లో స్క్రూటినీ
మరో పది రోజుల వరకు మీసేవ సెంటర్లలో అప్లికేషన్లు ఎన్ని వచ్చాయో చూసుకొని స్క్రూటినీ చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. అందులో ఒకటికన్నా ఎక్కువ సార్లు వచ్చిన వాటిని వేరు చేస్తామంటున్నారు. అర్హులను గుర్తించి వారి ఇండ్లకు వెళ్తామని, వారు ఇచ్చిన సమాచారం సక్రమంగానే ఉందని తెలిస్తే కార్డు జారీ చేస్తామని అంటున్నారు. అదే సమయంలో రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.