పోడు పట్టాల దందా

పోడు పట్టాల దందా

పోడు పట్టాల దందా
లీడర్లు, ఆఫీసర్ల కుమ్మక్కు.. ప్రభుత్వ 
ఉద్యోగులకు, నాన్​ ట్రైబల్స్​కూ హక్కు పత్రాలు
ఎఫ్ఆర్సీ అప్రూవల్ లేకుండా నేరుగా అర్హుల లిస్టు 
ఎకరానికి రూ. 50 వేల దాకా వసూలు
మహబూబాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో బయటపడ్డ అక్రమాలు
నష్టపోతున్న అర్హులు.. న్యాయం కోసం ఆందోళనలు

మహబూబాబాద్/నిర్మల్​, వెలుగు : పోడు సాగు చేసుకుంటున్న ట్రైబల్స్​కు అందాల్సిన పోడు హక్కు పత్రాలు అనర్హుల పాలవుతున్నాయి. కొందరు నాయకులు, అధికారులు కుమ్మక్కై నాన్​ట్రైబల్స్​కు, గవర్నమెంట్​ ఎంప్లాయీస్​కు, లీడర్ల బినామీలకు పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఇందుకోసం ఎకరాకు రూ. 50 వేలు, ఆపైనే తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు దక్కాల్సిన హక్కు పత్రాలు అనర్హులకు ఇచ్చారంటూ పలు చోట్ల అర్హులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా మహబూబాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో పోడు పట్టాల దందా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్​లో ఫారెస్ట్​ ఆఫీసర్లే ఈ అక్రమాలను గుర్తించగా..  నిర్మల్​ జిల్లాలోనైతే ట్రైబల్స్​ ఫిర్యాదుతో కలెక్టర్​ ఎంక్వైరీ చేయించగా దందా బయటపడింది. 

అప్లికేషన్లు పెట్టుకోనోళ్లకూ ఇచ్చేశారు

మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండ లంలో  పోడు పట్టాల కోసం అప్లికేషన్​ పెట్టుకోనివాళ్ల పేర్ల మీద కూడా పట్టాలు మంజూరయ్యాయి. తహసీల్దార్​ ఆఫీసులో పని చేస్తున్న ధరణి ఆపరేటర్ కొంతమంది ఆఫీసర్ల సహకారంతో ఈ దందాకు తెరలేపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్​ఆర్సీల అప్రూవల్​ లేకుండానే అర్హుల లిస్టు తయారైనట్టు తెలుస్తున్నది. 


ఈ మండలంలో  1,789 మంది అనర్హులకు పోడు పట్టాలు వచ్చినట్టు ఫారెస్ట్​ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మండల పరిధిలో 6,990 మంది గిరిజన రైతులు 2,0281.43 ఎకరాల్లో పోడు భూముల పట్టాల కోసం అప్లికేషన్లు పెట్టుకోగా.. 6,114 మంది రైతులకు 1,9465.14 ఎకరాలకు సంబంధించి పట్టాలు మంజూరయ్యాయి.  మరో 307 మందికి  సంబంధించిన 374.55 ఎకరాల భూమి పట్టాలు పెండింగ్​లో ఉన్నాయి. పట్టాలు మంజూరైనవాళ్ల జాబితాలో టీచర్లు, గవర్నమెంట్​ ఎంప్లాయీస్​ ఉన్నట్లు బయట పడింది. దీంతో కొందరు అనర్హుల పట్టాలను ఉన్నతాధికారులు పంచకుండా ఆపేశారు. మండలంలో కొందరు దళారులు అనర్హులకు పట్టాలు ఇప్పించేందుకు ఎకరానికి రూ. 50 వేల వరకు వసూలు చేసినట్లు, రెవెన్యూ, ఫారెస్ట్​ ఆఫీసర్లకు ముడుపులు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

టీచర్లకు, బీట్​ ఆఫీసర్​కు పట్టాలు 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓ  గ్రామంలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లకు పోడు  పట్టాలు వచ్చాయి. మరో గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులైన భార్యభర్తలిద్దరికీ పోడు హక్కు పత్రాలు అందాయి. భర్త ప్రభుత్వ టీచర్​ కాగా.. భార్య ఫారెస్ట్​ బీట్ ఆఫీసర్. ప్రభుత్వ ఉద్యోగులు  పోడు పట్టాల కోసం అప్లై చేసుకోవడమే తప్పు. ఒక వేళ చేసుకున్నా.. పరిశీలనలో అధికారులు తిరస్కరించాలి. కానీ, ధరణి ఆపరేటర్​ పుణ్యమా అని ప్రభుత్వ ఉద్యోగులకూ పట్టాలు ఇవ్వడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో ప్రస్తుతానికి ఆ ఉద్యోగులకు పట్టాలను పంచకుండా ఆపేశారు.

