కరోనా నేపథ్యంలో 10 కోట్ల వరకూ ఎర్లీ ఓటింగ్
పోస్టల్ బ్యాలెట్లలో డెమొక్రాట్ల హవా.. ఫ్రాడ్ జరిగిందన్న ట్రంప్
టైమ్ దాటొచ్చిన బ్యాలెట్లు లెక్కించొద్దు: ట్రంప్
ఆఖరి ఓటు వరకూ లెక్కించాల్సిందే: బైడెన్
6 స్టేట్స్లో కొనసాగుతున్న కౌంటింగ్
బైడెన్ గెల్చుకు న్న స్వింగ్ స్టేట్స్
అరిజోనా, మిన్నెసోటా, న్యూ హాంప్ షైర్
ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ఆపేందుకు వీల్లేదు. ఆఖరి ఓటు వరకూ అన్ని ఓట్లనూ కౌంట్ చేయాల్సిందే. అంతవరకూ మేం వెనక్కి తగ్గేది లేదు. అమెరికా రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కును ఇచ్చింది. ఆ హక్కును పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా ఓపికగా ఉండాలి. అంతిమంగా నేనే విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది. గెలుపును నిర్ణయించేది నేనో.. ట్రంపో కాదు. అది నిర్ణయించాల్సింది ఓటర్లు. నమ్మండి.. ఈ ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం.
ట్రంప్ గెలిచిన స్వింగ్ స్టేట్స్
ఫ్లోరిడా, అయోవా, ఒహాయో, టెక్సాస్
నేను ఈ ఎన్నికల్లో గెలిచేశా. వాస్తవానికి మంగళవారం రాత్రి నేను లీడింగ్ లో ఉన్నా. కీలకమైన స్టేట్స్ లో చాలా ముందంజలో ఉన్నా. కానీ బ్యాలెట్స్ డంప్ చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా అనేక స్టేట్స్ లో లీడింగ్ మాయమైపోయింది. ఇది చాలా విచిత్రం. ‘పోల్ స్టర్స్’ చరిత్రలోనే ఘోరమైన తప్పిదం చేశారు. అమెరికన్ ప్రజలకు మోసం జరిగింది. దీనిపై నేను సుప్రీంకోర్టుకెళ్తా.. గడువు తర్వాత వచ్చిన బ్యాలెట్లను కౌంట్ చేయడమంటే ఫ్రాడ్ చేసినట్లే. దేశాన్ని మోసం చేసినట్టే. మొత్తం కౌంటింగ్‌ను ఆపేయాలి.
అమెరికా ఎన్నికల్లో ఎన్నడూ లేనంత టెన్షన్. ట్రంప్ మళ్లా పీఠం ఎక్కుతడా? లేక జో బైడెన్ దూసుకొస్తడా? ఓట్ల కౌంటింగ్ షురూ అయినప్పటి నుంచి నువ్వా నేనా.. అన్నట్టు ఇద్దరూ పోటీపడుతున్నరు. మొత్తం రిజల్ట్స్ రాకముందే ‘‘నేనే గెలిచిన..’’ అని ట్రంప్ ప్రకటించుకుంటే.. ‘‘గెలిచేది నేనే’’ అని బైడెన్ అన్నడు. 50 రాష్ట్రాలున్న అమెరికాలో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. బుధవారం అర్ధరాత్రి వరకు బైడెన్ 238 దక్కించుకున్నడు. ట్రంప్ 214 గెలుచుకున్నడు. కీలకమైన స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ జోరుమీదున్నడు. అమెరికా ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి 16 కోట్ల మంది ఓటేసిన్రు. కరోనా కారణంగా 10 కోట్ల దాకా పోస్టల్, ఎర్లీ ఓట్లు రావడం పెద్ద కిరికిరికి దారితీసింది. ఎలక్షన్ టైం ముగిసినంక వచ్చిన బ్యాలెట్లను లెక్కించొద్దని ట్రంప్ డిమాండ్ చేస్తుంటే.. ఆఖరి ఓటును కూడా లెక్కపెట్టాల్సిందేనని బైడెన్ పట్టుబడుతున్నడు. మొత్తానికి 270 మ్యాజిక్ ఫిగర్ మార్క్‌ను అందుకునేందుకు ఇద్దరూ ఉరుకుతున్నరు.
