అనుకున్నది రూ.37 వేల కోట్లు.. వచ్చింది రూ.28 వేల కోట్లే

  • మొదటి 3 నెలల్లో 9,300 కోట్లు తగ్గిన రెవెన్యూ రాబడి
  • గతేడాదితో పోలిస్తే రూ.4 వేల కోట్లు తక్కువ 
  • రాష్ట్రంలో స్కీముల అమలు కోసం అప్పులు, భూములమ్మక తప్పని పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి రావాల్సిన సొంత ఆదాయం భారీగా తగ్గింది. రెవెన్యూలో దేశంలోనే ముందున్నామని ఇన్నాళ్లుగా చెప్పుకొస్తున్న ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో రాష్ట్రానికి రావాల్సిన సొంత ఆదాయం ఆశించిన మేర రాలేదు. రాష్ట్ర సర్కారు అంచనా ప్రకారం ఏప్రిల్, మే, జూన్​ నెలల్లో రూ.37,500 కోట్లు రావాల్సి ఉండగా.. రూ.28,200 కోట్లు మాత్రమే సొంత రాబడి వచ్చింది. 

దీంతో రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం రూ.9300 కోట్లు తగ్గినట్లయింది. కిందటేడాదితో పోలిస్తే మరింత తగ్గింది. 2022–23 ఫైనాన్స్​ ఇయర్​ మొదటి 3 నెలల్లో వచ్చిన మొత్తం రెవెన్యూ రూ.32,000 కోట్లుగా ఉన్నది. అంటే, ఈ ఏడాది ఏకంగా రూ.4 వేల కోట్లు తగ్గినట్లయింది. 

రియల్ బూమ్ తగ్గడంతోనే.. 

రాష్ట్రంలో రియల్ భూమ్ తగ్గడంతో రిజిస్ట్రేషన్స్​ అండ్​ స్టాంప్స్​ ఆదాయం తగ్గింది. దీంతో పాటు ఆబ్కారీ నుంచి కూడా ఆశించినంత రాబడి రాలేదు. ఇంకోవైపు ప్రభుత్వ భూముల అమ్మకాలు కూడా తగినంతగా జరగకపోవడంతో స్టేట్​ ఓన్​ రెవెన్యూ పడిపోయినట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీంతో స్కీములకు నిధుల కటకట వెంటాడుతున్నది. ఆసరా లాంటి రెగ్యులర్​ స్కీం పంపిణీకి కూడా రెండు నెలల టైం పడుతోంది. మిగిలిన పథకాలు ఆర్భాటంగా ప్రకటించినా.. అవి ముందుకు కదలకపోవడం వెనక నిధుల సమస్యనే ఉన్నది. 

ఇదే విషయమై సీఎం కేసీఆర్​ కూడా సీరియస్​ అయినట్లు తెలిసింది. అధికారులు ఏం చేస్తున్నారని, రాబడి పెంచాల్సింది పోయి.. ఎలక్షన్​ టైంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారేంటని ఉన్నతాధికారులపై ఫైర్ అయ్యారు. లిక్కర్​ సేల్స్​ పెంచడంతో పాటు  భూముల అమ్మకం, ఓఆర్​ఆర్​ టెండర్​ సొమ్మును వెంటనే రాబట్టుకునే ప్లాన్​ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

ALSO READ :ఇవాళ్టి నుంచి 23 వరకు పలు రూట్లలో రైళ్లు రద్దు.. 

ఆబ్కారీ ఆదాయం కూడా తక్కువే

ప్రభుత్వ అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతినెలా సగటున 12,500 కోట్లు రావాల్సి ఉంది. అయితే, మొదటి 3 నెలలు సగటున రూ.9 వేల కోట్లు మాత్రమే వచ్చిం ది. మొదటి నెలలో రూ.9,111 కోట్లు రాగా.. మే నెలలో రూ.9,400 కోట్లు, జూన్​లో రూ.9,600 వేల కోట్లు వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. పోయినేడాది ఇదే సమయంలో మొదటి రెండు నెలలు రూ.9 వేల కొట్ల చొప్పున రాగా.. జూన్​లో రూ.14,200 కోట్లు వచ్చినట్లు అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్​ చేశారు. ప్రస్తుతం, ఆర్బీఐ నుంచి అప్పులు.. కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్లు, ఇతర నాన్​ టాక్స్​ రెవెన్యూతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితుల ను పట్టించుకోకుండా అంచనాలు అధికంగా వేసుకోవడంతోనే ఈ సమస్య వచ్చినట్లు  తెలిసింది. 

స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ల​ నుంచి నెలకు యావరేజ్​గా రూ.1,500 కోట్ల చొప్పున వస్తుందని టార్గెట్​ పెట్టుకున్నారు. అయితే, ప్రతినెలా యావరేజ్​గా వస్తున్నది రూ.1,100 కోట్లే ఉంటున్నది. ఆబ్కారీ శాఖ ఆదాయం కూడా వ్యాట్​ కాకుండా ప్రతినెలా టార్గెట్ రూ.1800 కోట్లు ఉండగా.. ప్రతినెలా రూ.400 కోట్ల మేర తక్కువే వచ్చింది. జీఎస్టీ, ఇతరత్రా సేల్స్​ టాక్స్​ కూడా అనుకున్నదానికంటే తక్కువే వస్తోంది. 

స్కీముల కోసం అప్పులే దిక్కు?

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములు కొంతైనా సాఫీగా సాగాలంటే అప్పులయినా చేయాలి లేదంటే భూములైనా అమ్మాలనే పరిస్థితి నెలకొంది. అప్పుల విషయంలో కేంద్రం, ఆర్బీఐ పరిమితులమేరనే అనుమతిస్తున్నాయి. ఏకకాలంలో భూములు అమ్మి.. సొమ్ము చేసుకునే వెసులుబాటు కూడా లేదు. దీంతో రాష్ట్రంలో ఏ స్కీమ్​ను కూడా పూర్తిస్థాయిలో అమలు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. అందులో భాగంగానే ప్రతి స్కీమ్​ను దశలవారీగా ఇస్తం, అమలు చేస్తం అని మంత్రులు ప్రకటనల్లో చెప్తున్నారు. 

బీసీల్లో చేతి వృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం, దళితబంధు, గృహలక్ష్మి వంటి స్కీములు అంతకంతకు ఆలస్యం అవుతున్నాయి. ఆసరా పించన్లు కూడా ఒక నెల ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారు. దివ్యాంగులకు రూ.4 వేలు ఇస్తమని ప్రకటించినా.. అది ఇంకా మొదలు కాలేదు. రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ఏకంగా రూ.20 వేల కోట్లు ఎట్ల తీసుకురావాలనేది ఆగమ్యగోచరంగా మారింది. ఇటీవల ఓఆర్ఆర్​ టెండర్ కు ఇవ్వడంతో.. దానికింద దాదాపు రూ.7300 కోట్లు రావాల్సి ఉన్నది. దీంతో ఈ మొత్తాన్ని తొందరగా సదరు కంపెనీ నుంచి ప్రభుత్వ ఖాజానాకు సొమ్ము జమ చేసేలా ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నది.