డ్యాంగాపూర్​లో నాన్​ ట్రైబల్స్​కు 

నిర్మల్​జిల్లాలో పోడు భూముల హక్కుపత్రాల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ట్రైబల్స్​ అంటున్నారు. అర్హులను పక్కనపెట్టి, అనర్హలకు పట్టాలిచ్చారని ఆరోపిస్తూ బాధితులు కలెక్టరేట్​కు క్యూ కడ్తున్నారు. తమ గ్రామంలో గిరిజనులను కాదని బీసీలు, ఎస్సీలకు పోడు హక్కుపత్రాలు ఇచ్చారంటూ మంగళవారం నిర్మల్​ మండలం డ్యాంగాపూర్ కు చెందిన గిరిజనులు జిల్లా కలెక్టర్​వరుణ్ ​రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆర్డీవోతో ఎంక్వైరీ చేయించగా, అక్రమ బాగోతం బట్టబయలైంది. డ్యాంగాపూర్​లో 20 ఎకరాల పోడు భూములకు ఇటీవల హక్కు పత్రాలు అందజేశారు. పట్టాలు అందుకున్న ఆరుగురిలో ముగ్గురు నాన్ ట్రైబల్స్ కావడంతో వివాదం రాజుకుంది. గిరిజనేతరులకు పోడు పట్టాలపై రాష్ట్ర సర్కారు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మొదటి విడత రాష్ట్రంలో ఎక్కడా నాన్​ట్రైబల్స్​కు హక్కు పత్రాలు ఇవ్వలేదని ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ, డ్యాంగాపూర్​లో ఏకంగా ఇద్దరు బీసీలకు రెండు ఎకరాల చొప్పున, ఒక ఎస్సీకి ఎకరం భూమి తాలూకు హక్కు పత్రాలు అందజేశారు. మిగిలిన ముగ్గురు ఎస్టీల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి 11 ఎకరాలు కేటాయించారు. మరో ఎస్టీకి నాలుగు ఎకరాలు ఇచ్చారు. 


సుమారు 20 మంది వరకు అర్హులైన గిరిజనులను పక్కన పెట్టడంతో వారంతా కలెక్టర్​కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కలెక్టర్.. ఆర్డీవోతో ఎంక్వైరీ చేయించగా, నాన్​ ట్రైబల్స్​కు హక్కు పత్రాలు వచ్చింది నిజమేనని తేలింది. దీంతో హుటాహుటిన ఆ ముగ్గురు నాన్ ట్రైబల్స్ నుంచి హక్కు పత్రాలను వెనక్కి తీసుకొని.. జిల్లా గిరిజన సంక్షేమ అధికారికి అప్పగించారు. నిబంధనల ప్రకారం.. అధికారులు తమకు అందిన అప్లికేషన్ల ద్వారా ఫీల్డ్​ లెవల్​లో సర్వే చేసి అర్హులను మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది. కానీ లోకల్​గా ఉన్న  పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్ సిబ్బందికి ఎంక్వైరీ బాధ్యతలు అప్పగించడంతో వాళ్లు కమీషన్లు ఇచ్చినవాళ్ల పేర్లను అర్హుల లిస్టులో చేర్చినట్లు ప్రాథమికంగా తేలింది. మరోవైపు కడెం మండలం ఆలంపల్లి, కుబీర్ మండలంలోని ఫకీర్ నాయక్ తండాకు చెందిన గిరిజనులు కూడా ఇలాంటి ఆరోపణలతో ఆర్డీవోకు, కలెక్టర్​కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతున్నది. ఖానాపూర్ మండలం జిల్లేడుగుంట గ్రామంలో అర్హులను పక్కనపెట్టారంటూ అక్కడి గిరిజనులు ఆందోళనకు దిగారు.  