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కీలకమైన పలు రాష్ట్రాల కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండగానే.. ‘‘నేను ఎన్నికల్లో ‘గెలిచేశాను..” అంటూ రిపబ్లికన్ క్యాండిడేట్, ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికల్లో ‘‘నేనే గెలుస్తాను..” అంటూ డెమోక్రటిక్ క్యాండిడేట్ జో బైడెన్ ధీమా వ్యక్తంచేశారు. కరోనా కారణంగా ఈ సారి అమెరికా ఎన్నికల్లో ఏకంగా 10 కోట్ల వరకూ ఎర్లీ ఓటింగ్, పోస్టల్, మెయిల్ ఇన్ బ్యాలెట్లు పోల్ కావడంతో పెద్ద దుమారం రేగుతోంది. ఎలక్షన్ డే గడువు దాటొచ్చిన బ్యాలెట్లను కౌంట్ చేయొద్దని ట్రంప్ డిమాండ్ చేస్తుండగా.. ఆఖరి ఓటునూ కౌంట్ చేయాల్సిందేనని బైడెన్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల రేస్ ముగింపు దశకొచ్చేసింది. లోకల్ టైం ప్రకారం.. మంగళవారం ఫైనల్ ఎలక్షన్ డే రోజున ఓటింగ్ పూర్తయి, కౌంటింగ్ షురువైంది. బుధవారం ఉదయం నాటికి మొత్తం 50 రాష్ట్రాల్లో 43 రాష్ట్రాల్లో విజేతలెవరో తేలిపోయింది. మిగతా 7 రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తంగా సస్పెన్స్ వీడేందుకు మరో రోజు పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.
వెనకబడ్డ ట్రంప్..
అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలుండగా, 43 రాష్ట్రాల్లో రిజల్ట్స్ తేలిపోయాయి. బైడెన్ 20 స్టేట్స్ లో, ట్రంప్ 23 స్టేట్స్ లో గెలిచారు. అయితే మొత్తం538 ఎలక్టోరల్ కాలేజ్ వోట్లలో కనీసం 270 వోట్లు గెలుచుకున్న క్యాండిడేట్ ప్రెసిడెంట్ అవుతారు. బుధవారం ఉదయం వరకూ బిడెన్ 238 ఎలక్టోరల్ వోట్లు గెలుచుకోగా.. ట్రంప్ 214 ఎలక్టోరల్ వోట్లతో వెనకంజలో ఉన్నారు. మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఇంకా లక్షలాది ఓట్లు కౌంటింగ్ చేయాల్సి ఉంది. జార్జియా, నెవడా, నార్త్ కరోలినాలోనూ కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. విస్కాన్సిన్ లో బిడెన్ 10 వేల ఓట్లతో లీడ్ లో ఉన్నారు. ఇంకా లక్షలాది ఓట్లు కౌంట్ చేయాల్సి ఉండటంతో శుక్రవారం రాత్రి దాకా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం లేదని చెప్తున్నారు.
దేశాన్ని మోసం చేస్తున్రు..
