గోల్డ్​లోన్లకు మస్తు గిరాకీ .. పీఎస్​బీల్లో తక్కువ వడ్డీ

గోల్డ్​లోన్లకు మస్తు గిరాకీ .. పీఎస్​బీల్లో తక్కువ వడ్డీ
  • వడ్డీరేట్లు తక్కువ ఉండటమే కారణం
  • ఈ మార్కెట్లో ఎన్​బీఎఫ్​సీలదే హవా

న్యూఢిల్లీ: తక్కువ వడ్డీ, తక్కువ సమయంలో నగదు చేతికి రావడం వల్ల మనదేశంలో గోల్డ్ లోన్లకు డిమాండ్​ బాగా పెరుగుతోంది. ధరల పెరుగుదల, బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల మధ్య  పోటీ వల్ల కూడా తక్కువ వడ్డీకి ఇవి లభిస్తున్నాయి. క్రిసిల్​ రేటింగ్స్ నివేదిక ప్రకారం, మే 2024తో పోలిస్తే జూన్ 2024లో గోల్డ్ లోన్ డిమాండ్ 20శాతం పెరిగింది. అంతకుముందు క్వార్టర్​తో పోలిస్తే జూన్​ క్వార్టర్​ జారీ అయిన లోన్ల సంఖ్య 12 శాతం ఎక్కువగా ఉంది.

నాన్-–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్​బీఎఫ్​సీలు) ఈ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో (ఏయూఎంలో) 90శాతం వాటా వీటిదే ఉంది. ఈ ఎన్​బీఎఫ్​సీలు 60–-65శాతం లోన్- టు-వాల్యూ (ఎల్​టీవీ) ఇస్తుండటంతో ఎక్కువ మంది వీటి దగ్గర బంగారాన్ని కుదువ పెడుతున్నారు. అంటే బంగారం విలువలో ఇవి 65 శాతం వరకు అప్పు ఇస్తున్నాయి.  గోల్డ్ లోన్ ధరలు పెరగడం వల్ల బంగారం రుణాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఎల్​టీవీ నిష్పత్తి 2012లో 60శాతం నుంచి ప్రస్తుతం 75శాతానికి పెరిగింది. బంగారం అధిక విలువను ఇది ప్రతిబింబిస్తుంది.   

వడ్డీరేట్లు ఇలా...

మనదేశంలో ఎస్​బీఐ అత్యల్పంగా 8.70 శాతం వడ్డీని మాత్రమే తీసుకుంటోంది. ఈ రేటు రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉన్న రుణాలకు వర్తిస్తుంది. చెల్లింపు గడువును​ 36 నెలల వరకు పొడిగించుకోవచ్చు.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్లు 8.45శాతం నుంచి 8.55శాతం మధ్య ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్ రేట్లు 8.65శాతం నుంచి 10.40శాతం వరకు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్,  ఇండియా ఇన్ఫోలైన్  వంటివి 17 శాతం వరకు వసూలు చేస్తున్నాయి. ఈ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎల్టీవీ వంటివి అధికంగా ఉండవచ్చు. చాలా మంది ప్రొవైడర్‌‌‌‌‌‌‌‌లు తక్కువ రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.1.5 కోట్ల వరకు అప్పులు ఇస్తున్నారు. ఎల్టీవీ నిష్పత్తి ఎక్కువగా ఇవ్వడం, తక్కువ ప్రాసెసింగ్ ​ఫీజు తీసుకోవడం, ముందస్తు చెల్లింపు చార్జీలను వసూలు చేయకపోవడం వంటి ఫీచర్లు ఉన్న లెండర్​ నుంచి అప్పులు తీసుకోవడం మంచిదని ఎనలిస్టులు చెబుతున్నారు.