ఆదిలాబాద్లో ఎవరు గెలిచినా చరిత్రే..సక్కు, సుగుణకు ఫస్ట్ టైం.. బీజేపీకి హ్యాట్రిక్ చాన్స్

  •      ముగ్గురు అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు నిర్దేశించనున్న రిజల్ట్స్ 
  •       పార్లమెంట్‌స్థానం గెలుపుపై ఎవరి ధీమాలో వారు
  •      ఎన్నికలు ముగిసిన పార్టీల మధ్య ఆగని లొల్లి 

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈ సారి చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఎప్పుడు భిన్నమైన తీర్పునిచ్చే ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గు చూపారనేది అభ్యర్థులను టెన్షన్ పుట్టిస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ చరిత్రలోనే అన్ని విషయాల్లో ఈ ఎన్నికలు ప్రత్యేకతను కనబర్చాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు అభ్యర్థి ఎంపిక.. ఓటింగ్ ప్రక్రియ వరకు పార్లమెంట్ పరిధిలో ఆయా  పార్టీల్లో ఏదో ఒక్క కొత్తదనం కనిపించింది. ప్రధాన పార్టీలు ఈ సారి ముగ్గురు ఆదివాసీలను బరిలో దించడం మొదటిసారి కాగా..

అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళ అభ్యర్థి పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇలా అభ్యర్థుల ఎంపికనే కాదు.. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు గెలిచిన అదొక సంచలనంగా మారనుంది. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జిల్లాలో సైతం పార్లమెంట్ ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికలు ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. మూడు పార్టీలు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, మెజార్టీ ఎంత వస్తుందనే దానిపై సైతం చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయా బూత్ ల వారీగా ఓటర్ల ఎటువైపు మొగ్గు చూపారనే దానిపై పార్టీలు కింది స్థాయి కార్యకర్తలతో రిపోర్టు తెచ్చుకొని ఆరా తీస్తున్నారు. 

ఎన్నికలు ముగిసిన పార్టీల మధ్య ఆగని లొల్లి..

ఇదిలా ఉంటే ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ముగిసి నాలుగు రోజులు గడుస్తున్న రాజకీయ పార్టీల మధ్య లొల్లి ఆగడం లేదు. ఎన్నికల తర్వాత మూడు పార్టీలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశాయి. మూడు పార్టీలు కూడా తాము లక్ష మెజార్టీతో విజయం సాధిస్తున్నామంటూ చెప్పుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం విషయంలో ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు తీవ్ర వివాదానికి దారీతీశాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ మాజీ నేతలు సుజాత

సంజీవ రెడ్డిలు బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయంటూ ఆయన చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం లేపాయి. తమ మున్నూరు కాపు మహిళ సుజాత పట్ల అనుచితంగా మాట్లాడి కించపర్చారంటూ కంది శ్రీనివాస్ కు వ్యతిరేకంగా మున్నూరు కాపులు నిరసన తెలిపారు. అటు కాంగ్రెస్ శ్రేణులు సైతం మాజీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ కంది తీవ్రమైన ఆరోపణలు చేయడం హాట్ టాపిగ్ గా మారింది. అటు మాజీ ఎమ్మెల్యే జోగురామన్న సైతం బీజేపీ

కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు డబ్బులు, మద్యం వెదజల్లాయంటూ ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు ఎన్నికల కోసం  వ్యాపారుల నుంచి వసూళ్లు చేశారంటూ విమర్శలు చేశారు. ఇలా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయా పార్టీల మధ్య గొడవలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. 

ఎవరు గెలిచిన చరిత్రే..

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ముగ్గురు అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన ఆత్రం సుగుణ గెలిస్తే ఆదిలాబాద్ మొదటి మహిళ ఎంపీ గానే కాకుండా పోటీచేసిన మొదటి సారే  గెలిచిన నేతగా  నిలుస్తారు. ఇదిలా ఉంటే 1989 లో గెలిచిన కాంగ్రెస్  ఆ తర్వాత 1991లో ఉప ఎన్నికలు రావడంతో టీడీపీ గెలిచింది. అప్పటి నుంచి 18 ఏళ్లు కాంగ్రెస్ ఎంపీ స్థానాన్ని  గెలవలేదు. మళ్లీ 2008 ఉప ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఏడాది పాటు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత 2009 టీడీపీ, 2014 బీఆర్ఎస్, 2019 లో బీజేపీ గెలిచాయి.

ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే 15 ఏళ్లకు పదవి దక్కించుకొని చరిత్రలో నిలిచిపోనుంది. మరోపక్క బీజేపీ అభ్యర్థి గొడం నగేశ్ గెలిచిన చరిత్రే కానుంది. 20 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ ఓటర్లు ఏ పార్టీకి రెండు సార్లు వరుసగా విజయాలు ఇవ్వలేదు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బీజేపీదే కావడం.. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే 20 ఏళ్ల చరిత్రను తిరగరాయనుంది. ఇదే కాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ లో చేరిన సోయం ఎంపీగా గెలిచారు. ఇప్పుడు గొడం నగేశ్ సైతం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి ఎంపీ గా పోటీలో నిలిచారు. ఒకవేళ గెలిస్తే పార్టీలో చేరిన వెంటనే గెలిచిన అభ్యర్థిగా నగేశ్ మిగిలిపోతారు.

అటు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సక్కు సైతం రెండు సార్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈ సారి బీఆర్ఎస్ నుంచి మొదటి సారి ఎంపీగా పోటీ చేశారు. దీంతో సక్కు గెలిచినప్పటికి మొదటి ప్రయత్నంలోనే ఎంపీ అయిన రికార్డులోకి ఎక్కుతారు. ఇలా ఈ సారి ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలు మొత్తం కూడా చరిత్రలో లిఖించదగ్గ ప్రత్యేకతను చాటుకోనున్నాయి.