‘‘గడువు తర్వాత వచ్చిన బ్యాలెట్లను కౌంట్ చేయడమంటే ఫ్రాడ్ చేసినట్లే. మొత్తం వోటింగ్ ను ఆపేయాలి. ఇది దేశాన్నే మోసం చేయడం” అని ట్రంప్ ఆరోపించారు. ప్రతి పోస్టల్ బ్యాలట్ నూ కౌంట్ చేయాలని బైడెన్ డిమాండ్ చేస్తుండగా.. లేట్ వోటింగ్ ను ఆపేయాలంటూ ట్రంప్ సుప్రీంకోర్ట్ కు వెళ్తానని ప్రకటించారు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ట్రంప్ వైట్ హౌజ్ నుంచి మాట్లాడారు. తానే గెలిచానని ప్రకటించుకున్నారు. ‘‘మనం ఈ ఎలక్షన్ గెలిచాం. కౌంటింగ్ ఆపేయాలి. తెల్లవారుజామున 4 గంటల తర్వాత బ్యాలెట్లను కౌంట్ చేసి, లిస్ట్ కు యాడ్ చేయొద్దని మేం కోరుకుంటున్నాం”అని చెప్పారు. కోట్లాది మంది తనకు వోటేశారన్న ట్రంప్ వాళ్లకు థ్యాంక్స్ చెప్పారు. చాలా రాష్ట్రాలు ఎలక్షన్ డే గడువు తర్వాత కూడా మెయిల్ ఇన్ ఓట్లను అంగీకరించాయి. అయితే మెయిల్ ఇన్ వోట్లు డెమోక్రాట్లకు అనుకూలంగా ఉంటుండటంతో ఎలక్షన్ డే గడువు దాటి వచ్చిన వోట్లను కౌంట్ చేయరాదంటూ ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. తమకు అనుకూలంగా వోట్లు వస్తుండటంతో.. ఆఖరి వోటు వరకూ కౌంట్ చేయాల్సిందేనంటూ బైడెన్ టీమ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. బైడెన్ కూడా మంగళవారం అర్ధ రాత్రి దాటాకా మాట్లాడారు. ప్రజలంతా ఓపికగా ఉండాలని కోరారు. ఫ్లోరిడా, ఒహాయో, టెక్సాస్ రాష్ట్రాల్లో ఓడిపోయినా.. చివరికి తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బైడెన్ మోసపూరితంగా గెలవాలనుకుంటున్నారంటూ ట్రంప్ వెంటనే ట్వీట్ చేయగా.. ‘మిస్ లీడింగ్’ ట్వీట్ గా దానిని ట్విట్టర్ ఫ్లాగ్ చేసింది.
రిజల్ట్స్ ఎప్పుడూ లేటే..
యూఎస్ ఎలక్షన్ హిస్టరీలో పోల్స్ క్లోజ్ చేయగానే రిజల్ట్స్ ఎప్పుడూ రాలేదు. మెయిల్ ఇన్ వోట్లు భారీగా రావడం, వాటి కౌంటింగ్ కు టైం పట్టడమే ఇందుకు కారణం. ఈసారి కరోనా వ్యాప్తి కారణంగా దాదాపు 10 కోట్ల మంది ఎర్లీ ఓటింగ్ లో ఓట్లు వేశారు. దీంతో కౌంటింగ్ కు మామూలు కన్నా ఎక్కువ టైం పడుతుండటంతో రిజల్ట్స్ లేటవుతున్నాయి.
కీలక రాష్ట్రాల్లో టఫ్ ఫైట్
20 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో బుధవారం ఉదయానికి ట్రంప్ ముందంజలో ఉన్నారు. కీలకమైన మిషిగన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా స్టేట్స్ లో కౌంటింగ్ కొనసాగుతున్నందున ట్రంప్, బైడెన్ మధ్య పోటీ టఫ్ గా ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. కౌంటింగ్ పూర్తయ్యేందుకు ఆలస్యం కానుండటంతో బుధవారం రాత్రికి కూడా అమెరికన్లకు తమ ప్రెసిడెంట్ ఎవరో తెలిసే చాన్స్ లేదని తెలిపింది. ఇక కరోనాకు ఎపిసెంటర్ గా మారిన న్యూయార్క్ లో బైడెన్ ఏకంగా 22 లక్షల వోట్లు గెలవగా, ట్రంప్ 12 లక్షల ఓట్లనే పొందగలిగారు. 2016 ఎలక్షన్ డే రోజు రాత్రి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల క్యాడర్ లు, మద్దతుదారులు భారీగా పోగయ్యారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి తారుమారైంది. కరోనా కారణంగా టైమ్స్ స్క్వేర్ ఏరియా వెలవెలబోయింది. ప్రజలంతా చాలా వరకూ ఇళ్లకే పరిమితమయ్యారు.
120 ఏళ్లలో రికార్డ్ ఓటింగ్..
