‘మానవులంతా ఒకే కుటుంబం’ అన్న హక్కులు కాపాడుకోవాలి

‘మానవులంతా ఒకే కుటుంబం’ అన్న హక్కులు కాపాడుకోవాలి

వసుదైక కుటుంబానికి అర్థం మారిపోతోంది. మానవులంతా ఒకే కుటుంబం అన్న పదానికి విలువే లేకుండా పోయింది. మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం  కృషి చేయాల్సి వస్తోంది. నిర్లక్ష్యం, తిరస్కారాలు, క్రూరమైన అకృత్యాలకు మానవ హక్కులు బలైపోతున్నాయి. నిరంకుశత్వానికి, అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్టచివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన(రూల్ ఆఫ్ లా)తో రక్షించాల్సిన అవసరం ఉంది.

ఆధునిక ప్రపంచంలోని చాలా దేశాలు చిత్రహింసలను ఆమోదించడం లేదు. అయినా కొంతమంది వ్యక్తులు ఎన్నో ఏండ్లగా  చిత్రహింసలకు గురవుతూనే ఉన్నారు.  ఆయా దేశాల్లో ఉన్న మానవ హక్కులు శాసనాలు, అంతర్జాతీయ ఒడంబడికలు దానికి కారణం కావొచ్చు. చాలా దేశాలు చిత్ర హింసలను ఆమోదించనప్పటికీ అవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయన్నది మాత్రం వాస్తవం. అయితే ఆ దేశాల్లో వాటి డిగ్రీల్లో బేధం ఉండొచ్చు. నేరస్తులని కఠినంగా శిక్షించడం గురించి ‘మను’ శాస్త్రంలో చెప్పారు. రెవెన్యూ బకాయిలను వసూలు చేయడానికి కూడా వ్యక్తులని మధ్యయుగాల్లో చిత్రహింసలకి గురి చేసేవారు. బ్రిటీష్​ వాళ్ల కాలంలో అయితే చిత్రహింసలకు గురైన వారినే ఎక్కువగా చూడొచ్చు. వీటిని తెలుసుకోడానికి ఈ.ఎఫ్. ఈలియట్‌ అధ్యక్షతన బ్రిటీష్​ ప్రభుత్వం 1854లో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
రూల్‌ ఆఫ్​ లాని దెబ్బ తీసేలా...
భారతీయ శిక్షా స్మృతిలోని సె.330లోని మూడవ, నాలుగవ ఉదాహరణలను చూస్తే ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఉదాహరణలు:
    ‘ఏ’ అనే రెవెన్యూ ఉద్యోగి రెవెన్యూ బకాయిలను ‘జడ్‌’ చెల్లించే విధంగా చిత్రహింసలకి గురి చేస్తే నేరం చేసిన వాడవుతాడు.
    రైతులు రెవెన్యూ బకాయిలను చెల్లించే విధంగా జమీందారు చిత్రహింసలకి గురి చేస్తే అతను నేరస్తుడు అవుతాడు.
రెవెన్యూ బకాయిల గురించి ఇప్పుడు మనదేశంలో వ్యక్తులను చిత్రహింసలకి గురి చేయడం లేదు గానీ కేసుల దర్యాప్తుల గురించి చిత్రహింసలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. లాకప్పు హింస, లాకప్పు మరణాలు రోజు రోజుకీ పెరిగి ‘రూల్‌ ఆఫ్​ లా’ ఉనికినే దెబ్బతీస్తున్నాయి. ఈ విషయాన్నే జాతీయ పోలీస్​ కమిషన్‌ తన మూడవ నివేదికలో పేర్కొని ఆందోళనని వ్యక్త పరిచింది.
కస్టోడియల్‌ చిత్రహింసలు..
విశ్వజనీన మానవ హక్కులు ప్రకటనలోని ఆర్టికల్‌ 5, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 21, 22 లో ఈ చిత్రహింసల నుంచి రక్షణని కల్పిస్తున్నప్పటికీ చిత్రహింసలు, క్రూర అమానవీయ చర్యలకి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సర్వ సభ్యుల సభ డిసెంబర్‌‌ 10, 1984లో విశ్వజనీన మానవ హామీలు ప్రకటనని ఆమోదించినప్పటికీ వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా చిత్రహింసలకి గురవుతూనే ఉన్నారు. ఈ కస్టోడియల్‌ చిత్రహింసలకి, మరణాలకి ఎక్కువగా గురవుతున్న వ్యక్తులు బీదవాళ్లు, బలహీన వర్గాల ప్రజలు. భయం వల్ల పేదరికం వల్ల, ఏమీ తెలియనితనం వల్ల బాధితులు నిశ్శబ్దంగా చిత్రహింసలని భరిస్తూనే ఉన్నారు. అలాంటి చర్యలను వీళ్లు వ్యతిరేకంగా తీసుకోలేకపోతున్నారు. మానవ హక్కులకి భంగం కలిగినప్పుడు వాటిని రక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంటుంది. కస్టోడియల్‌ హింస, మరణాలు రూల్‌ ఆఫ్​ లా కి చెంపపెట్టులాంటివి. ఎగ్జిక్యూటివ్‌ అధికారాలు చట్టం ద్వారా వచ్చినవే. చట్టం ద్వారా నియంత్రించాల్సినవే. దేశ పౌరులకి రక్షణ కల్పించాల్సిన వ్యక్తులే ఈ మానవ హక్కులకి భంగం కలిగిస్తున్నారు. యూనిఫారమ్‌ని, అధారిటీని రక్షణ పెట్టుకుని నిస్సహాయ వ్యక్తులపై నాలుగు గోడల మధ్య చేస్తున్న నేరాలే ఇవి.