20 గుంటలకు అప్లై చేస్తే.. 4 ఎకరాలకు పట్టా ​

మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలానికి చెందిన ఒక రైతు పోడు పట్టా కోసం పెట్టుకున్న అప్లికేషన్​ను గ్రామ స్థాయిలో ఫారెస్ట్​ రైట్స్​ కమిటీ (ఎఫ్​ఆర్సీ) పరిశీలించింది. గూగుల్​ మ్యాప్​, జీపీఆర్​ఎస్​ కొలతలతో ఆయనకు 20 గుంటల భూమికి పట్టా ఇవ్వాలని సిఫార్సు​ చేసింది. అయితే, ధరణి ఆపరేటర్​ ఆ వివరాలను 4 ఎకరాలుగా నమోదు చేసిండు. సదరు రైతుకు 20 గుంటలకు బదులు 4 ఎకరాలకు పట్టా వచ్చింది. మరో గ్రామంలో ఎఫ్​ఆర్సీ చైర్మన్​కు ఇదివరకే 12 ఎకరాల రెవెన్యూ భూమి,  4.20 ఎకరాలకు సంబంధించి పోడు పట్టా ఉంది. ఆయన పోడు భూముల కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. కానీ ఆయన ఇద్దరు పిల్లల పేరిట చెరో 8 ఎకరాల చొప్పున 16 ఎకరాలకు పోడు పట్టాలు వచ్చాయి. 

ఇచ్చింది ఆరుగురికి.. అందులో ముగ్గురు నాన్​ట్రైబల్సే

నిర్మల్​ జిల్లా డ్యాంగాపూర్​లో 20 ఎకరాల పోడు భూములకు ఇటీవల హక్కు పత్రాలు అందజేశారు. పట్టాలు అందుకున్న ఆరుగురిలో ముగ్గురు నాన్ ట్రైబల్స్. వీరిలో ఇద్దరు బీసీలకు రెండు ఎకరాల చొప్పున, ఒక ఎస్సీకి ఎకరం ఇచ్చారు. ఇక్కడ సుమారు 20 మంది వరకు అర్హులైన గిరిజనులు ఉండగా.. వాళ్లను పక్కనబెట్టారు. దీంతో బాధితులు కలెక్టర్​ను కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్​ విచారణకు ఆదేశించగా..  అక్రమాలు జరిగినట్లు తేలింది.

పంచాయతీ ఆఫీసుకు తాళం వేసి నిరసన

నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం సైద్​పూర్​ తండాకు చెందిన గిరిజనులు ఇటీవల గ్రామ పంచాయతీ ఆఫీసుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. పోడు పట్టాల కోసం 220 మంది అప్లికేషన్​ పెట్టుకోగా.. 83 మందినే అర్హులుగా ప్రకటించారని తెలిపారు. లంచాలు తీసుకొని అర్హులను ఎంపిక చేస్తున్నారని, తమకు ఎందుకు పట్టాలివ్వడం లేదని నిలదీశారు. 

మాకెందుకు పోడు పట్టాలు ఇవ్వరు?

తాత ముత్తాతల నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న తమకెందుకు పోడు పట్టాలు ఇవ్వరని ఈ నెల 6న ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మంగి గ్రామానికి చెందిన ట్రైబల్స్​ ఆందో ళన చేపట్టారు. కుమ్రంభీం చౌరస్తా వద్ద నిరసనకు దిగారు. బీట్ ఆఫీసర్ , పంచాయతీ సెక్రటరీ కావాలనే తప్పుడు నివేదిక ఇచ్చారని, తమకు పట్టాలు రాకుండా అడ్డుకున్నారని వారు మండి పడ్డారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అనర్హులకు ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తం

మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు, అర్హత లేని వారికి పోడు పట్టాలు వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. అర్హతలేని వారికి  పట్టాపాస్​ బుక్​లు వస్తే సీజ్ చేస్తం. సర్వే కంప్లీట్​ కాలేదని వచ్చిన సమాచారం మేరకు 1,789 మందికి పాస్​ బుక్​లను పంపిణీ చేయలేదు. అర్హత లేకుండా పోడు పట్టాలు తీసుకున్నవారిమీద, సహకరించిన వారిమీద  చర్యలు తీసుకుంటం. 

- కొమురయ్య, ఆర్డీవో, మహబూబాబాద్​