భోపాల్ : అతడో దొంగ. మ్యూజియంలోని పురాతన కళాఖండాలు, నాణేలను కొట్టేయాలని ప్లాన్ చేశాడు. మ్యూజియంలోకి వెళ్లి మూసేసే సమయంలో అందులోనే దాక్కున్నడు. సిబ్బంది తాలం వేసి వెళ్లిపోయాక బంగారు, వెండి నాణేలు, కలాఖండాలన్నింటినీ బ్యాగ్‌లో సర్దుకున్నడు. ఆపై గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి కిందపడ్డడు.
ఇంక తెల్లారేదాకా లేవలేదు. ఉదయాన్నే సిబ్బంది వచ్చి మ్యూజియం ఓపెన్ చేయడం, ఆపై పోలీసులు వచ్చి దొంగను పట్టుకెళ్లడం జరిగిపోయాయి. అచ్చం ధూమ్2 సినిమాలో హృతిక్ రోషన్ చేసిన దొంగతనం సీన్‌ను తలపిస్తున్న ఈ చోరీ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని స్టేట్ మ్యూజియంలో సోమవారం రాత్రి జరిగింది.
ఆఖరి నిమిషంలో బెడిసికొట్టింది
బిహార్‌లోని గయకు చెందిన వినోద్ యాదవ్ ఆదివారం టికెట్ కొనుక్కుని మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాడు. మూసేసే సమయంలో మెట్ల వెనక దాక్కొని లోపలే ఉండిపోయాడు. అంతా వెళ్లిపోయాక వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో విలువైన నాణేలు, వస్తువులను సర్దుకున్నాడు. తప్పించుకునే క్రమంలో 25 అడుగుల ఎత్తున్న గోడ ఎక్కబోయి కిందపడిపోవడంతో.. కాలుకి గాయమై సొమ్మసిల్లి నిద్రపోయాడు.
ఉదయాన్నే సిబ్బంది వచ్చి అలర్ట్ చేయడంతో పోలీసులు వచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి దగ్గరున్న బ్యాగ్‌లోంచి 98 బంగారు, 75 వెండి, 38 రాగి నాణేలు, బంగారు పతకాలు, 12 లోహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ గుప్తుల కాలంనాటివని, వాటి విలువ బయట మార్కెట్లో రూ.15 కోట్లదాకా ఉంటుందని పోలీసులు తెలిపారు.