చట్ట ప్రకారం తీసుకోని చర్యలు..
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వ్యక్తులని, అనుమానితులని చిత్రహింసలకి రోజూ గురి చేస్తూనే ఉన్నారు. దళిత యువకుడగు రొయ్య శ్రీనివాసులని పోలీసులు నల్గొండ జిల్లాలో నవంబర్‌‌ నెలలో చిత్రహింసలకి గురి చేశారన్న వార్తలు ప్రముఖ దిన పత్రికల్లో చోటు చేసుకున్నాయి. శ్రీనివాసుల కుటుంబ సభ్యులతో పోలీసులు చేసిన బేరసారాలు, వీడియో రూపంలో సాంఘిక మాధ్యమాల్లో కన్పిస్తున్నాయి. శ్రీనివాసులు కుటుంబ సభ్యులు అవన్నీ తీసేటప్పుడు కేసులో పోలీసులు ఇరికించి చిత్రహింసలకు గురి చేశారని, దానివల్ల అతని కుడికాలు విరిగిందని అంటున్నారు. నల్గొండ పోలీసు ఎస్పీ ప్రకారం శ్రీనివాసులు ఓ చీటింగ్‌ కేసులో ఉన్నాడని, అతన్ని పోలీస్‌ స్టేషన్‌కి పిలిపించి పంపించి వేశారని, సాంఘిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న వీడియోలు అన్నీ నకిలీవి. ఈ విషయం గురించి విచారణ జరిపిస్తామని అన్నారు. పోలీసు విచారణ శాఖ సతీష్​ చోడగిరి విచారణ జరిపి, విషయ సేకరణ చేసి పోలీసుల తప్పిదం ఉందని ఎస్పీ రంగనాథ్‌కు నివేదికను సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా నల్గొండ రెండవ టౌన్‌లోని ఇద్దరు పోలీసు అధికారులని సస్పెండ్‌ చేయాలని సిఫారసు చేశారు. ఈ సిఫారస్‌ ఆధారంగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌‌ సి.నర్సింహులు, కానిస్టేబుల్‌ నాగుల మీరాని సస్పెండ్‌ చేస్తూ సి.ఐ.జి. ఎ.సి. కమలాసన రెట్ట ఉత్తర్వులు జారీ చేశారని కూడా పత్రికల్లో వార్తలు కన్పించాయి. ఈ చర్యలు గాయానికి కారం పూయడం లాంటివి. కానీ, చట్ట ప్రకారంగా పోలీసులు చర్యలు తీసుకునేవి కొన్ని ఉన్నాయి.
పోలీసుల ప్రవర్తనా తీరు..
నేరం ఒప్పుదల ప్రకటన కోసం, సమాచారం కోసం  ఓ వ్యక్తిని గాయపరిస్తే అది భారతీయ శిక్షాస్మృతిలోని సె.331 ప్రకారం కాగ్నిజబుల్‌ నేరమా? నాన్‌ కాగ్నిజబుల్‌ నేరమని ఈ కేసు విచారణని సెషన్స్‌ కోర్టు చేస్తుంది. కస్టడీలో ఉన ఆ దళిత వ్యక్తి కుడికాలు విరిగేలా కొడితే అది భారతీయ శిక్షాస్మృతిలో సె. 331 ప్రకారం శిక్షార్హులు. ఒకవేళ ఆ పోలీస్‌ అధికారులు దళితేతరులు అయితే వాళ్లు షెడ్యూల్డు, కులాలు, తెగల చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. కాగ్నిజబుల్‌ నేర సమాచారం అందినప్పుడు పోలీసులు తమకు తాముగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెయ్యాలి. అలాంటి చర్యలని ఈ కేసులో పోలీసులు తీసుకున్నట్టుగా అన్పించడం లేదు. ఆ విషయానికి వస్తే ఏ కేసులో కూడా పోలీసులు, తమ సహోద్యోగులు నేరం చేస్తే కేసు నమోదు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. శాఖా పరమైన దర్యాప్తు జరిపి ఆ తప్పిదాలకు పాల్పడిన పోలీసు అధికారులని సస్పెండ్‌ చేయడమే గొప్పతనంగా అనిపిస్తుంది. పోలీసులు ఈ విధంగా నిర్వాహకులుగా ఉంటారని సుప్రీంకోర్టు ప్రకాష్​ సింగ్‌, యూనియన్‌ ఆఫ్​ ఇండియా కేసులోని ఏడవ ఆదేశం ప్రకారం ప్రతి రాష్ట్రంలో పోలీస్‌ కంప్లయింట్‌ అధారిటీస్‌కి అదే విధంగా స్టేట్‌ సెక్యూరిటీ కమిషన్​ని ఏర్పాటు చేయాలి. దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వీటి ఏర్పాటు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెండుసార్లు మన హైకోర్టు, కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసిన తర్వాత వీటిని ఏర్పాటు చేస్తూ 7.7.2021వ రోజున జీవో ఆర్‌‌.టి. నెం: ఆ 93ని జారీ చేసింది. కానీ అవి కాగితం మీదనే ఏర్పాటు అయ్యాయి. కోర్టు ధిక్కరణ కేసులోనే మన ప్రభుత్వ పాలన  ఈ విధంగా ఉంటే మిగతా విషయాల్లో ఏ విధంగా ఉందో అది తెలంగాణ ప్రజలకే తెలియాలి.
