
గుడిసెలు పీకేసిన్రు
జేసీబీలతో పొద్దున్నే అధికారుల నిర్వాకం
అడ్డుకున్న వారిని నెట్టేసిన పోలీసులు
పిల్లలతో ఎక్కడికి వెళ్లమంటారని ప్రశ్నిస్తున్న గుడిసె వాసులు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత
మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలో నివసిస్తున్న పేదల ఇండ్లను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మంగళవారం (జూన్ 13న) ఉదయం తొలగించారు. దీంతో అక్కడకు వచ్చిన అధికారుల ఎదుట నిరాశ్రయులైన వారంతా ఆందోళనకు దిగారు. మా ఇండ్లను ఎలా తొలగిస్తారంటూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు నెట్టి వేయడంతో స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు జేసీబీలపైకి ఎక్కి ఆందోళన చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో 255/1 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూములు న్నాయి. ఈ ఆస్థలంలో డేరాలు వేసుకుని కొందరు జీవనం సాగిస్తున్నారు. ఒక్కసారిగా వచ్చి ఇళ్లను తీసివేస్తే తమ పరిస్థితి ఏంటని అక్కడ నివాసముంటున్న వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
పిల్లలతో తాము ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ప్రభుత్వ స్థలమని ఇందులో నివసించడానికి అనుమతి లేదంటూ అధికారులు వారికి తెలిపారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు వారిని నెట్టివేసి గుడిసెలను జేసీబీల సాయంతో తొలగించారు. డేరాలు తొలగించే సమయంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు గుడిసె వాసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.