వాగు ఉధృతికి 2014 నుంచి 10 సార్లు తెగిన రోడ్డు

వాగు ఉధృతికి 2014 నుంచి 10 సార్లు తెగిన రోడ్డు
  • వారం కింద మళ్లీ కొట్టుకుపోవడంతో రాకపోకలు బంద్
  • జూన్‌‌4న బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌‌ రెడ్డి 
  • రెండు నెలలైనా టెండర్ల దశ కూడా దాటని పనులు

మహబూబ్​నగర్​/అడ్డాకుల, వెలుగు: కందూరు పెద్ద వాగు పొంగితే నాలుగు గ్రామాల ప్రజలు ఆగం అవుతున్నారు. వరదొచ్చిన ప్రతిసారి రోడ్డు కొట్టుకుపోతుండడంతో మహబూబ్‌నగర్‌‌ జిల్లా అడ్డాకుల మండలంలోని వర్నె, ముత్యాలంపల్లి, కన్మనూరు, బలీదుపల్లికి రాకపోకలు బంద్‌‌ అవుతున్నాయి. కొట్టుకుపోయిన ప్రతిసారి మట్టిపోయడం, వాగొచ్చి మళ్లీ తెగడం కామన్‌‌గా మారింది. 2014 నుంచి ఇప్పటివరకు10 సార్లు రోడ్డు కొట్టుకుపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో బ్రిడ్జి కట్టాలని స్థానిక ప్రజల డిమాండ్ మేరకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా రూ.18 కోట్లు మంజూరు అయ్యాయి.  ఐటీ మున్సిపల్‌‌ శాఖ మంత్రి కేటీఆర్‌‌‌‌, ఆర్‌‌‌‌అండ్‌‌బీ శాఖ మంత్రి  వేముల ప్రశాంత్​రెడ్డి జూన్‌‌4న బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  

టెండర్ల దశ కూడా దాటలె..

వర్నె, ముత్యాలపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణం కోసం 2016లో మొదటి సారిగా ప్రపోజల్స్​ పంపారు.  కానీ, 2021లో రూ. 18 కోట్లతో అడ్మినిస్ట్రేషన్‌‌ శాంక్షన్​ ఇచ్చారు.  ఇందులో రూ. 9 కోట్లతో 320 మీటర్ల బ్రిడ్జి, మరో రూ.9 కోట్లతో  నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు వేయాల్సి ఉంది.  ఈ పనులకు ఈ ఏడాది జూన్​ 4న మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.  అనంతరం ఆఫీసర్లు  టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌‌‌‌కు పనులు అప్పగించాల్సి ఉన్నా.. ఇంత వరకు ఆ పని చేయలేదు.  బ్రిడ్జి పనుల వరకు టెండర్లు పిలువగా లక్ష్మయ్య అనే కాంట్రాక్టర్​ పనులు దక్కించుకున్నారు. కానీ, ఈయనతో ఇంకా అగ్రిమెంట్​ కుదుర్చుకోలేదు.  ఈ విషయంపై ఆర్​అండ్​బీ ఆఫీసర్లను సంప్రదించగా బ్రిడ్జి పనులకు టెండర్లు పూర్తయ్యాయని, వర్షాకాలం పూర్తయిన తర్వాత పనులు స్టార్ట్​ అవుతాయని చెప్పారు. రోడ్డు పనులకు సంబంధించి ఇంకా ఆర్డర్లు రాలేదన్నారు.

ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి

కందూరు పెద్ద వాగు పొంగిన ప్రతిసారి వర్నె, ముత్యాలంపల్లి మధ్య ఉన్న రోడ్డు తెగి ఈ రెండు గ్రామాలతో పాటు బలీదుపల్లి, కన్మనూరు గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి.  దీంతో ఈ నాలుగు  గ్రామాల్లో  ఉన్న దాదాపు 8 వేల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు పది సార్లు రోడ్డు తెగిపోగా ఆఫీసర్లు తాత్కాలికంగా మట్టి రోడ్డును వేస్తున్నారు.  వారం క్రితం కుసిరిన వర్షాలకు వాగుకు భారీగా వరద రావడంతో మళ్లీ  తెగిపోయింది.  దీంతో కన్మనూరు, బలీదుపల్లి మీదుగా ఎన్​హెచ్​-44 మధ్య, వర్నె, ముత్యాలంపల్లి, పేరూరు, వెంకంపల్లి మీదుగా దేవరకద్రకు రాకపోకలు నిలిచిపోయాయి.  ఎమర్జెన్సీ అవసరాలకు కూడా పట్టణాలకు వెళ్లలేకపోతున్నామని,  ప్రస్తుతం వర్నెలో11 మంది, ముత్యాలంపల్లిలో 9 మంది గర్భిణులు ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు.  

తిండి గింజలకు తిప్పలైతుంది 

రోడ్డు కొట్టుకుపోయి నప్పుడుల్లా  తిండి గింజలకు కూడా తిప్పలైతుంది.  బ్యాంకుకు పోయి పైసలు తెచ్చుకుందామన్నా అడ్డాకులకే పోవాలె. చేతిలో చిల్లిగవ్వ లేక మస్తు ఇబ్బంది పడుతున్నం. ఈ బ్రిడ్జి ఎప్పుడు కట్టిస్తరో అప్పుడే మా సమస్యలు తీరుతయి.

- సరళ, వర్నె గ్రామం

పనులు చేస్తలేరు

ప్రతి వానాకాలంలో నరకం అనుభవిస్తున్నం. పదేళ్లుగా తాత్కాలికంగా రోడ్డు వేస్తున్నా కొట్టుకుపోతూనే ఉంది. బ్రిడ్డి కట్టాలని ఏండ్లుగా అడుగుతున్నం.  రెండు నెలల కిందట మంత్రులు వచ్చి శంకుస్థాపన  కూడా చేసిన్రు. కానీ, పనులు మాత్రం ఇంత వరకు స్టార్​ చేయడం లేదు. 

-  రాంరెడ్డి, వర్నె గ్రామం