పోడు పట్టాలు కొందరికే..అప్లయ్​చేసుకున్నది 2130 మంది

  • ఎంపిక చేసింది 205, పట్టాలు ఇచ్చేది 128 మందికి..
  • 77 మంది భూములపై రీ సర్వేనేడు పాస్​బుక్స్ ​పంపిణీ

యాదాద్రి, వెలుగు: పోడు భూములకు పట్టాల పంపిణీ పేరుతో ఊరిస్తూ వచ్చిన సర్కారు. .చివరకు ఉసూరుమనిపించింది.  పాస్‌బుక్స్‌ కోసం వేల సంఖ్యలో అప్లై చేసుకోగా.. వందల మంది రైతులను మాత్రం ఎంపిక చేసింది. ఇందులోనూ కొందరి భూమలను రీ సర్వే చేయనున్నది.  నేడు కొందరికి పట్టాలు పంపిణీ చేయనుండగా.. మిగతా రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

యాదాద్రి జిల్లాలో ఇలా..

యాదాద్రి జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్​ డివిజన్లలో 6,133 ఎకరాల పోడు భూములకు 2,130 మంది అప్లై చేసుకున్నారు.  ఈ మేరకు అధికారులు రైతుల ఆధార్​కార్డులు తీసుకొని 2005 డిసెంబర్​ 13 నాటికి  సర్వే నెంబర్ల వారీగా ఎంత మేరకు పోడు సాగు చేస్తున్నారు? నాలుగు వైపులా ఏయే రైతులు ఉన్నారనే వివరాలను సేకరించారు.  గ్రామ, డివిజన్​, జిల్లా స్థాయిలో మీటింగుల్లో స్క్రీనింగ్​ ప్రక్రియ కంప్లీట్‌ చేసి కేవలం 205 మందినే లబ్ధిదారులుగా గుర్తించారు. కొందరు లబ్దిదారులకు ఎకరా కంటే తక్కువగా కేటాయిస్తూ 213 ఎకరాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు.  సోమవారం కలెక్టరేట్‌లో137.36 ఎకరాలకు సంబంధించి 128 మందికి మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి పాస్​బుక్స్​ అందించనున్నారు.  

77 పట్టాలు పెండింగ్‌లో

పోడు లబ్ధిదారులుగా గుర్తించిన 205 మందిలో 143 మంది నారాయణపురం మండలానికి చెందిన వారే ఉన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన 41, చౌటుప్పల్​ మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. అయితే సంస్థాన్​నారాయణపురం మండలానికి చెందిన 77 మంది పోడు లబ్ధిదారులకు సంబంధించిన భూముల హద్దుల విషయంలో రెవెన్యూ, పారెస్ట్​ డిపార్ట్​మెంట్ల మధ్య  స్పష్టత రాలేదు. దీంతో  పాస్​బుక్స్ ​రెడీ అయినా 77 పట్టాల పంపిణీ ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.