నివాసంలో వచ్చే శాశ్వత మార్పును వలస అని పిలుస్తారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి లేదా పట్టణం నుంచి మరో పట్టణానికి లేదా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి అక్కడే నివాసం ఏర్పరచుకుంటే దాన్ని వలస అంటారు. ఆయా ప్రాంతాల్లో జనన, మరణాల రేటు అదుపులో ఉన్నా వలసల వల్ల జనాభా పెరగవచ్చు. లేదా తగ్గవచ్చు. వలస అనేది ఒక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయపరమైన అంశం.
వలసలు రకాలు
ఒక ప్రాంతం లేదా సరిహద్దుననుసరించి వలసలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. అంతర్గత వలస, అంతర్జాతీయ వలస.
అంతర్గత వలసలు : ఒక దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే వలసలు.అంతర్జాతీయ వలసలు: ఒక దేశ సరిహద్దును దాటి ఇతర దేశాలకు, ఇతర దేశాల నుంచి మన దేశానికి కొనసాగే వలసలు. వీటిని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
ఇమిగ్రేషన్ : ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చే వలసలు.
ఎమిగ్రేషన్ : దేశం నుంచి విద్య, ఉపాధి అవసరాల కోసం ఇతర దేశాలకు జరిగే వలసలు.
ఒక ప్రాంతంలో వచ్చే స్థూల మార్పుల వల్ల జరిగే వలసలు
సాంప్రదాయ వలస : సాంఘిక కట్టుబాట్లు వల్ల తప్పనిపరిస్థితిలో జరిగే వలసలను సాంప్రదాయ వలస అంటారు.
ఉదా : వివాహం తర్వాత స్త్రీలకు జరిగే వలస.
చెయిన్ మైగ్రేషన్ : బంధుత్వాల వల్ల ఈ వలస జరుగుతుంది. ప్రజలు తమకు సంబంధ బాంధవ్యాలు కలిగిన ప్రాంతాల మధ్య జరిపే వలసలను చైన్ మైగ్రేషన్ అంటారు.
బలవంతపు వలసలు : జాతుల మధ్య వైరాలు, మత, రాజకీయ కారణాల వల్ల బలవంతపు వలసలు జరుగుతాయి.
ఉదా : దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఇండియాకు కొంత మంది మత కారణాల వల్ల వలస వచ్చారు.
అక్రమ వలసలు : పరిమితులు, చట్టం, న్యాయ నిబంధనలను ఉల్లంఘించి జరిగే గత వలసలను అక్రమ వలసలు అంటారు.
ఉదా : బంగ్లాదేశ్ నుంచి చెక్మా శరణార్థులు, మయన్మార్ నుంచి రోహింగ్యాలు భారతదేశ ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించడం.
అంతర్గత వలసల్లో సముదాయం లేదా నివాస ప్రాతిపదికన వలసలను నాలుగు రకాలుగా విభజించవచ్చు.
గ్రామాల నుంచి గ్రామాలకు వలసలు : వివాహం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైల్వేల నిర్మాణం, హరిత విప్లవం విజయవంతమైన ప్రాంతాలు, తోటల పెంపకం మొదలైన ప్రాంతాల్లో గ్రామాల నుంచి గ్రామాలకు జరిగే వలసలను సూచిస్తాయి.
గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు : ఈ వలసలకు పుల్, ఫుష్ ఫ్యాక్టర్స్ కారణం.
పట్టణాల నుంచి పట్టణాలకు వలసలు : చిన్న పట్టణాల నుంచి పెద్ద పట్టణాలకు జరిగే వలసలు. దీన్నే స్టెప్ మైగ్రేషన్ అని పిలుస్తారు.
పట్టణాల నుంచి గ్రామాలకు వలసలు : దీన్ని రివర్స్ మైగ్రేషన్ అని పిలుస్తారు. ప్రస్తుత భారతీయ సమాజంలో ఇది చాలా తక్కువగా ఉంది.
- భారతదేశంలో అంతర్రాష్ట్ర వలసలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో స్త్రీల విషయంలో వివాహం ప్రధాన కారణం. కాగా, పురుషుల విషయంలో ఉపాధిని పొందడం కోసం దేశంలో అంతర్రాష్ట్ర వలసలకు ప్రధాన కారణమవుతున్నాయి.