పోలీసులు న్యాయబద్ధంగా పనిచేయాలి..
పోలీసులు న్యాయబద్ధంగా పని చేయాలని ఏ ప్రభుత్వమూ అనుకోవడం లేదు. తాము చెప్పినట్టు మాత్రమే పని చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. అదే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని 113వ లా కమిషన్‌ కస్టోడియల్‌ హింసను తగ్గించడం భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో ఓ కొత్త నిబంధనని సె.114. బిని ఏర్పాటు చేయాలని సిఫారస్‌ చేసింది. ఆ నిబంధన ప్రకారం – ఎవరైనా వ్యక్తులకి శారీరక గాయాలు పోలీసులు చేశారని ఆరోపిస్తే, ఆ వ్యక్తికి అవి పోలీస్‌ కస్టడీలో ఉన్నప్పుడు అయ్యాయని సాక్ష్యం ఉంటే ఆ కాల వ్యవధిలో ఏ పోలీస్‌ అధికారి అధీనంలో ఆ వ్యక్తి ఉన్నాడో ఆ పోలీసు అధికారి
 ఆ గాయాలు చేశారన్న నిజమనే భావనకి కోర్టు రావాల్సి ఉంటుంది. ఈ సిఫారస్‌ చేసి దశాబ్దాలు గడిచినప్పటికి ఏ ప్రభుత్వమూ ఆ నిబంధనని చేర్చడానికి ఆసక్తిని చూపలేదు. ఈ విషయాలను గమనించి సుప్రీంకోర్టు డి.కె.బసు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్​ వెస్ట్‌ బెంగాల్‌, ఏఐఆర్‌‌ 1997 ఎస్‌సి 610 కేసులో ఇలా అభిప్రాయ పడింది. కస్టోడియల్‌ నేరాలకి ఎలాంటి శిక్ష లేకుండా పోయినట్లైతే నేరస్తులకి ఉత్సాహం వస్తుంది. సమాజం నష్టపోతుంది. నేర బాధితులకి నిరుత్సాహం కలుగుతుంది. శాసనం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది అదే. ప్రభుత్వం, అధికారులు, కార్య నిర్వాహక వ్యవస్థ ఎప్పుడు గుర్తిస్తుందో మరి.

మానవ హక్కుల కమీషన్​ ప్రయోజనం..
మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినప్పుడు చర్యలు తీసుకోవడానికి ఉన్న మరో సంస్థ – రాష్ట్ర మానవ హక్కుల సంస్థ. ప్రభుత్వ అధికారులు మానవ హక్కులు ఉల్లంఘన చేసినప్పుడు వాటిని విచారించి తగు ఆదేశాలు ఆ చట్ట ప్రకారం జారీ చేయవచ్చు. కానీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సరైన చర్యలు తీసుకోలేకపోతోంది. ఈ మానవ హక్కుల కమిషన్ల గురించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ బి. లోకూర్‌‌ మాటలని ఓ సారి మనం గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘‘జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఏమీ చేయడం లేదు. ఏ మాత్రం పని చేయడం లేదు. మణిపూర్‌‌ ఎన్‌కౌంటర్ల గురించి ఏమీ మాట్లాడ లేదు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు అంటే! వాటి గురించి ఎవరే ఏమీ మాట్లాడదు. ఆ సంస్థలు ఉండటం వల్ల ఏమీ ప్రయోజనం లేదనిపిస్తోంది. ట్రిబ్యునల్స్‌ని రద్దు చేశారు. వీటిని కూడా రద్దు చేయండి.” అదే పోలీస్‌ కంప్లయింట్‌ అధారిటీస్‌ కూడాం చాలా రాష్ట్రాల్లో ఏర్పాటు కాలేదు. సివిల్‌ సొసైటీకి ఏమి చేయాలో అర్థం కావడం లేదు. అని కూడా జస్టిస్‌ లోకూర్‌‌ అన్నారు. కాని సమాజంలో అసమానతలు తొలగాలంటే మానవ హక్కుల కమిషన్‌ ‌బాధ్యతతో వ్యవహరించాలి. దాని వల్ల వచ్చే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేయాలి. -మంగారి రాజేందర్‌‌, రిటైర్డ్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి