- బోర్ సీజ్ చేయడం, ఆర్ఐ దురుసు ప్రవర్తనే కారణం
- నల్గొండ జిల్లా గుర్రంపోడులో ఘటన
హాలియా, వెలుగు : సమస్య పరిష్కరించాలని నల్గొండ జిల్లా గుర్రంపోడులోని తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లిన రైతుతో ఆర్ఐ దురుసుగా ప్రవర్తించడంతో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని తెరాటిగూడెం గ్రామానికి చెందిన కసిరెడ్డి చిన మల్లారెడ్డికి, ఇతడి అన్న రామకృష్ణా రెడ్డికి మధ్య కొంత కాలంగా భూ వివాదాలున్నాయి. రామకృష్ణా రెడ్డి తన భూమిలో ఏడాది కింద బోరు వేశాడు. ఈ బోరు సమీపంలోనే తమ్ముడు మల్లారెడ్డి బోరు వేయడంతో వాల్టా చట్టానికి విరుద్ధంగా వేశాడని 15 రోజుల కింద రామకృష్ణా రెడ్డి ఆర్ఐ మురళీ కృష్ణకి ఫిర్యాదు చేశాడు.
దీంతో ఆర్ఐ వారం కింద చిన మల్లారెడ్డి బోరు సీజ్ చేశాడు. దీంతో తన పొలాలు, తోట ఎండిపోతున్నాయని, తన బోరును ఎందుకు సీజ్ చేశారని ఆర్ఐ మురళీ కృష్ణని గురువారం సాయంత్రం తహసీల్దార్ఆఫీసుకు వెళ్లి నిలదీశాడు. దీంతో తననే ప్రశ్నిస్తావా అంటూ ఆర్ఐ రైతు మల్లారెడ్డితో కొంత దురుసుగా ప్రవర్తించాడు. అప్పటికే బోరు సీజ్ చేసి ఉండడం, ఆర్ఐ దురుసు ప్రవర్తనతో మనస్తాపానికి గురైన మల్లారెడ్డి తహసీల్దార్ ఆఫీసు ఎదుట వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అక్కడున్న సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్సై శివ ప్రసాద్ వచ్చి రైతును జిల్లా దవాఖానకు తరలించారు.