- దేశంలో అంతర్రాష్ట్ర వలసలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వైపు కొనసాగుతున్నాయి.
వలసలకు గల కారణాలు
భౌగోళిక కారణాలు : ప్రకృతి వైపరీత్య ప్రభావ ప్రాంతాల ఇతర సురక్షిత ప్రాంతాలకు కొనసాగే వలసలకు భౌగోళికపరమైన అంశాలు కారణంగా ఉంటాయి.
సాంఘిక, సాంస్కృతిక కారణాలు : జాతీయ, అంతర్జాతీయ వలసలో సాంఘిక, సాంస్కృతిక కారణాలు కీలకమైన పాత్ర వహిస్తాయి. వలసలను ప్రభావితం చేసే సాంఘిక కారకాల్లో ఉమ్మడి కుటుంబం, విద్య, కులం ముఖ్యం. గ్రామాల్లో జరిగే కులపరమైన హత్యాచారాల వల్ల, సంఘర్షణల వల్ల అనేక మంది ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందినవారు నగరాలకు వలసపోతున్నారు.
జనాభా లెక్కల కమిషన్ ప్రకారం
జనాభా లెక్కలు సేకరించే సమయానికి తాను జన్మించిన ప్రదేశం కాకుండా మరో ప్రదేశంలో నివసించేవారు.
గత జనాభా లెక్కల సమయంలో పోల్చితే ప్రస్తుత జనాభా లెక్కల నాటికి వేరే ప్రదేశంలో నివసించేవారు.
ప్రపంచంలో జరుగుతున్న అంతర్జాతీయ వలసల్లో నైజీరియా (51 లక్షలు), తర్వాత భారత్ (48 లక్షలు) రెండో స్థానంలో ఉంది.
ఎన్ఎస్ఎస్ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో అంతర్రాష్ట్ర (65 మిలియన్లు) వలసలు, అంతర జిల్లాలు (80 మిలియన్లు) వలసలు ఎక్కువగా ఉన్నాయి.
దేశంలో అత్యధికంగా వలసదారులను ఆకర్షిస్తున్న ప్రాంతాలు వరుసగా ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు ఉండగా, అత్యధికంగా వలసపోతున్న రాష్ట్ర ప్రజలు ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఉన్నారు.
జనాభా సంబంధ కారణాలు : జనన మరణ రేట్లు వలసను ప్రభావితం చేస్తాయి. జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉన్న దేశాల్లో ప్రజలు వలస పోవడాన్ని ప్రోత్సహించవు. అంతేకాకుండా బయట నుంచి వలస వచ్చే విదేశీయులను ప్రోత్సహిస్తాయి. ప్రస్తుతం భారతదేశం, కజకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా దేశాల నుంచి వైద్య నిపుణులు, నర్సులు, శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు అమెరికా, కెనడా, ఇంగ్లండ్, జర్మనీ దేశాలకు వలస పోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ దేశాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గడం వల్ల వివిధ సేవలు అందించే నిపుణుల కొరత ఏర్పడటమే.
ఆర్థిక కారణాలు : వలసలు జరగడానికి రెండు ప్రధానమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి.
ఎ. వికర్షక లేదా తోసే కారణాలు
- - నిరుద్యోగం
- - తక్కువ వేతనాలు
- - పంట వైఫల్యం
- - జీవన ప్రమాణాలు తక్కువగా ఉండటం
- - కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం
- - మతపరమైన, సామాజిక ఒత్తిడి
- - ప్రకృతి వైపరీత్యాలు
- - పౌర యుద్ధం
బి. ఆకర్షక కారణాలు లేదా లాగే కారణాలు
- - ఉన్నత ఉద్యోగాలు
- - అధిక వేతనాలు
- - మెరుగైన జీవన ప్రమాణాలు
- - మెరుగైన విద్య, ఆరోగ్య సేవలు
- - విలాసవంతమైన జీవితం
ప్రకృతి వైపరీత్యాలకు తక్కువ అవకాశం
సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఫుష్ ఫ్యాక్టర్స్ అధికంగా ఉండి అభివృద్ధి చెందిన దేశాల్లో ఫుల్ ఫ్యాక్టర్స్ అధికంగా ఉండి పట్టణీకరణ ప్రక్రియలో కీలకపాత్ర వహిస్తున్నాయి.