యూనివర్సిటీల టీచింగ్​ స్టాఫ్​ రిటైర్మెంట్​ వయసు పెంచాలె

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.45ను నిరుడు మార్చి 30న జారీ చేసింది. ఈ జీవోకు కొనసాగింపుగా ఆర్థిక శాఖ ఏప్రిల్ 4న ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలలో, కార్పొరేషన్ లలో, యూనివర్సిటీల నాన్ టీచింగ్, అన్ని విద్యాసంస్థల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పెంచుతున్నట్టు ఒక సర్క్యులర్​ను జారీ చేసింది. అన్ని శాఖల్లో పదవీ విరమణ వయసు పెంచుతున్నట్టే పెంచారు. కానీ యూనివర్సిటీల్లో పనిచేసే టీచింగ్ స్టాఫ్​కు మాత్రం పెంచలేదు. దీంతో రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న టీచింగ్ ఉద్యోగుల్లో నిరాశ నిస్పృహలు కమ్ముకున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వర్సిటీల టీచింగ్​ స్టాఫ్​ వయసు 60 నుంచి 65 ఏండ్లకు పెంచారు.

రాష్ట్రం మొత్తంలో మూడు లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. అత్యధికంగా ఒక లక్షకు పైగా పనిచేసేది విద్యాశాఖలోనే. ఇటువంటి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవైపు ఉద్యోగులు పదవీ విరమణ పొందుతూ ఉంటే మరొక వైపు రిక్రూట్​మెంట్ లేక పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఈ సమయంలో పదవీ విరమణ వయసు పెంచడం కొంత మేలు చేసేదే అయినా..  కేవలం యూనివర్సిటీల్లో పనిచేస్తున్న టీచర్లకు మాత్రమే పదవీ విరమణ వయసును పెంచక పోవడం సరికాదు. ప్రస్తుతం యూనివర్సిటీల్లోని కొన్ని విభాగాల్లో పాఠాలు చెప్పడానికి టీచింగ్ స్టాఫ్ లేని పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీలకు న్యాక్, ఎన్​బీఏ గుర్తింపు రావాలన్నా, యూజీసీ, ఐసీఎస్​ఎస్​ఆర్​, సీఎస్​ఐఆర్​ల నుంచి పరిశోధన, యూనివర్సిటీల అభివృద్ధి కోసం నిధులు రావాలన్నా యూనివర్సిటీల్లో తగినంత టీచింగ్ స్టాఫ్ అవసరం అవుతుంది. యూనివర్సిటీల్లోని  ప్రొఫెషనల్ కోర్సుల గుర్తింపు కోసం పనిచేస్తున్న యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్​సీఈఆర్​టీ పీసీఐ లాంటి సంస్థల నియంత్రణ దెబ్బతిని, సరైన సంఖ్యలో బోధనా సిబ్బంది లేకుంటే యూనిర్సిటీల్లో నాణ్యమైన బోధన, పరిశోధన కుంటుపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రతి యూనివర్సిటీ రిక్రూట్​మెంట్​లకు సంబంధించి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులు తేలితేనేగాని మళ్ళీ టీచింగ్ పోస్టుల రిక్రూట్​మెంట్​ జరిగే పరిస్థితి కనబడటం లేదు. ఆ కేసులు తేలేదెన్నడు? ఇక రిక్రూట్​మెంట్ జరిగేదెన్నడు.? పదవీ విరమణ వయసును పెంచితే కొంతలో కొంతైనా పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్లు ఉంటారు.

పదవీ విరమణ వయసు పెంచాలి..

పదవీ విరమణ వయసును పెంచకపోవడం వలన రాష్ట్రంలోని విద్యాశాఖ పరిధిలో గల మొత్తం విశ్వవిద్యాలయాల్లో 2020 బోధనా సిబ్బంది ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి స్థానంలో భర్తీ ప్రక్రియ మొదలు పెట్టాలంటే యూనివర్సిటీ చట్టాల సవరణపై ఆర్డినెన్స్ తీసుకురావాలి. అన్ని విధానాలు పూర్తయినా కూడా కేసులు కొలిక్కి రాకపోవడంతో మళ్లీ భర్తీ ప్రక్రియ ఆగే అవకాశం ఉంది. 

స్టూడెంట్స్​కు నష్టం

యూనివర్సిటీలు పరిశోధన, బోధనలకు కేంద్రాలుగా ఉండి, ఉన్నత విద్య అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రస్తుతం యూనివర్సిటీ బోధన సిబ్బంది పదవీ విరమణ వయసును పెంచడమే మార్గంగా తోస్తుంది.  పదవీ విరమణ వయస్సును పెంచని కారణంగా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కొన్ని విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్​ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి కొన్ని విభాగాల్లో అయితే కేవలం ఒకే ఒక ప్రొఫెసర్​తో పాఠాలు నడుస్తున్నాయి.  స్టూడెంట్స్​ నష్ట పోకుండా ఉండేందుకు ప్రస్తుతం ఆయా విభాగాల్లో ఒప్పంద, పార్ట్ -టైం అధ్యాపకులు పనిచేస్తున్నారు. పరిశోధన, బోధనకు ముఖ్య కేంద్రాలైన యూని వర్సిటీల్లో పార్ట్-టైం,  ఒప్పంద అధ్యాపకుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల వీరికి పరిశోధన అవకాశాలు లేక యూనివర్సిటీల్లో పరిశోధన పూర్తిగా పడిపోయే దశకు చేరుకుంది. ఎలాగో వీరికి పరిశోధనా అవకాశాలను కల్పించడానికి నియమ నిబంధనలు అడ్డు వస్తున్న తరుణంలో రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచక పోవడం వల్ల పూర్తిగా పరిశోధనలు ఆగిపోయిన పరిస్థితి యూనివర్సిటీల్లో నెలకొంది. అంతేకాకుండా పనిచేస్తున్న బోధనా సిబ్బందిలో కూడా అభద్రతా భావం ఏర్పడుతోంది.

యూనివర్సిటీలను కాపాడాల్సిన బాధ్యత..

దేశంలోని పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, పాండిచ్చేరి, ఢిల్లీ, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే యూనివర్సిటీల్లోని టీచింగ్ వాళ్ల పదవీ విరమణ వయసును 60 నుంచి 65 కు పెంచారు. అంతే కాకుండా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మిజోరం, గోవా తదితర రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏండ్లకు పెంచారు. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ ​కాలేజీల్లో పని చేసే టీచింగ్ స్టాఫ్ కు మాత్రమే పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏండ్లకు పెంచింది. మరి మన పక్క రాష్ట్రాల వారు యూనివర్సిటీ టీచింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచగా మన రాష్ట్రంలో ఎందుకు పెంచకూడదు? పరిశోధన, బోధనా కేంద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం చేపట్టి వెంటనే యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచాలి. దేశంలో ఇతర  రాష్ట్రాల వర్సిటీలకు తీసిపోకుండా మన రాష్ట్ర వర్సిటీలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 
- డా. మామిడాల ఇస్తారి, 
అసోసియేట్ ప్రొఫెసర్​, 
కాకతీయ యూనివర్సిటీ.