ఈసారి అమెరికా ఓటర్లు రికార్డ్ స్థాయిలో ఓట్లేశారు. 120 ఏళ్లలోనే అత్యధికంగా 16 కోట్ల మంది ఓటేశారు. అయితే దేశవ్యాప్తంగా ఇంతమంది ఓట్లేయడం, ఓటర్లు రెండుగా విడిపోయి ఓట్లు వేసినందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంచనా వేస్తున్నారు. దీంతో ఆరిజోనా, జార్జియా, విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా ఓటర్లు కీలకంగా మారారు. ప్రధానంగా మెయిల్ ఇన్ ఓట్స్ (పోస్టల్ ఓట్స్) చాలా కీలకంగా మారాయి.
ప్రెసిడెంట్‌ను నిర్ణయించే ‘స్వింగ్‌స్టేట్స్’
అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో గెలుపు, ఓటములను మార్చేస్తాయి. ఇక్కడి జనం వేసే ఓట్లే దేశానికి కాబోయే ప్రెసిడెంట్ ను నిర్ణయిస్తాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాలు డెమోక్రాట్లకు, మరికొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్లకు ప్రతీసారీ మద్దతుగా నిలుస్తాయి. ఆయా పార్టీల అనుకూల రాష్ట్రాలుగా వాటిని చెప్పొచ్చు. పన్నెండు రాష్ట్రాలు మాత్రం ఒక ఎన్నికలో డెమోక్రాట్లకు మద్దతు పలికితే, తర్వాతి టర్మ్‌లో రిపబ్లికన్లకు మద్దతు పలకొచ్చు. గడిచిన నాలుగేళ్ల పాలనలో అధికార పార్టీ పనితీరు, క్యాండిడేట్ల బలాబలాలు, బలహీనతలు, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ రాష్ట్రాల ప్రజలు ఓటేస్తారు. వీటినే స్వింగ్‌స్టేట్స్ అంటారు. ఈ పన్నెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ మెజారిటీ సాధిస్తే ఆ పార్టీ కేండిడేటే ప్రెసిడెంట్సీట్లో కూర్చునే అవకాశాలు ఉంటాయి. స్వింగ్ స్టేట్స్ లోని అరిజోనా, మిన్నెసోటా, న్యూహ్యాంప్ షైర్ రాష్ట్రాల ప్రజలు ఈసారి డెమోక్రాట్లకు మద్దతిచ్చారు. ఫ్లోరిడా, టెక్సస్, ఒహాయో, అయోవా రాష్ట్రాల ఓటర్లు ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న మిషిగన్, విస్కాన్సిన్, నెవడా రాష్ట్రాల్లో బైడెన్ లీడ్ లో కొనసాగుతున్నారు. జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, అలస్కా స్టేట్స్ లో ట్రంప్ లీడింగ్ లో ఉన్నారు.
మా లీగల్ టీమ్‌లూ రెడీ..
కోర్టుకెళ్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటనకు బైడెన్ టీమ్ కూడా దీటుగా బదులిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ఆపేందుకు వీల్లేదని తేల్చిచెప్పింది. ఆఖరి ఓటు వరకూ అన్ని ఓట్లనూ కౌంట్ చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. అమెరికా రాజ్యాంగం ప్రతి పౌరుడికి వోటేసే హక్కును ఇచ్చిందని, ఆ హక్కును పరిరక్షించాల్సిన అవసరం ఉందని బైడెన్ క్యాంపెయిన్ మేనేజర్ జెన్నిఫర్ డిల్లాన్ అన్నారు. ‘‘ఎలక్షన్ డేకు ముందే దాదాపు10 కోట్ల మంది వోట్లేశారు. వాళ్లందరి ఓట్లనూ లెక్కించాల్సిందే. ప్రతి ఓటునూ కౌంట్ చేస్తామంటూ ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు ఓటర్లకు ఇచ్చిన హామీలను ఇప్పుడు చెల్లకుండా చేయాలని ట్రంప్ అంటున్నారు. ఒకవేళ కౌంటింగ్ ఆపాలంటూ ఆయన కోర్టుకు వెళితే.. కోర్టులో ఆయనను అడ్డుకునేందుకు మేం కూడా మా లీగల్ టీమ్స్ తో రెడీగా ఉన్నాం” అని ఆమె వెల్లడించారు.
For More News..