హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళలే టార్గెట్ గా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మెడలో బంగారం వేసుకుని మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. సిటీలో ఆరుచోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్ల దొంగలు హల్చల్ చేశారు. రెండు వేర్వేరు చోట్ల దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలోని రాజధానిలో ఉదయం 6 గంటల 20 నిమిషాలకు ఓ మహిళ మెడలో నుండి బంగారు చైన్ ను దుండగులు లాక్కెళ్లారు. మరొకటి కళ్యాణపురి లో 6:40 గంటలకు వాకింగ్ కు వెళుతున్న సమయంలో మహిళ మెడలోని పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్ర నగర్ కాలనిలోఉదయం 7:10 గంటలకు ఓ మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో సదరు మహిళ వారిని వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమీపంలోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. బైక్ పై వచ్చి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్స్ ను తర్వలో పట్టుకుంటామని చెబుతున్నారు.
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నాగేంద్ర నగర్ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న విమల అనే 70 సంవత్సరాల మహిళ మెడలో నుంచి ఐదు తులాల మంగళసూత్రం గొలుసును ఇద్దరు వ్యక్తులు బైక్ వచ్చి ఎత్తుకెళ్లారు. ఉదయం 7:10 గంటల సమయంలో ముగ్గు వేసి ఇంటి ముందు నిల్చున్న ఆమెను పువ్వులు కావాలి అని ఆమెని దృష్టి మరల్చి మెడలోని గొలుసు లాక్కెళ్లారు. 8 గంటలకు చిలకలగూడ పీఎస్ పరిధిలోని రామాలయం గుండు దగ్గర కూడా మహిళ మెడలోని పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు.సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. పాలు తేవడానికి వెళుతున్న జేతిన్ అనే మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు లాక్కుని చైన్ స్నాచర్ పరారైయ్యాడు. నిందితుడు బైక్ పై వచ్చి దొంగతనానికి పాల్పడినట్టు బాధితురాలు చెబుతుంది.
మహిళల మెడలోని బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్న దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన గ్యాంగ్ గా అనుమానిస్తున్న అంతరాష్ట్ర ముఠా హైదరాబాద్ లో వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నట్లుగా భావిస్తున్నారు. ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైల్వే స్టేషన్ల ప్లాట్ ఫామ్ లపై క్షుణ్ణంగా తనిఖీలు చేస్తామని చెబుతున్నారు. ఎయిర్ పోర్టులో కూడా చెకింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
చైన్ స్నాచర్స్ ను పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్లు
చైన్ స్నాచర్స్ ని పట్టుకోవడానికి పోలీసులు టీమ్ లుగా విడిపోయి సెర్చింగ్ చేస్తున్నారు. రామ్ గోపాల్ పేట్ పీఎస్ పరిధిలో స్నాచర్స్ బైక్ వదిలేసి వెళ్లినట్టు గుర్తించారు. TS 12 ES 7408 పల్సర్ బైక్ పై ఇద్దరు తిరుగుతూ స్నాచింగ్ కు పాల్పడినట్టు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. బైక్ ని రికవరీ చేసి పీఎస్ కు తరలించారు. చైన్ స్నాచర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు...ప్లాట్ ఫామ్ లపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు వెంటనే తెలియజేయాలని పోలీసులు సూచిస్తున్నారు.